Sunday, 25 December 2011

శ్రీశైలప్రభలో ఆధ్యాత్మిక పత్రికలో నాయకుల ఫొటోలా?

శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న శ్రీశైలప్రభ ఆధ్యాత్మిక పత్రికలో రాజకీయ నాయకుల ఫొటోలు కనిపించడం విడ్డూరంగా ఉందని, ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరుగుతోందని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ అన్నారు. రాజకీయ నాయకుల ఫొటోలను పత్రికలో ముద్రించడం హేయమైన చర్య అని అన్నారు. మల్లన్న దర్శనార్థం శ్రీశైలం చేరుకున్న స్వామీజీ విలేఖరులతో మాట్లాడుతూ శ్రీశైలప్రభ పత్రిక భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక చింతనతో ప్రచురితం కావాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వివిధ రాజకీయ నాయకుల ఫొటోలతో వారికి ప్రచారం చేస్తున్నట్టుగా ఉందన్నారు. సొంత నిర్ణయాలతో ఇటువంటి చర్యలకు పాల్పడటం హేయమైన చర్యగా స్వామీజీ అభివర్ణించారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు కళ్లు తెరవాలని, ఇటువంటి కార్యకలాపాలను ప్రోత్సహించడం మానుకోవాలని స్వరూపానందేంద్ర హితవు పలికారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ఆధ్యాత్మిక చింతనతో నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల ప్రాంగణాల్లో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోందన్నారు. దాన్ని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్యమత ప్రచారానికి లోనైన ప్రజలు మతమార్పిళ్లకు పాల్పడి హిందూత్వాన్ని కాలరాస్తున్నారన్నారు. అలా జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఆయా దేవాలయాల అధికారులు, కార్యనిర్వహణ సిబ్బందిపై ఉందన్నారు. అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించేవారిని దేవాదాయ చట్టం కింద కఠినంగా శిక్షించాలన్నారు. ఈ విధంగా మతమార్పిళ్లను కొంతైనా నిరోధించవచ్చునన్నారు. గిరిజన, చెంచుగూడేల్లో శివాలయాలు నిర్మించి అన్యమత ప్రచారానికి తావివ్వకుండా చూడాలన్నారు.

No comments:

Post a Comment