Sunday, 23 October 2011

కర్నూలు రాజధానిని పోగొట్టుకుని రాయలసీమ అంతా ఎంతో నష్టపోయింది

                                       
కర్నూలు ప్రజలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది, వారు ఎంత దురదృష్టవంతులో ఇప్పుడు అర్థం అవుతుంది. కర్నూలు రాజధానిని పోగొట్టుకుని రాయలసీమ అంతా ఎంతో నష్టపోయింది అంటూ కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధిపై శనివారం కర్నూలులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మట్లాడుతూ కొందరు పాత రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని హైదరాబాదుకు తరలించడమే రాయలసీమకు శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదు రాజధాని అయ్యే నాటికి అక్కడ భూములు ఎకరా 20 రూపాయలు వుండేదని అదే సమయంలో రాయలసీమలో ఎకరా 800 రూపాయలకు క్రయ వియ్రాయలు జరిగేవని రికార్డులు చెబుతున్నాయని అన్నారు. అదే ఇప్పుడు హైదరాబాదు చుట్టుపక్కల భూమి కావాలంటే 20 కోట్ల రూపాయలు కావాలని, అదే రాయలసీమలో 20 లక్షలకు మించిపోవడం లేదని బాధపడ్డారు. కర్నూలు రాజధానిగా వుండి వుంటే హైదరాబాదులో జరిగిన అభివృద్ధి కారణంగా కడప, చిత్తూరు, అనంతపురం, తిరుపతి వంటి పట్టణాలతోపాటు మొత్తం రాయలసీమలోని ప్రతి వ్యక్తికి భారీ ఎత్తున సంపాదన ఆస్తి పాస్తులు వుండేవని, అదంతాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాయకులు రాజకీయాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చి రాయలసీమ అభివృద్ధి కోసం కృషి చేయాలనుకోవడం సంతోషించదగ్గ పరిణామమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో పరిశ్రమల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మి కర్మాగారాన్ని కేంద్రం చేపట్టి తద్వారా రాయలసీమ వాసులకు ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. రాయలసీమలోని వనరులను వినియోగించి అభివృద్ధిపర్చేందుకు ఎంత పెట్టుబడి అయినా పెట్టి ప్రజల కోరికను, ఆకాంక్షను నెరవేర్చకపోతే అభివృద్ధి కోసం ఉద్యమాలు వచ్చే ప్రమాదం వుందని హెచ్చరించారు

No comments:

Post a Comment