Saturday, 24 December 2011

అనంతపురం జిల్లా లో వ్యవసాయంపై కేంద్ర కమిటీ!

అనంతపురం జిల్లా కరువును ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. వేరుశనగకు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవకాశాలు, కరువును అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అన్ని రకాల పరిస్థితులను నిశితంగా పరిశీలించేందుకు 12 మందితో ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు భారత వ్యవసాయ పరిశోధన మండలి డెరైక్టరు జనరల్, కార్యదర్శి డాక్టర్ ఎస్. అయ్యప్ప  ఉత్తర్వులు జారీ చేసినట్లు రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాసమగ్ర వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో చర్చించేందుకు జిల్లా యంత్రాంగంతో నేడు తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.జిల్లా కలెక్టరు దుర్గాదాస్‌తో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను కూడా సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిపారు. కేంద్రకమిటీ జనవరిలో ‘అనంత’లో పర్యటించి జనవరి 30లోపు జిల్లా వ్యవసాయరంగ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయశాఖతో పాటు అనుబంధశాఖలైన పశుసంవర్ధకశాఖ, హార్టికల్చర్, ఏపీఎంఐపీ, మత్య్సశాఖ, డీఆర్‌డీఏ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు శనివారం రాజధానిలో జరిగే సమావేశానికి హాజరు కావాలని మంత్రి ఆదేశించారు.

No comments:

Post a Comment