Sunday, 11 March 2012

తిరుపతిలో సీసీ కెమెరాల నిఘా

గీత దాటితే జరిమానా వాహనదారులు ఇక నిబంధనలను అతిక్రమిస్తే పోలీసులకు దొరికిపోవడం ఖాయం. తిరుపతి పుణ్యక్షేత్రంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అర్బన్ పోలీసులు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రధానమైన ట్రాఫిక్ కూడళ్లలో అత్యాధునిక సీసీ కెమెరాలను అమర్చి వాహనదారుల దూకుడుకు కళ్లెం వేయనున్నారు. ఈ మేరకు అర్బన్ పోలీసు జిల్లా కార్యాలయంలో ఎస్పీ ప్రభాకర్‌రావు అధ్యక్షతన తిరుపతి మున్సిపల్ కమిషనర్ ప్రసా ద్, ఆర్టీసీ ఆర్‌ఎం నాగశివుడు, టీటీడీ సూపరింటెం డెంట్ ఇంజనీర్ సుధాకర్‌తోపాటు వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. సమావేశం అనంతరం అర్బన్ ఎస్పీ మీడియాతో మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఫర్చూన్ టెక్నాలజీ సహకారంతో నగరంలో 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. 500 మీటర్ల దూరంలోని వాహనంలో దాగి వున్న మనిషిని కూడా జూమ్ చేసి గుర్తించడం ఈ కెమెరా ప్రత్యేకతన్నారు. సమస్యాత్మకంగా ఉన్న 42 ట్రాఫిక్ సర్కిళ్లను ఇప్పటికే గుర్తించినట్లు వివరించారు. ఈ ప్రాంతంలో అత్యాధునిక స్పీడ్ డూం వైర్‌లెస్ సీసీ కెమెరాలను అమర్చనున్నట్టు తెలిపారు. కెమెరాల్లో రికార్డయిన సమాచారాన్ని కంట్రోల్ రూంకి, అక్కడి నుంచి అధికారుల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుందన్నారు.

No comments:

Post a Comment