Friday, 11 November 2011

తిరుమలలో టికెట్లకు ఫొటోమెట్రిక్‌ పద్దతి

తిరుపతి: తిరుమలలో దళారులకు చెక్‌ పెట్టేందుకు అధికారులు రోజుకో కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఆర్జిత సేవా టికెట్లలో దళారుల ప్రమేయం లేకుండా చేసేందుకు ఫొటో మెట్రిక్‌ పద్దతిని ప్రవేశపెట్టారు. దీంతో దళారులనే కాదు భక్తుల్ని క్యూ లైన్లలో తోస్తున్న కొంత మంది అధికారులను కూడా నియంత్రించే వీలు కలిగింది. అన్ని దర్శన టికెట్లకు ఫొటో విధానం ప్రవేశపెట్టేందుకు టిటిడి ప్రయత్నిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే భక్తుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దళారులకు తోడు కొందరు టిటిడి అధికారుల ఇష్ట్యా రాజ్యం కూడా శ్రీవారి భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటికి చెక్‌ పెట్టేందుకు దేవస్థానం ఉన్నతాధికారులు కొత్తకొత్త విధానాల్ని వెతుకుతున్నారు ఆర్జిత సేవా టికెట్లలో దళారుల మోసాల్ని నియంత్రించేందుకు కొత్తగా ఫొటో మెట్రిక్‌ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. దీంతో భక్తులు ఇతరుల వద్ద అధిక ధరకు కొనుగోలు చేసిన ఫొటో లేని టికెట్లు చెల్లుబాటు కావు. ఫొటో లేని భక్తుల్ని క్యూ లైన్ల నుంచి తప్పిస్తారు. వేలిముద్రలు మాత్రమే అమలులో ఉన్న విధానంలో దళారులకు తోడు కొందరు అధికారులు కూడా మధ్యలో భక్తుల్ని క్యూ లైన్లలోనికి తోసేవారు. ఫొటో పద్దతి అమలులోకి వచ్చినందున దళారుల నుంచి కష్టాలు తప్పినట్లేనని భక్తులు సంతోషపడుతున్నారు. ఆర్జిత సేవా టికెట్లలో ఫొటో విధానాన్ని ప్రవేశపెట్టినట్లే ఇతర టికెట్లకు ఫొటోమెట్రిక్‌ పద్దతిని ప్రవేశపెట్టాలని టిటిడి యోచిస్తోంది.

No comments:

Post a Comment