Friday, 2 March 2012

విశ్రాంతినివ్వాలని కోరా...వీరేంద్ర సెవాగ్

ఆసియాకప్ నుంచి తనకు విశ్రాంతిని ఇవ్వాల్సిందిగా బోర్డును కోరాననీ, తనను జట్టు నుంచి తప్పించలేదనీ వీరేంద్ర సెవాగ్ స్పష్టం చేశాడు. కోల్‌కతా లోని స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు జట్టు ఫిజియో ఇవాన్ స్పీచ్‌లీ ఒక ఫిట్‌నెస్ నివేదికను సెలెక్టర్లకు పంపాడు. ఆ నివేదికలో సెవాగ్, జహీర్‌లకు విశ్రాంతినివ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. కెప్టెన్ ధోనీ, కోచ్ డంకన్ ఫ్లెచర్ కూడా సెవాగ్ విశ్రాంతిని కోరుకుంటున్నాడని సెలెక్టర్లకు చెప్పారు. దీంతో సెవాగ్‌ను ప్రధాన సెలెక్టర్ శ్రీకాంత్ సంప్రదించాడు. తాను విశ్రాంతి తీసుకుంటాననీ, తాను జట్టులో ఉండాల్సిందేనని సెలెక్టర్లు భావిస్తున్నట్లయితే అందుబాటులో ఉంటాననీ సెవాగ్ అతడికి తెలిపాడు. అందువల్ల సెవాగ్‌కు రెస్ట్ ఇచ్చారు. తాను గాయాన్ని దాచాలని అనుకోవడంలేదని సెవాగ్ ‘మిడ్ డే’ పత్రికతో చెప్పాడు. ‘నేను వెన్ను నొప్పితో బాధ పడుతున్నాను. కొంత విశ్రాంతి అవసరం. ఫిట్‌నెస్ విషయంలో నేనెప్పుడూ జట్టు మేనేజ్‌మెంట్‌ను తప్పుదోవ పట్టించలేదు. ఇది వరకు భుజానికి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా అప్పటి కోచ్ కిర్‌స్టెన్, కెప్టెన్ ధోనీని సంప్రదించాను’ అని సెవాగ్ పేర్కొన్నాడు. ఫిజియో నివేదికను ఆధారంగా చేసుకునే సెవాగ్‌కు విశ్రాంతినిచ్చారు. అయితే జట్టును ప్రకటించినప్పుడు సెవాగ్ ఫిట్‌నెస్ సమస్య గురించి శ్రీకాంత్ వివరించకపోవమే ఈ గందరగోళానికి కారణమయ్యింది. సెలెక్షన్ కమిటీ సమావేశానికి ముందే సచిన్.. తను ఆసియా కప్‌లో అడాలనుకుంటున్నానని టీం మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. జట్టులో స్థానం దక్కించుకోని సెవాగ్, జహీర్, ఉమేష్‌లకు విశ్రాంతినిస్తున్నట్లు మాత్రమే శ్రీకాంత్ చెప్పాడు. వారికి అయిన గాయాలేంటో అతడు తెలపలేదు. అయితే జహీర్‌కు చీలమండ గాయమైనందు వల్ల, ఉమేష్ సుదీర్ఘ సిరీస్ ఆడి అలసిపోయినందు వల్ల విశ్రాంతిని ఇచ్చారని తెలుస్తోంది.

No comments:

Post a Comment