Thursday, 22 December 2011

ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా...ఆర్‌బిఐ గవర్నర్

 దేశంలోని ఆరు లక్షల ఆవాస ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను పూర్తిస్థాయిలో విస్తరించాల్సి ఉందని, ఇందుకోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్థానిక బ్యాంకర్లు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మట్లాడుతూ ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలన్నదే ఆర్‌బిఐ ధ్యేయమన్నారు. కేవలం ఖాతాలను ప్రారంభించడమే కాక వారికి ప్రభుత్వం నుండి వచ్చే వివిధ రకాల సబ్సిడీలు ఆయా ఖాతాలకు సక్రమంగా జమ అయ్యేవిధంగా చూడటం, రుణాలు, బీమా వంటి సేవలు బ్యాంకు ఖాతాల ద్వారా జరిగేలా చూడాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండువేల జనాభా దాటిన 6,600 గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. రెండు వేల జనాభా దాటిన అన్ని గ్రామాల్లో బిజినెస్ కరస్పాండెంట్లను నియమిస్తున్నామని, వీరివల్ల బ్యాంకింగ్ సేవల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.ప్రజల ఆహారపుటలవాట్లలో మార్పులు రావడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పెరగడం తదితరాలు ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలన్నారు. అలాగే చమురు ధరలు పెరగడం కూడాద్రవ్యోల్బణం పెరగడానికి ఒక ముఖ్య కారణమన్నారు. 2011 ఆగస్టు 5 నుండి రూపాయి మారకం విలువ తగ్గుతూ వస్తోందని, ఇది దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందన్నారు. దిగుమతిదార్లతోపాటు ప్రభుత్వం, బ్యాంకర్లపై కూడా దీని ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. రెండో దశ సంస్కరణలు సక్రమ అమలుకు అన్ని బ్యాంకులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది 7 శాతం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్‌బిఐ రీజనల్ డైరెక్టర్ ఎఎస్ రావు, జిల్లా కలెక్టర్ ఎం రవిచంద్ర, ఆంధ్రాబ్యాంక్ డిజిఎం ఎవి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

1 comment:

  1. మంచి ఆలోచన.
    కానీ అంతకంటే ముందు వున్న ఖాతాదారులకు సరైన సేవలు అందించడం - ఖాతాదారుల సొమ్ముతోనే తాము సోకులు వెలగబెడుతున్నామనే స్పృహ బాంకు ఉద్యోగులలో కల్పించే శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి. కొద్ది మంది మంచి ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి .

    ReplyDelete