దేశ నలుమూలల విస్తరించిన ద్వాదశ జ్యోతిర్లింగాలను చూడాలంటే వేల రూపాయలు కావాలి. అనేక రోజులు తిరగాలి. కానీ... ఒక్కరోజులో వీటన్నింటిని దర్శించే అవకాశం వస్తే వదులుకోరు కదా. అయితే, హిందూపురం రండి. బెంగుళూరుకు కేవలం వంద కి.మీ. దూరంలో ఉన్న ఈ పట్టణంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయ సంస్థ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని హిందూపురంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఇండోర్ స్టేడియంలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు ఏర్పాటుచేశారు. శివ పరమాత్ముని దివ్య అవతరణ గురించి ఈ జ్యోతిర్లింగాలను ప్రదర్శిస్తున్నారు. దేవభూమియైన భారతదేశంలోని 12 తీర్థ స్థానాల్లో స్థాపించిన జ్యోతిర్లింగాలు ఎంతో మహిమాన్వితమైనవిగా ప్రజలకు తెలియచేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు. జ్యోతిర్లింగాల అన్ని రూపాలను ఒకేస్థానంలో ప్రజలు చూసి తరలించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సుగంధ చెప్పారు. గుజరాత్, శ్రీశైలం, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాంచల్ వంటి ప్రాంతాల్లో కొలువైన విశే్వశ్వరుడు, మల్లికార్జునుడు, నాగేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, ఘృష్ణేశ్వరుడు, సోమనాథుడు, రామేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, వైద్యనాథుడు, భీమశంకరుడు వంటి శివ లింగాలుప్రజలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
దర్శన వేళలు
ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు ప్రజలకు జ్యోతిర్లింగాలు దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు సైన్స్, స్పిరిచ్వుల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అలాగే మానసిక, శారీరక ఆరోగ్యం కోసం రాజయోగ శిక్షణ, ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో భక్తిపరవశం గావించు దేవతల దృశ్య రూపం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జ్యోతిర్లింగాల దర్శనానికి స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. అలాగే సైన్స్, స్పిరిచ్వుల్ ఎగ్జిబిషన్‌లోని అంశాలను తెలుసుకొనేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులు కూడా వస్తున్నారు.

No comments:
Post a Comment