Thursday, 1 December 2011

బెజవాడ సినిమా....రివ్యూ


రక్త చరిత్ర హిందీలో ఫ్లాపు.. తమిళంలోనూ ఫ్లాపు.. కానీ తెలుగులో మాత్రం హిట్టు.. ఎందుకంటే ఆ కథాంశంపై రాష్ట్ర ప్రజలకు అంత ఆసక్తి. ఆ సినిమాకు స్ఫూర్తిగా తీసుకున్న పాత్రలో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండటం వల్లే.. అంతే తప్ప అదేదో గొప్ప సినిమా అని కాదు. రక్త చరిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు వర్మ మరో ప్రాంత చరిత్రతో జనాల ముందుకు వచ్చాడు. అదే ‘బెజవాడ’. మరి ఇందులోనూ ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందా.. ప్రేక్షకులు దీంతోనూ కనెక్ట్ అయ్యారా.. రక్తచరిత్రలాగే దీనికీ బ్రహ్మరథం పడతారా?

కాళి (ప్రభు) బెజవాడలో ఓ గ్యాంగ్ నడుపుతుంటాడు. అతనికి విజయకృష్ణ (ముకుల్ దేవ్) కుడి భుజం. కాళి ప్రత్యర్థి అయిన నానిని విజయకృష్ణ చంపడంతో కథ ఆరంభమవుతుంది. ఐతే విజయకృష్ణకు కాళి అతి ప్రాధాన్యం ఇవ్వడం అతని తమ్ముడైన శంకర్ ప్రసాద్ (అభిమన్యు సింగ్)కు నచ్చదు. తన అన్నయ్య మీదే ద్వేషం పెంచుకున్న శంకర్.. విజయకృష్ణ తమ్ముడు జయకృష్ణ (అజయ్) పెళ్లిలో కాళిని చంపిస్తాడు. అన్న స్థానంలో కుర్చీ ఎక్కుతాడు. దీంతో విజయకృష్ణకు, అతనికి శతృత్వం పెరుగుతుంది. తర్వాత తనకు అడ్డు తగులుతున్న విజయకృష్ణను కూడా చంపిస్తాడు శంకర్. శివకృష్ణ (నాగచైతన్య) విజయకృష్ణకు చిన్న తమ్ముడు. కాలేజీ కుర్రాడు. తన అన్న చావును కళ్లారా చూసి, శంకర్ పై పగ పెంచుకుంటాడు. అక్కడి నుంచి ఇద్దరి మధ్యా గొడవలు మొదలవుతాయి. ఇరు వైపులా హత్యలు జరుగుతాయి. చివరికి ఎవరు గెలిచారన్నది మిగిలిన కథ.

