Tuesday, 3 January 2012

జగన్ లక్ష్యంగా విజయ సాయిరెడ్డి అరెస్టు?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి అరెస్టు వెనుక పెద్ద కథ నడిచినట్టుగా విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసిందని జగన్‌కు చెందిన సాక్షి దిన పత్రిక రాసింది. అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనుండటం, మరో పదహారు మంది ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదు స్పీకర్ వద్ద పెండింగులో ఉందని, ఈ నేపథ్యంలో జగన్‌ను ఏదోలా ఇరుకున పెట్టే యత్నంలో భాగంగా, సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన, కేంద్ర హోంమంత్రి చిదంబరంతో ఆయన చర్చల పర్యవసనంగానే ఈ అరెస్టు చోటు చేసుకుందన్న వాదన వినిపిస్తోందని రాసింది. విచారణలో సిబిఐకి సాయి రెడ్డి పూర్తిగా సహకరించారని, క్రమం తప్పకుండా ఆయన విచారణకు హాజరవుతున్నప్పటికీ అరెస్టు చేయడం వెనుక రాజకీయమైన ఒత్తిళ్లు పని చేశాయనే అనుమానం వ్యక్తం చేసింది.అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెసు విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే జరగబోయే ఉప ఎన్నికలు కాంగ్రెసు, టిడిపికి ఇబ్బందికరమేనని, ఈ నేపథ్యంలో జగన్ ప్రతిష్టను దెబ్బతీయాలన్న లక్ష్యం, ఒత్తిళ్ల కారణంగానే అరెస్టు జరిగిందని వాదనలు వినిపిస్తున్నాయని పేర్కొంది. ఏడాదిగా సొంత పార్టీ తలనొప్పులతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి ఎదురవుతున్న పెను సవాళ్ల నేపథ్యంలో తాజాగా సిఎం ఢిల్లీలో చిదంబరంతో సుదీర్ఘంగా చర్చించిన క్రమంలో వ్యూహాత్మకంగానే సాయి రెడ్డి అరెస్టు దిశగా అడుగులు పడినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. దీనికి రెండు రోజుల ముందే సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారని పేర్కొంది.

No comments:

Post a Comment