Tuesday, 20 December 2011

కర్నూలు, అనంతపురంలో కొత్త పారిశ్రామికవాడలు

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొత్తగా పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ప్రయత్నాలు మొదలు పెట్టింది. అనంతపురం జిల్లా 19.13 లక్షల హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో కేవలం 10 లక్షల హెక్టార్లలో మాత్రమే వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇప్పటికే అనంతపురంలో 635 ఎకరాల విస్తీర్ణంలో భారత్ డైనమిక్ లిమిటెడ్ మిస్సైల్స్ తయారీ యూనిట్ నిర్మాణానికి అమోదం తెలిపింది. పాలసముద్రంలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో రాడార్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సంసిద్ధతతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, అత్యధిక భూములు కలిగి ఉండడంతో అనంతపురం జిల్లా పారిశ్రామికంగా అబివృద్ధి చెందే అవకాశం ఉంది. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 6653 ఎకరాల భూ సేకరణలో ఏపీఐఐసీ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 2134 ఎకరాల విస్తీర్ణంలో అనంతపురం, గుంతకల్లు, కదిరి, తాడిపత్రి, గుత్తి, సజ్జలదిన్నె, హిందూపురం, గోళ్లాపురం, పెనుకొండ, సద్దలపల్లిలో 10 పారిశ్రామికవాడలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 242 ఎకరాల విస్తీర్ణంలో ఆదోని, నంద్యాల, డోన్, ఆత్మకూరులో ఐదు పారిశ్రామికవాడలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే 11 పారిశ్రామికవాడలకు భూ సేకరణ చేసేందుకు రెవెన్యూ అధికారులతో ఏపీఐఐసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. కొత్తగా వచ్చే పారిశ్రామికవాడల కోసం అనంతపురం జిల్లా పాలసముద్రంలో 185 ఎకరాలు, గోళ్లాపురంలో 49, కొడిపిలో 786, డీహీరేహాళ్‌లో 1221, పెదవడుగూరులో 219 ఎకరాలు సేకరిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నన్నూరులో 1672 ఎకరాలు, పంచలింగాలలో 105, కల్లూరులో 106, రుద్రవరంలో 1580, దిన్నెదేవరపాడులో 657, ఆటోనగర్(ఆదోని)లో 73 ఎకరాలు సేకరించి పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయనున్నారు. ఎందుకూ పనికిరాని కొండ, గుట్టలు కలిగిన భూమిని కూడా మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసేందుకు ఏపీఐఐసీ సిద్ధంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయేతర భూముల సేకరణలో కూడా కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

1 comment:

  1. Jayao Seema. bhoomi undi. power(electricity), neeru,rawamaterial,transportaion,man power(skilled and unskilled) kuda baga lbyamavuthya seemalo?
    Factionists develop aevvanisthara attadagu vargala varini ? Yedhi emina chala govt industries ravatmu snatoshkaramayana vishayamu. Industries vala enthokontha jeevanopadhi perigi seema lo vasalsani taggisthaynipsthundi. Regional inbalances kuda taguuthanipisthundi.

    ReplyDelete