బెజవాడ నేపథ్యాన్ని పక్కనబెట్టి చూస్తే.. ఈ సినిమాలో ఏ ప్రత్యేకతా లేదు. కొన్ని వందలసార్లు చూసిన ప్రతీకార కథ ఇది. తన గాయం సినిమానే కొంచెం మార్చి వివేక్ కృష్ణతో రక్తచరిత్ర తీయించాడు వర్మ. ఇక టేకింగేమైనా కొత్తగా ఉందా అంటీ అదీ లేదు. రక్తచరిత్ర మూడో పార్టు చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఐతే రక్తచరిత్రకు ఉన్న ప్లస్.. ఈ సినిమాకు లేదు. అదే.. ఎమోషనల్ అటాచ్మెంట్. చలసాని పండు హత్య జరిగిన వెంటనే ‘బెజవాడ రౌడీలు’ అంటూ టైటిల్ ప్రకటించి తన మొండి ధైర్యం చూపించిన వర్మ.. సినిమా తీయడంలో మాత్రం ఆ ధైర్యం చూపలేకపోయాడు. షూటింగ్ సమయంలోనే తీవ్ర నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో బెజవాడ నేపథ్యాన్ని, నిజజీవిత క్యారెక్టర్లను సినిమాలో చూపించడానికి వర్మ బృందం సాహసించలేదు. కేవలం కొన్ని సంఘటనల్ని సినిమాలో జొప్పించడానికి ప్రయత్నించారు తప్ప.. రక్తచరిత్రలో లాగా నిజజీవిత చరిత్రల్ని, క్యారెక్టర్లను ఇందులో చూపించలేదు. మామూలుగానే  పరిటాల రవి-సూరిల పగ గురించి ఉన్నంత ఆసక్తి రంగా-నెహ్రూ శత్రుత్వంపై జనాలకు లేదు. అందులోనూ బెజవాడలో పోల్చుకోదగ్గ క్యారెక్టర్లేమీ లేకపోవడంతో జనాలకు ఎమోషనల్ అటాచ్మెంట్ కలగదు. హింస ఎక్కువైందని మహిళా సంఘాలు, పౌర సంఘాల వాళ్లు గొడవ చేయాలి తప్ప.. మా నాయకుణ్ని కించపరిచారంటూ ఎవరూ గొడవకు దిగరు. కాబట్టి రక్తచరిత్రకు వచ్చినట్లు ఫ్రీ పబ్లిసిటీ ఈ సినిమాకి రాదు. ఓపెన్ మైండ్ తో చూసినా జనాలకు ఈ సినిమా నచ్చడం కష్టమే. ఎందుకంటే సినిమాలో ఏ కొత్తదనం లేదు. అసలు ఏ ప్రతీకార కథ అయినా ప్రేక్షకులు ముందు ఫీలైతేనే ఆ ఎమోషన్ తో కనెక్ట్ అవుతారు. బెజవాడకు అంత సీన్ లేదు. హీరో వర్గం గొప్పదని, వాళ్లకు అన్యాయం జరిగిందని ప్రేక్షకులకు అనిపించే అవకాశం లేదు. అసలు హీరో క్యారెక్టర్ నాగచైతన్యకు నప్పలేదు. గాయం సినిమాలో జగపతిబాబు తరహా పాత్రలో నాగచైతన్యను చూడటం ఇబ్బందే. అతనికి వయసుకు మించిన పాత్రలా అనిపిస్తుంది. అతను చెప్పే డైలాగులు కూడా ఆ క్యారెక్టర్ పరిణతికి మించినట్లు ఉన్నాయి.
వివేక్ కృష్ణ కొత్తగా చేసిందేమీ లేదు. తన ముద్ర వేయడానికి అతనెక్కడా ప్రయత్నం చేయలేదు. గురువు రాంగోపాల్ వర్మను ఫాలో అయిపోయాడు. రక్తచరిత్రను తిరగరాశాడు. వర్మ లాగే ఎక్కువగా క్లోజప్ షాట్లతోనే సినిమా నడిపించాడు. టేకింగ్ విషయంలో కొత్త శైలి చూపకపోయినా పదునైన, అర్థవంతమైన మాటలు రాసినందుకు మాత్రం వివేక్ ను అభినందించాలి. కాళిని రాజకీయాల్లో చేరమంటే.. ‘‘జనాలు నా దమ్ము చూసి నా దగ్గరికి వస్తున్నారు.. ఇప్పుడు నేను వాళ్ల దగ్గరికెళ్లి మీరే నా దమ్ము అని చెప్పాలా’’ అనడం.. హీరో ‘‘వాడు కొడితే మీరు పడతారేమో.. కానీ నేను కొడితే వాడు పడి..పోతాడు’’ అనడం.. ‘‘కిరాయి కోసం కాల్చేవాడి గురి తప్పుతుంది కానీ.. కడుపు మండి కాల్చేవాడి గురి తప్పదు’’ ‘‘డేంజర్ మనకు కొత్త కాదు.. అన్నయ్య కత్తి పట్టినపుడే అది మన ఫ్యామిలీలో మెంబరైపోయింది’’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. కానీ సన్నివేశాలు పండక, ఈ డైలాగులు వృథా అయ్యాయి.

