Thursday, 1 December 2011

పూల మొక్కలతో నిండుగా కనిపిస్తున్న తిరుమల

తిరుమల కొండ అంటేనే ప్రకృతి అందాలకు పుట్టినిల్లు పుడమి తల్లి పచ్చని చీర సింగారించుకొన్నట్టు వనదేవత సిగలో పూలు తురుముకున్నట్టుంటుంది. తిరుమలలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పూల మొక్కలన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. చిరుజల్లుల తాకిడికి పూరెమ్మలు కదులుతూ చూపరులను ఆకర్షిస్తున్నాయి.  తిరుమల కొండలంటేనే చల్లని వాతావరణానికి ప్రకృతి రమణీయతకు నిలయాలు తిరుమలకు వెళ్లే యాత్రికులు వేంకటేశ్వరుని దర్శనంతో బాటు ప్రకృతి నడుమ కాస్త సేద తీరునట్లుంటుందని కూడా భావిస్తారు. గత రెండు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులకు తిరుమల కొండలన్నీ అభ్యంగన స్నానం చేసినట్టు మెరిసిపోతున్నాయి. తెల తెలవారు జామున కమ్ముకున్న పొగమంచులో కనిపించే ఆలయ శిఖరంతో బాటు వినిపించే సుప్రభాతం మనసును ఆధ్యాత్మిక తీరాలకు తీసుకువెళుతుంది. మాడ వీధులన్నీ మంచుబిందువులు నిండిన పూల పొదలతో అలరిస్తున్నాయి.  ఏడుకొండల వాడి దర్శనంతో బాటు నయనానందకర ప్రకృతి సోయగాలు చూసే అదృష్టం కలిగినందుకు భక్తులు పులకించి పోతున్నారు.

No comments:

Post a Comment