Thursday, 22 December 2011

రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత

రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత ప్రజలను వణికిస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే అత్యంత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడంతో తెల్లవారుజామున జనం బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. తతిమా రుతువులలో మార్నింగ్ వాకింగ్ కోసం వచ్చే జనంతో నగరంలో ఉదయం 4.30 గంటల నుంచే ప్రధాన వీధులు కిటకిటలాడేవి. ప్రస్తుతం 6.30 దాటుతున్నా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. వాకిళ్లు, కిటికీలు బిగించుకుని ఇంట్లో ఉంటున్నా చలి బాధ తప్పడం లేదని జనం వాపోతున్నారు. ఉదయం ఏడు గంటలు దాటుతున్నా సూర్యోదయం కాకపోవడంతో బాలభానుని నులివెచ్చని కిరణాల కోసం జనం పరితపిస్తున్నారు. నగరంలో కొన్ని పాఠశాలలు ఉదయం 5.30 గంటలకే ట్యూషన్ క్లాసులు ప్రారంభిస్తాయి. చలి దెబ్బకు పిల్లలు రాలేకపోతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా చలి బాధిస్తుండడంతో డిసెంబర్ మాసమే ఇలా ఉంటే ఇక జనవరిలో ఎలా ఉంటుందో ఊహించుకుంటూ వణికిపోతున్నారు.దుప్పటి మీద దుప్పటి కప్పుకున్నా వణుకు ఆగడం లేదు.. మోచేతుల మధ్య తల పెట్టుకుని.. కాళ్లు ముడుకుని పడుకున్న పిల్లలు ఉదయం నిద్రలేవడానికి ససేమిరా అంటున్నారు.. స్నానానికి బాత్రూంలోకి తోస్తేగానీ వెళ్లడం లేదు. ఎనిమిది గంటలు అవుతున్నా ఉదయ భానుడు దర్శనమివ్వడం లేదు. పొగలు కక్కుతున్న చాయ్ కూడా గుటుక్కున లోపలికెళుతోంది. మార్నింగ్ వాక్ కాస్తా.. ఈవెనింగ్‌కు జంప్ అవుతోంది. ఒకవేళ తప్పదనుకుంటే స్వెట్టర్లు, మఫ్లర్లు, షూ, గ్లౌజ్‌తో సైనికుల్లా వెళ్లాల్సివస్తోంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే చలి మంటలు వేసుకుని కాచుకుంటారు. అదే నగరాలలో అయితే చలి మంటలు వేసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 28-30 డిగ్రీల సెల్సియస్ కాగా రాత్రి ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తున్న నేపథ్యంలో చలి పులి విజృంభణ ఊహించుకుని జనం ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు. గాలిలో తేమ ఉదయం పూట 88-90 శాతం, మధ్యాహ్నం పూట 35-80 శాతం ఉంటోంది. ఆగ్నేయ గాలులు గంటకు 5-8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఇప్పటికే చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని స్వెట్టర్లు, మఫ్లర్లు, ఉన్ని బెడ్‌షీట్లు, ఇయర్‌బ్యాండ్స్, వేజ్‌లైన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇక్కడివారేగాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వెట్టర్లు తీసుకొని వచ్చి అమ్ముకుంటున్నారు. ఒకప్పుడు రూ.200లకు దొరికే స్వెట్టర్లు ఈ రెండు మూడు రోజుల్లో రెట్టింపు ధర పలకడం విశేషం. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడక తప్పదని సూచిస్తున్నారు. తెల్లవారుజామున నగరాన్ని మంచు దుప్పటి కప్పేస్తుండడంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయమేర్పడుతోంది.

No comments:

Post a Comment