Saturday, 3 March 2012

కడప జిల్లా ఫ్యాక్షన్ అదుపులో ఉంది....జిల్లా ఎస్పీ

జిల్లాలో ఫ్యాక్షన్ అదుపులో ఉందని ఎస్పీ సుందర్‌కుమార్ దాస్ పేర్కొన్నారు. మండలంలోని ఫ్యాక్షన్ గ్రామంగా ముద్ర పడిన గండి కొవ్వూరు గ్రామాన్ని ఆయన సందర్శించారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫ్యాక్షన్ అదుపులో ఉందని, అరకొరగా జరిగిన సంఘటనలు ఫ్యాక్షన్ గ్రామాల్లో కాకుండా బయట జరిగాయన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఫ్యాక్షన్‌పై పోలీసులు డేగ కన్ను వేసినట్లు తెలిపారు. ఫ్యాక్షన్ గ్రామాల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ అదుపులో పెట్టామన్నారు. ముఖ్యంగా గండి కొవ్వూరు గ్రామంలో 1920 సంవత్సరం నుండి ఫ్యాక్షన్ కొనసాగిందని, గత రెండు దశాబ్ధాల క్రితం నుంచి గ్రామంలోని ఇరువర్గాల మధ్య ఐక్యత ఏర్పడిందన్నారు. పూర్తిగా తగ్గిపోయిందనే సందర్భంలో బయట ప్రాంతంలో ఒకదాని తర్వాత మరొకటి రెండు సంఘటనలు చోటు చేసుకుని వర్గ పోరాటాలకు ఇరువురు బలయ్యారన్నారు. అప్పటి నుండి దాదాపు రెండేళ్లుగా గండి కొవ్వూరు గ్రామంలో పోలీసుల ఫికెటింగ్ ఏర్పాటు చేసి ప్రజల్లో భయాన్ని తొలగించి ప్రశాంతతను నెలకొల్పామన్నారు. అలాగే కోర్టులకు ముద్దాయిలుగా వెళ్తున్న ఫ్యాక్షన్ గ్రామస్థులకు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఫ్యాక్షన్ గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని ఎస్పీ బంగ్లాలో వారానికి ఒక్కరోజున ఫ్యాక్షనిస్టులతో సమావేశం ఏర్పాటు చేసి వారిలో కొంత మార్పును తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈయన వెంట పులివెందుల డిఎఎస్పీ జయచంద్ర, లక్కిరెడ్డిపల్లె సిఐ సుధాకర్, ఎస్‌బిసిఐ సువర్ణ, చక్రాయపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  
 

No comments:

Post a Comment