Wednesday, 22 February 2012

టీమిండియా క్రికెట్ జట్టులో అంతర్గత పోరు!

టీమిండియాలోని అంతర్గత పోరు నిజమేనని తేలిపోయింది. రొటేషన్ కారణంగా విభేదాల గుట్టు రట్టయింది. ధోనీకి వీరేంద్ర సెహ్వాగ్ చురకలు వేయడం ద్వారా విభేదాలను బయట పెట్టారు. సీనియర్ల ఫీల్డింగ్‌పై ధోనీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సీనియర్లు మండిపడుతున్నారు. తాజాగా, సెహ్వాగ్ గొంతు విప్పాడు. మంగళవారం లంక తో ఓటమితో అనంతరం మీడియా సమావేశంలో నేరుగా ధోనీపై విమర్శలు చేశాడు. ఫీల్డింగ్‌లో మందకొడిగా ఉంటున్నామని తనకు కాని ఇతర సీనియర్లకు కానీ ఎప్పు డూ చెప్పలేదని ఆయన అన్నాడు. 'అతను ధోనీ ఏమి మాట్లాడాడో, మీడియాలో ఏ కథనాలు వస్తున్నాయో నాకు తెలీదు. వచ్చే ప్రపంచ కప్ ఇక్కడ జరుగనుండడంతో ఆ టోర్నీలో ఆడే జూనియర్లకు వన్డేల్లో అవకాశమివ్వాలని మాతో చెప్పాడు' అని సెహ్వాగ్ చెప్పాడు.సచిన్, వీరూ, గంభీర్ వల్ల ఫీల్డింగ్ సమస్యలు ఎదురవుతున్నాయని, అందువల్లే వీరిని రొటేషన్ పద్ధతిలో పక్కనపెడుతున్నామని ధోనీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్‌కు మధ్య వివాదానికి సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీలంకపై జరిగిన మ్యాచుకు ముందు తుది జట్టు కూర్పుపై ఇరువురి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. తుది జట్టులోకి తీసుకోవాల్సిన 11 మంది ఆటగాళ్లపై వారిద్దరి మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకపై ఆడే జట్టులోకి రోహిత్ శర్మను తీసుకోవాలని ధోనీ సూచించగా, ఆ మ్యాచుకు కెప్టెన్సీ చేసిన సెహ్వాగ్ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లతో ఆడడానికి మొగ్గు చూపాడు. ఈ వివాదం తెలిసి బిసిసిఐ దిగ్భ్రాంతికి గురైనట్లు చెబుతున్నారు. డ్రెసింగ్ రూంలోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలని బిసిసిఐ వారికి సూచించింది. ఈ సంఘటన తమను తీవ్ర కలవరానికి గురి చేసిందని, సీనియర్ ఆటగాళ్లు ఆ విధంగా ప్రవర్తించడం తాము ఇది వరకు చూడలేదని బిసిసిఐ వర్గాలు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. పైగా, శ్రీలంకపై ఘోరంగా ఓటమి పాలైన తర్వాత కెప్టెన్‌గా వ్యవహరించిన సెహ్వాగ్ ధోనీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

1 comment:

  1. ధోనీకి వీరేంద్ర సెహ్వాగ్ చురకలు వేయటం యేమిటి? తాను ఆడుతున్న బంతులు, చేస్తున్న పరుగులు రెండిటిని కూడినా పది దాటటం లేదని తెలిసీ ఇలా మాట్లాడుతున్నాడా? కాస్తో కూస్తో ఆడుతున్నది ధోనీయే కాని తాను జట్టుకు గుదిబండలా తప్ప ఉపయోగకారిలా లేనని తనకు తెలియటం లేదంటే అది కేవలం పొగరు తప్ప మరీమీ కాదు!

    ReplyDelete