Tuesday, 21 February 2012

రాయలసీమలో మహాశివరాత్రి ఘనంగా నిర్వహించారు

శ్రీశైలం
శిరిగిరిపై వెలసిన శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల కల్యాణం సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కనులారా చూసి తరించేందుకు సుమారు 8 లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినమైన సోమవారం ఉదయం నుంచే శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి పల్లకీ సేవ నిర్వహించిన అనంతరం తిరుమల వెంకన్న తరపున టిటిడి అధికారులు స్వామి, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించడంతో కల్యాణోత్సవ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణానికి సిద్దం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో చీరాలకు చెందిన నేత కళాకారుడు పృధ్వీ వెంకటేశ్వర్లు నేసిన సుమారు 150 గజాల పాగాను కుటుంబ సభ్యులతో కలిసి మేళతాళాల మధ్య ఆలయ ప్రదక్షణ చేశారు. అనంతరం పాగాలంకరణకు సిద్ధమవగా ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపి వేశారు. దీంతో చిమ్మ చీకట్లో పృధ్వీ వెంకటేశ్వర్లు దిగంబరంగా ఆలయంపై ఉన్న నవనందులు, ఆలయ గోపురాన్ని కలుపుతూ పాగా అలంకరించారు. పాగాలంకరణ, రుద్రాభిషేకం, కల్యాణోత్సవం తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది.
శ్రీకాళహస్తి

మహాశివరాత్రి పర్వదినమైన సోమవారం ఉదయం శ్రీకాళహస్థీశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి సర్వభూషితాలంకారులై ఇంద్రవిమానం, చప్పరం వాహనాలపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్వదిస్తూ చిద్విలాసాన్ని ప్రదర్శించారు. అదే విధంగా సోమవారం రాత్రి శ్రీకాళహస్థీశ్వరుడు నంది వాహనం, గజవాహనంపై జ్ఞానప్రసూనాంబికా దేవిలు ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. వాహనాల ముందు కేరళ పంచవాయిద్యాలు, తప్పెటగుళ్లు, లంబాడీల నృత్యాలు, కోలాటాలు, భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారులు ఆనందోత్సాహాలతో నృత్యం చేశారు. అదే విధంగా ఏనుగులు, గుర్రాలు, వృషభాలు కూడా వాహనాల ముందు నడుస్తూ భక్తులను అలరించాయి. మొత్తంమీద ఉత్సవాల ఊరేగింపుతో మహాశివరాత్రి పర్వదినం నాడు శ్రీకాళహస్తి పట్టణం నాలుగుమాడావీధులు భక్తుల హరహర ధ్వానాలతో పులకించాయి.
తిరుపతి
తిరుపతిలోని శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన సోమవారం మహాశివరాత్రి పర్వదినం రావడంతో భక్తులు పెద్దఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున రెండుగంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. 2.30గంటల నుండి 4.30గంటల వరకు అభిషేకం, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 7గంటల నుండి 9గంటల వరకు రథోత్సవం(బోగితేరు) కన్నులపండుగా జరిగింది. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ధిసారధి, మనస్సుపగ్గం. ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మశరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. ఉదయం 9గంటల నుండి 11గంటల వరకు అర్చకులు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీసోమస్కందమూర్తి, కామాక్షి దేవి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. కాగా సాయంత్రం 6గంటల నుండి రాత్రి 10గంటల వరకు నంది వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జూలకంటి బాలసుబ్రమణ్యం రచించిన, టిటిడి ముద్రించిన ‘కమనీయక్షేత్రం కపిలతీర్థం’ అనే పుస్తకాన్ని టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు జాగారం చేసేందుకు రాత్రి 10గంటల నుండి 12గంటల వరకు హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు. ఆ తరువాత రాత్రి 12గంటల నుండి మంగళవారం తెల్లవారుజామున 4గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహించారు.

No comments:

Post a Comment