Saturday, 15 October 2011

ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్‌గా మారిందన్నారు

విభజన పేర రాయలసీమను అడ్డంగా నరకొద్దని కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ అన్నారు. నగరంలోని రోడ్లు భవనాల అతిధి గృహంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన పేర వేల సంవత్సరాల చరిత్ర ఉన్న రాయలసీమను విడదీయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రాజకీయ లబ్దికోసం, సీట్లసంఖ్య పేర ప్రభుత్వం సీమను విడదీయాలని చూస్తోందన్నారు. అదే జరిగితే పూర్తిగా నష్టపోయేది సీమవాసులేనన్నారు. ఇప్పటికే ప్రతేకవాదులు సీమవారిని గూండాలుగా చిత్రీకరిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో సీమలోని మేథావులు, విద్యార్థుల, రైతులు సీమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ఉద్యమం బలపడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేని పరిస్థితికి వచ్చిందని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్‌గా మారిందన్నారు.
సీమలో తాగు, సాగునీటి సమస్య, కరవు, ఫ్యాక్షన్ నెలకొన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో సీమను విడదీస్తే అనంతపురం జిల్లా ఎడారిగా మారడం ఖాయమన్నారు. సీమ అభివృద్ధికి ప్రభుత్వం 30 టిసింఎంల నీరు కేటాయించాలని, రూ.50 వేల కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ టూర్ ప్యాకేజీ ప్రకటించాలన్నారు. రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే సీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని నరేష్ డిమాండ్ చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను తిరుపతి రాజధానిగా విశాల రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలన్నారు. తాను గతంలో బిజెపిలో ఉన్నపుడే ఈ ప్రతిపాదన చేశానన్నారు. విశాల రాయలసీమ కోసం త్వరలో రాజకీయాలకు అతీతంగా వేదిక ఏర్పాటుచేసి మేథావులు, రైతులు, విద్యార్థులతో చర్చించి ఉద్యమాన్ని మందుకు తీసుకువెళ్తామన్నారు. బిసి కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ విభజన పేర సీమను విడదీస్తే ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతామన్నారు. విశాల రాయలసీమ కోసం రథయాత్రలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పెనుకొండ కాంగ్రెస్ నాయకులు రమేష్, జాకీర్‌హుసేన్, సరోజమ్మ, సుధాకర్, అమర్, కబీరయాదవ్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment