అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు రసవత్తరంగా ‘టికెట్’ రాజకీయం
అనంతపురం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో టీడీపీ నాయకులు
టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. తనకు టికెట్ ఇవ్వాలని
నియోజక వర్గ ఇన్‌చార్జ్ మహాలక్ష్మి శ్రీనివాస్, ..కాదు తనకే ఇవ్వాలని
ప్రభాకర్ చౌదరి, తమ కుటుంబంలో ఒకరికి కేటాయించాలని సైఫుల్లా....ఇలా
ఎవరికివారు చంద్రబాబు వద్ద వాణి వినిపించారు. తాజాగా బుధవారం సైఫుల్లా
తనయుడు జకీవుల్లా మరోసారి చంద్రబాబు వద్ద బలప్రదర్శన చేసేందుకు రాజధానికి
బయలుదేరారు. మహాలక్ష్మి శ్రీనివాస్‌కు టికెట్ దక్కనీయకుండా సైఫుల్లా,
ప్రభాకర్ చౌదరి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో
చంద్రబాబు వద్ద పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. టికెట్ ఎవరికివ్వాలో
తనకు తెలుసనని ఆయన ముగ్గురికీ చురకలంటించినట్లు తెలిసింది. ముందుగా
జనచైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని, తర్వాత టికెట్ సంగతి
తేలుస్తానని చంద్రబాబు సూచించారు. దీంతో ఈ నెల 21 నుంచి యాత్ర చేపట్టేందుకు
మహాలక్ష్మి ప్రణాళిక రూపొందించగా, టికెట్ విషయం తేల్చకుండా ప్రజల్లోకి
వెళ్లే ప్రసక్తే లేదని సైఫుల్లా పట్టుబట్టడంతో బ్రేక్ పడింది. ఎట్టకేలకు ఈ
నెల 25 నుంచి యాత్ర ప్రారంభించారు. ఇందులో సైఫుల్లా వర్గం పాల్గొనలేదు. ఈ
క్రమంలో బుధవారం సైఫుల్లా తనయుడు జకీవుల్లా తన వర్గీయులతో సమావేశం
నిర్వహించారు. అనంతరం దాదాపు వంద వాహనాల్లో హైదరాబాద్ పయనమయ్యారు.
రాజధానిలో 1,500 మందికి భోజన ఏర్పాట్లు కూడా చేశారు. టికెట్‌పై తాడోపేడో
తేల్చుకున్న తర్వాతే తిరిగి వస్తామని, అంతవరకూ అక్కడే మకాం వేస్తామని తమ
వర్గం నాయకులతో జకీవుల్లా చెప్పారు. పార్టీ కోసం తన సోదరుడిని కోల్పోయామనే
విషయాన్ని చంద్రబాబుకు గుర్తు చేసి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే యోచనలో
జకీవుల్లా ఉన్నారు. టికెట్ రాకపోతే మరో పార్టీలో చేరేందుకూ ప్రణాళిక సిద్ధం
చేసుకున్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. జకీవుల్లా తీరుపై ఇటు
మహాలక్ష్మి, అటు ప్రభాకర్ చౌదరి గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
No comments:
Post a Comment