అనంతపురం జిల్లాలో కాసులు కురిపిస్తున్న ఇసుక అక్రమ రవాణా!
చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందంగా అక్రమ ఇసుక రవాణాపై విజిలెన్స్
అధికారులు దాడులు నిర్వహించడంతో ఎట్టకేలకు స్థానిక రెవెన్యూ, భూగర్భజలాలు,
పోలీసు, మున్సిపల్ అధికారులు మేలుకున్నారు. హిందూపురం నియోజకవర్గంలోని
పెన్నా, చిత్రావతి, జయమంగళి నదుల్లో దశాబ్దాల కాలంగా ఇసుక అక్రమరవాణా
జోరుగా సాగడంతో అక్రమరవాణా దారులకు కాసులు పండాయి. ఇసుక అక్రమ రవాణా విషయమై
ఆయా నదీ పరివాహక ప్రాంతాలకు చెందిన ప్రజలు నిరసనలు వ్యక్తం చేసినా,
పత్రికల్లో ఎన్నోమార్లు శీర్షికలు ప్రచురితమైనా అధికారులు తూతూమంత్రంగా
చర్యలు తీసుకొని చేతులు దులుపుకోవడంతో ఇసుక అక్రమ రవాణాదారులకు అడ్డూఅదుపు
లేకుండాపోయింది. హిందూపురం మున్సిపల్ పరిధిలోని సింగిరెడ్డిపల్లి సమీపంలో
ఉన్న పెన్నానదిలో ఏకంగా సమాధులను కూడా ధ్వంసంచేసి ఇసుకను తవ్వడం ఆ ప్రాంత
వాసులను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయంపై అధికారులతో మొర
పెట్టుకున్నా ఠంఛనుగా అందుతున్న మామూళ్లతో అప్పట్లో ఏమాత్రం చర్యలు
తీసుకోలేకపోయారు. హిందూపురం రూరల్ మండల పరిధిలోని కిరికెర, తూమకుంట,
సంతేబిదనూరు, బేవినహళ్ళి పరిసర ప్రాంతాల్లోని పెన్నానదిలో ఎంతోకాలంగా ఇసుక
అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. బెంగళూరులో
లారీ లోడ్ ఇసుక ధర రూ.30 వేల దాకా ఉండటంతో ఆయా శాఖల అధికారులకు మామూళ్లు
ముట్టచెబుతూ పెద్దఎత్తున ఇసుకను తరలించారు. రాజకీయ నేతలు కూడా ఇసుక అక్రమ
రవాణాదారులకు సహకారం అందిస్తుండటం, ఆయా కార్యకలాపాలపై అధికారులు దృష్టి
సారిస్తే ఒత్తిళ్లు తీసుకురావడంవంటి కారణాలతో పెన్నానది గుంతల మయమయింది.
ఇసుక అక్రమరవాణాతో ఏర్పడిన గుంతల్లో వర్షాకాలంలో నీరు నిలబడటంతో ఈ
విషయాన్ని గమనించని ముద్దిరెడ్డిపల్లి, మేళాపురంలకు చెందిన ముగ్గురు
చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అక్రమార్కులు ముందుగా ట్రాక్టర్లను
బాడుగుకు తీసుకొని నదుల్లోని ఇసుకను పగటివేళల్లో రహస్య ప్రాంతాలకు
తరలిస్తారు. అనంతరం రాత్రి వేళల్లో ఆ ఇసుకను లారీల ద్వారా దర్జాగా
చెక్‌పోస్టుల దాటిస్తూ బెంగళూరుకు చేరవేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా
కారణంగా హిందూపురం - బెంగళూరు రహదారి అధ్వాన్నంగా తయారయింది. దీంతో పలు
ప్రమాదాలు చోటుచేసుకొని కొందరు మృత్యువాతన పడ్డారు. ఇటీవల విజిలెన్స్
అధికారులు దాడులు నిర్వహించి ఇసుక లారీలు, ట్రాక్టర్లను సీజ్ చేయడంతో
స్థానిక అధికారుల వైఫల్యం తేటతెల్లమయింది. ఇకపోతే కిరికెర, బేవినహళ్ళి
సమీపంలోని పెన్నానదిలో అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నాయకుడొకరు మూడు
సంవత్సరాలుగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తూ సంపన్నుడయ్యారు. చిన్నాచితక
వ్యక్తులు ట్రాక్టర్లలో గృహ నిర్మాణాల కోసం ఇసుకను తరలిస్తే కఠినంగా
వ్యవహరిస్తున్న అధికారులు ఆ నాయకుడు ఏకంగా జెసిబితో నదిలోని ఇసుకను తవ్వుతూ
దర్జాగా లారీల్లో బెంగళూరుకు తరలిస్తున్నా చర్యలు నామమాత్రంగా కూడా లేవన్న
విమర్శలు ఉన్నాయి. అదే విధంగా ఆ ప్రాంతానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు
కూడా అధికారులకు మామూళ్లు ముట్టచెబుతూ ఇసుక అక్రమ రవాణాను ఇప్పటికీ జోరుగా
సాగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా చిలమత్తూరు, పరిగి మండలాల
పరిధిలోని చిత్రావతి, జయమంగళి నదుల్లో కూడా కొందరు రాజకీయ నాయకులు ఇసుక
అక్రమ రవాణాను సాగిస్తూ కాసులు పండించుకొంటున్నారు. ఇసుక అక్రమ రవాణా
విషయంలో స్థానిక రెవెన్యూ అధికారులు పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులకు
మినహాయింపు ఇస్తూ మామూళ్లు దండుకుంటున్నారని ఇటీవల జాయింట్ కలెక్టర్ అనితా
రామచంద్రన్‌ను కలిసి హిందూపురానికి చెందిన కొందరు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర
వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ ఇసుక అక్రమ
రవాణాపై చర్యలు ముమ్మరం చేస్తున్న తరుణంలో స్థానిక అధికారుల్లో చలనం
ఏర్పడింది. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు, ఠంఛనుగా అందుతున్న మామూళ్ళతో
కొందరు అక్రమరవాణాదారులకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు ఆరోపణలు
వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు
తీసుకొంటే ఫలితాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
No comments:
Post a Comment