Wednesday, 22 February 2012

కిరణ్-చంద్రబాబు శాసనసభలో తీవ్ర వాగ్వివాదం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబునాయుడికి మధ్య బుధవారం శాసనసభలో తీవ్ర వాగ్వివాదం జరిగింది. బాబు శానససభలో ప్రసంగిస్తుండగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని - చంద్రబాబు వాడిన భాషపై అభ్యంతరం తెలిపారు. మాటిమాటికీ దోచుకున్నారని, దోపిడీ చేశారని చంద్రబాబు అంటున్నారని, అదేదో గొప్పని అనుకుంటున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆవేశంతో ఉన్నారని, అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారని, అయితే ప్రజా తీర్పును చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఏ విధంగా మాట్లాడాలో ఆలోచించుకుని మాట్లాడాలని ఆయన అన్నారు.శాంతి భద్రతలు పరిస్థితి అధ్వాన్నంగా తయారయిందన్నారు. భానుకిరణ్ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. మైలవరం దుర్ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టుకు జాతీయహొదా కల్పించలేకపోవడం ప్రభుత్వం చేతగానితనంగా పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందన్నారు. రాష్ట్రంపై కేంద్రం ఎందుకు వివక్ష చూపుతోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. అవినీతి మంత్రులు ఎందుకు రాజీనామా చేయరని ఆయన ప్రశ్నించారు. మద్యం సిండికేట్ లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చినా మంత్రి రాజీనామా చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కూడా ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ఈ ప్రభుత్వం అవినీతిని నియంత్రించలేకపోతుందన్నారు. 4700 కోట్ల రూపాయల విలువైన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ని అర్హతలేని కంపెనీకి ఇచ్చి, ఆ తరువాత రద్దు చేశారన్నారు. మంత్రుల మాటలు విన్న అధికారులు జైళ్లలో ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ అవినీతి వల్ల వోక్సు వ్యాగన్ పూనేకు వెళ్లిందన్నారు. ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడకు రావడంలేదని బాధపడ్డారు. రాజీవ్ గృహ కల్పపేరుతో డబ్బు వసూలు చేసి ఇళ్లు కట్టించలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతులకు సాయం చేస్తుందంటే నమ్మాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. మిగిలిన రాష్ట్రాల్లో రైతుకు మద్దతు ధర ఉంటే మన రాష్ట్రంలోనే లేదన్నారు. కాంగ్రెసు మాటలు కోటలు దాటేలా ఉన్నా చేతలు గడప దాటడం లేదన్నారు. ఢిల్లీలో పదవుల కోసం పైరవీలే తప్ప ప్రజా సమస్యలు వీరికి పట్టడం లేదన్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారన్నారు. రాష్ట్రం నుండి 32 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ రైల్వే బడ్జెట్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేలేక పోతున్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు భారీగా ఉన్నాయన్నారు. చివరకి సిఎం పేషీలో కూడా కరెంట్ లేని పరిస్థితి ఉందన్నారు.




No comments:

Post a Comment