మాస్ హీరోగా నిలబడాలన్న నాగచైతన్య ప్రయత్నం ఈ సినిమాతో కొంచెం నెరవేరినట్లే. క్యారెక్టర్లో వెయిట్ లేదు కానీ.. అతను బాగానే చేశాడు. మాస్ లుక్స్, మేనరిజమ్స్ తో కొత్త ఇమేజ్ కు దగ్గరగా వచ్చాడు. క్లోజప్ షాట్స్ లో గత చిత్రాల కంటే మెరుగయ్యాడు. అమలాపాల్ చేసిందేమీ లేదు. హీరోతో కొంచెం రొమాన్స్ చేసున్నా సినిమాకు ఉపయోగపడేది. కానీ దర్శకుడు ఆ ప్రయత్నం చేయలేదు. ఇలాంటి సినిమాలకు అవసరం లేని రెండు డ్యూయెట్లకు మాత్రమే ఆమె ఉపయోగపడింది. అభిమన్యు సింగ్ మరోసారి భయానక పాత్రలో జీవించాడు. అతని పాత్ర రక్తచరిత్రకు పొడిగింపులా ఉంది. కోట, అజయ్, ప్రభు, ముకుల్ దేవ్ లు తమ పరిధి మేరకు నటించారు. స్కెచ్ గోపిగా బ్రహ్మానందం చేసిన కామెడీ అంతగా పండలేదు. రక్తచరిత్ర థీమ్ సాంగ్ వినిపిస్తుండగా బ్రహ్మి బండిమీద వస్తున్నపుడు మాత్రం థియేటర్ హోరెత్తిపోయింది. కానీ బ్రహ్మిని సరిగా వాడుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
అమర్ మొహిలే పాటల్లో ‘అడగకు నన్నేమి’ పాట మాత్రమే వినసొంపుగా ఉంది. ఐతే రక్తచరిత్ర లాగే ఈ సినిమాకూ పాటలు లేకపోయినా తేడా ఏమీ ఉండేది కాదు. ఏదో పెట్టాలని పెట్టారే తప్ప హీరోహీరోయిన్ల మధ్య డ్యూయెట్లు సినిమాకు ఏమీ ఉపయోగపడలేదు. బాపి-టుటిల్ ల నేపథ్య సంగీతం రక్తచరిత్రకు కొనసాగింపు మాత్రమే. అక్కడక్కడా టైటిల్ సాంగ్ థీమ్ వాడటాన్ని మినహాయిస్తే యాజిటీజ్ అదే బ్యాగ్రౌండ్ స్కోర్ ను బెజవాడకు వాడేశారు.హీరోహీరోయిన్లు ముచ్చట్లు చెప్పుకుంటున్నపుడు కూడా సీరియస్ బ్యాగ్రౌండ్ స్కోర్ (టైటిల్ సాంగ్ థీమ్) ఎందుకో దర్శకుడికే తెలియాలి.
మోటార్ సైకిల్ సైలెన్సర్ నోట్లో పెట్టి ఎక్సలేటర్ రైజ్ చేస్తూ చంపడం ఎక్కడైనా చూశారా.. జీపు పక్కగా కత్తి కట్టి.. అవతల మనిషిని మోకాలిపై నిల్చోబెట్టి బండి ముందుకు తీసుకెళ్లి తల తెగ్గొట్టడం ఎప్పుడైనా కన్నారా.. చీలల్ని నోట్లోకి కుక్కి ప్రాణాలు తీయడం ఇంతకుముందు చూశారా.. వివేక్ కృష్ణ తన క్రియేటివిటీని ఇలా ఉపయోగించాడు. ఇలాంటి సన్నివేశాల ద్వారా జనాలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు.. ఇలా కూడా చంపొచ్చని క్రిమినల్స్ కు కొత్త కొత్త ఐడియాలిస్తున్నారా? ఇలాంటి సన్నివేశాల్ని చూసి ఎంజాయ్ చేయగలిగేంత గొప్ప మనసు మీకుంటే.. వర్మ గతంలో అన్నట్లు ‘హింస కూడా వినోదమే’ అని గట్టిగా నమ్మేవారైతే ‘బెజవాడ’ చూడండి!

రేటింగ్ 1.5/5

No comments:

Post a Comment