Wednesday, 7 December 2011

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో జాగ్రత్త..!

గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సెట్లు తమ సైట్లలో ప్రచురితమయ్యే కంటెంట్ విషయంలో జాగ్రత్తపడాలని, అభ్యంతరకర సమాచారాన్ని వెంటనే తొలగించాలని, వాటిని నియంత్రించే చర్యలు తీసుకోవాలని కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి కపిల్ సిబల్ కోరారు. ఈ సైట్లలో ఉంచుతున్న సమాచారం, చిత్రాలతో దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న వర్గాల ప్రజల మనోభావాలు, మతవిశ్వాసాలు దెబ్బతింటున్నాయని సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇకపై ఇలా జరగడాన్నిప్రభుత్వం అంగీకరించదని స్పష్టం చేశారు. ఈ సైట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనుమానిత టెర్రరిస్టుల సమాచారాన్ని కూడా వారు ఇవ్వట్లేదని మండిపడ్డారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే దీనిపై గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ఇంటర్‌నెట్ దిగ్గజాలను ప్రశ్నించామని.. నాలుగువారాల్లోగా అభ్యంతరకర సమాచారాన్ని తొలగించాల్సిందిగా కోరామని వివరించారు. అప్పట్నుంచీ పదేపదే అడుగుతున్నా వారు సరిగా స్పందించడంలేదని ఆరోపించారు. ఈమేరకు.. ఇలాంటి అభ్యంతరకర సమాచారంతో వ్యవహరించేందుకు ఒక నియమావళిని రూపొందించామని, మైక్రోసాఫ్ట్, యాహూ, గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలతో మరోమారు చర్చించామని వివరించారు. తమ ప్రభుత్వానికి పత్రికా స్వేచ్ఛపై అపారమైన నమ్మకం ఉన్నదని, అలాంటి వాటిపై పర్యవేక్షణ ఉండాలనే తప్ప సెన్సార్‌షిప్ ఆలోచనే లేదని స్పష్టం చేశారు. "ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ.. పత్రికాస్వేచ్ఛ విషయంలో జోక్యం చేసుకునే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు'' అని ప్రకటించారు. అలాంటి సమాచారం సైట్లలో ప్రత్యక్షమవగానే, వీలైనంత తొందరగా పసిగట్టి తొలగించే విధానాలను స్వయంగా రూపొందించుకోవాలని ఆయా సైట్ల నిర్వాహకులకు సూచించామని.. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సిబల్ తెలిపారు అయితే, తాము రూపొందించిన నియమావళికి సంబంధించి వారు మౌఖికంగానే స్పందించారు తప్ప రాతపూర్వక హామీ ఇవ్వలేదని తెలిపారు. "కొన్ని క్లాజులకు వారు మౌఖికంగా అంగీకారం వ్యక్తం చేశారు. కానీ రాతపూర్వకంగా అంగీకరించడానికి వెనుకంజ వేశారు. తామేమీ చేయలేమని చెప్పారని, అమెరికా నాణ్యత ప్రమాణాలనే ఇక్కడా పాటిస్తామన్నారు'' అని సిబల్ వివరించారు. అలాగైతే ఇక్కడి ప్రమాణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరామన్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందని విలేకరులు ప్రశ్నించగా.. తామేం చర్య తీసుకున్నా అన్ని పరిణామాలనూ పరిగణనలోకి తీసుకుని, మత విశ్వాసాలకు భంగం కలిగించే సమాచారాన్ని ఏ రకంగానూ అనుమతించని విధంగా నిబంధనలు రూపొందిస్తామని వివరించారు.

No comments:

Post a Comment