జిల్లా కరవుకు ప్రత్యామ్నాయంగా మెరుగైన వ్యవసాయ, అభివృద్ధి ప్రణాళిక తయారీ,
రూపకల్పన కోసం జిల్లాలో శనివారం నుంచి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి
డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ పర్యటిస్తున్నారని, కమిటీ పర్యటనకు
ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ వి. దుర్గాదాస్ అధికారులను
ఆదేశించారు. ప్రతి సంవత్సరం కరవుతో తల్లడిల్లుతున్న జిల్లా రైతులకు మేలు
కలిగే విధంగా కరవుకు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ అభివృద్ది ప్రణాళిక రచనకు
అనుగుణంగా జిల్లాలో నెలకొన్న వాస్తవ కరవు, వ్యవసాయం గురించి కమిటీకి
వివరించాలన్నారు. డాక్టర్ అయ్యప్పన్ కమిటీ జిల్లా పర్యటన ఏర్పాట్లపై
శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ వి.దుర్గాదాస్
సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర
రెవెన్యూ శాఖ మంత్రి డాక్టర్ యన్.రఘువీరారెడ్డి చొరవ వల్లే డాక్టర్
అయ్యప్పన్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎకె సింగ్ ఆధ్వర్యంలోని కమిటీ
ఈనెల 25, 26న జిల్లాలో పర్యటిస్తుందన్నారు. ఇందులో దాదాపుగా 20 మంది వరకూ
వ్యవసాయ, దాని అనుబంధ రంగాలలో నిపుణులైన శాస్తవ్రేత్తలు, అధికారులు
ఉంటారన్నారు. డాక్టర్ ఎకె సింగ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ గత నెల 18, 19, 20వ
తేదీల్లో జిల్లాలో పర్యటించిందన్నారు. దేశంలోనే అత్యున్నతమైన వ్యవసాయ
పరిశోధన మండలి ఐసిఎఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ కూడా స్వయానా
జిల్లా పర్యటనకు వస్తున్నందున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగ
పరచుకోవాలన్నారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులందరూ ఈ పర్యటనను
సద్వినియోగం చేసుకొని జిల్లాకు గరిష్టంగా ఉపయోగం కలిగే విధంగా కమిటీకి
వివరాలను నివేదించాలని కలెక్టర్ కోరారు. గత 20 సంవత్సరాల నుంచి వర్షపాతం,
వర్షాభావం, కరవు, పంటల సాగు, దిగుబడి, నేలల స్వభావం, భూగర్భ జల వనరుల
స్థితిగతులు, పాడిపరిశ్రమ, పండ్లతోటలు, పశుగ్రాసం, తాగునీరు తదితర విషయాలు,
సమస్యలపై విపులంగా కమిటీకి ఆయా శాఖల అధికారులు వివరించాలని కలెక్టర్
కోరారు. కమిటీ పర్యటిస్తున్న ప్రతి ప్రాంతానికీ ఒక సీనియర్ జిల్లా
అధికారిని లైజన్ అధికారిగా నియమించామని కలెక్టర్ వివరించారు. డాక్టర్
అయ్యప్పన్ కమిటీ పర్యటన శనివారం ఉదయం 10.30 గంటలకు పెనుకొండ గొర్రెల పెంపకం
కేంద్రంలో ఫొటో ఎగ్జిబిషన్, రైతులతో చర్చా కార్యక్రమంతో ప్రారంభం
అవుతుందన్నారు. అనంతరం కళ్యాణదుర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని
సందర్శించి అధికారులు, రైతులతో చర్చించి అదే రోజు సాయంత్రం 4.15 నుంచి ఆరు
గంటల వరకు రెవెన్యూ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, కమిటీ రిపోర్టును
కన్వీనర్ చదివి వినిపిస్తారన్నారు.
No comments:
Post a Comment