
ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పాలను జిల్లా కేంద్రాలకు తెప్పించి అక్కడ నుంచి పట్టణ ప్రాంతాలకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1964లో పాడిపరిశ్రమను ఏర్పాటు చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో పాల ఉత్పత్తులను పెంచేందుకు పాడిపరిశ్రమను 1974 వరకు డైరీ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ గా అనంతరం కార్పోరేషన్ గా మార్చారు. దీంతో ఈ సంస్థ అన్ని జిల్లాలోను అవస్థాపన సౌకర్యాలతో పాటు స్థిర ఆస్తులను సంపాదించుకుంది. సేకరించిన పాలను, పాల పదార్థాలను విజయ పేరుతో విక్రయిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యింది. ఈ పాడి పరిశ్రమను 1980లో కో ఆపరేటీవ్ ఫెడరేషన్ గా ప్రభుత్వం మార్పుచేసింది. కార్పోరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులను కార్పోరేషన్ కు బదిలీ చేస్తూ ఏటా వెయ్యి రూపాయల టోకెన్ రెంట్ గా నిర్ణయించారు. అటు సంస్థలో పని చేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్ విధానం ద్వారా ఉపయోగించుకునేవారు. టీడీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను డి సెంట్రలైజ్ చేయాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయిలో యూనియన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు నియమించింది. అయితే ఈ వ్యవస్థపై ఉద్యోగ, కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.పాల విక్రయధరలు, పాల ఉత్పతుల ధరలను ఫెడరేషన్ అధికారులు, ఆయా జిల్లాల ఛైర్మన్లు సమిష్టి నిర్ణయం తీసుకునేవారు. అప్పట్లో పాడిపరిశ్రమకు ఉన్న డిమాండ్ రీత్యా భారీస్థాయిలో లాభాలు రావడంతో యూనియన్లు మరింతగా బలపడ్డాయి. 1995లో టీడీపీ ప్రభుత్వం మ్యాక్స్ చట్టం ద్వారా ఫెడరేషన్ నుండి జిల్లా యూనియన్లు స్వయం ప్రతిపత్తి పేరుతో ఆయా జిల్లాల సంఘాలు ఏర్పాటు చేసింది. ఫెడరేషన్ కింద ఉన్న ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుని పాలను ఉత్పత్తి చేస్తున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధిప్రాంతాలతో పాటు అంతగా పాడిపరిశ్రమ లేని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన తరుణంలో ప్రైవేటుపరం చేయడానికి ప్రణాళికలు వేయడం సరికాదని పాల ఉత్పత్తి దారుల సంఘం నాయకులు ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ ఆర్ మ్యాక్స్ చట్టం పరిధి నుండి పాడిపరిశ్రమను మినహాయిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు తగ్గ నియమ నిబంధనలుకూడా రూపొందించింది. అయితే ప్రస్తుత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మ్యాక్స్ చట్టం కింద స్వయంప్రతిపత్తి ఉన్న యూనియన్ల నాయకులు మెుత్తం ఫెడరేషన్ నే ప్రైవేటుపరం చేసేందుకు కుట్రపన్నుతున్నారని కార్మిక సంఘం నాయకులు సాబీర్ పాష్ ఆరోపించారు.
No comments:
Post a Comment