Tuesday, 6 December 2011

అనంతపురంలో డర్టీ సినిమా నిలిపివేత

అనంతపురంలోని గౌరి థియేటర్‌లో ప్రదర్శిస్తున్న డర్టీ పిక్చర్‌ను AISF, AIYF అడ్డుకుని నిలిపివేశారు. యువతను పెడత్రోవ పట్టించేలా ఉన్నాయంటూ.. సినిమా పోస్టర్లను చించివేసి కాల్చారు. థియేటర్‌ ముందు బైఠాయించి ప్రదర్శనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

శ్రీవారి సేవలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

కేసులు.. విచారణలతో నిత్యం బిజీగా ఉండే సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మంగళవారం శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమల వచ్చారు. ఉదయం తిరుమల చేరుకున్న ఆయన కాసేపు విశ్రాంతి పొందారు. అనంతరం శ్రీవారి పాదాలు, శిలాతోరణం, పాపవినాశనం, జాపాలి, వేణుగోపాలస్వామి ఆలయం తదితర సందర్శక ప్రాంతాలలో పర్యటించారు. రాత్రి విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తన కుమారుడికి త్వరలో పరీక్షలు జరగనుండటంతో శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్లు సమాచారం.

త్వరలో చిరంజీవి 150వ సినిమా మురుగదాస్ ద్శకత్వం?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి చాలా రోజులుగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 150వ సినిమా డైరెక్ట్ చెయ్యబోతున్నారంటూ చాలామంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఆ మధ్య వివి వినాయక్ ఫైనల్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే మతాజా సమాచారం ప్రకారం గజిని, సెవెన్త్ సెన్స్ చిత్రాల దర్శకుడు ఎఆర్ మురుగదాస్ పేరు ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. సెవెన్త్ సెన్స్ తర్వాత చిరంజీవి ఆబ్లిగేషన్ వల్ల మురుగదాస్ కి అతని 150వ చిత్రానికి స్ర్కిప్ట్ రెడీ చెయ్యాల్సిన అవసరం ఏర్పడిందట. గతంలో చిరంజీవితో స్టాలిన్ చేసిన మురుగదాస్ ఇప్పుడు 150వ సినిమాకి కూడా స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలోనే ఉన్నాడని, త్వరలోనే అతని డైరెక్షన్ లో సినిమా ప్రారంభం కాబోతోందన్న వార్త ఫిలింనగర్ లో వినిపిస్తోంది.

పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర జైదేవ్

పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు జైదేవ్ అలియాస్ జై. కలకత్తా నేపథ్యంలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడివి శేష్ మరియు జాకీష్రాఫ్ విలన్ గా నటిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌-విష్ణువర్ధన్‌ కాంబినేషన్‌లోని ‘పంజా’లో బ్రహ్మానందం ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఈ నెల 9న సినిమా రిలీజ్‌ సందర్భంగా పంజా సినిమాలో బ్రహ్మానందం యాక్షన్ చాలా హైలెట్ గా ఉంటుందట. అసలు పంజా సినిమాలో బ్రహ్మనందం క్యరెక్టర్ కొత్తగా ఉంటుందని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.పంజా సినిమాలో పవన్ క్యరెక్టర్ తో పాటు ..బ్రహ్మనందం కూడా పోలిస్ ఇన్సెపక్టర్ పాపరావుగా నటిస్తున్నాడట. ఆయన నటనతో పంజా సినిమా కథ నడుస్తుందని ఫిలిం వర్గాలు అంటున్నాయి. గతంలో బ్రహ్మానందం నటించిన సినిమాలు చూస్తే.. ‘డీ’ మంచు విష్ణుతో, అలాగే ‘రెడీ’ సినిమాలో హీరో రామ్ తో కలిసి నటించి, బ్రహ్మానందం ఆ రెండు సినిమాలకు మంచి హిట్ తెచ్చిపెట్టాడు. ఆ రెండు సినిమాల్లో.. కథ మొత్తం బ్రహ్మానందం చుట్టు తిరుగుతుంది. సినిమా మొదటి నుండి చివరు వరకు ఆయన కామెడీతో.. ప్రేక్షకులను..ఆనందింప చేసిన విషయం తెలిసిందే.

సచిన్ టెండూల్కర్ ఒపస్ అభిమానుల నుండి భారీ స్పందన

సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచానికి దేవుడు. క్రికెట్ రంగంలో భారతీయులు గర్వంగా చెప్పుకునే పేరు సచిన్. అలాంటి సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలో సృష్టించని రికార్డు లేదు. దీంతో సచిన్ టెండూల్కర్ జీవిత విశేషాలను సంబంధించిన అరుదైన ఫోటోలతో రూపొందిస్తున్న 'సచిన్ టెండూల్కర్ ఒపస్' తొలి పుస్తకాన్ని సొంతం చేసుకునేందుకు గాను ఫేస్‌బుక్లో సచిన్ వీరభిమాని 3 లక్షల 50 వేల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. కోటి 80 లక్షలు)కు బిడ్ వేశాడు. సచిన్ ఒపస్ పేరుతో రూపొందించిన ఈ ఫేస్ బుక్ ఎకౌంట్‌ని సుమారు 50 లక్షల మంది ఫాలో అవుతున్నారు.ఫేస్‌బుక్లో ఇండియాలో ఏఆర్ రెహామాన్ పేజి తర్వాత ఎక్కువ మంది ఫాలో అవుతున్న ఫేస్‌బుక్ పేజి ఇదే కావడం విశేషం. 2010వ సంవత్సరంలో ఈ పుస్తకం కోసం ఒక వ్యక్తి రూ 35. 2 లక్షలకు బిడ్ వేయడం జరిగింది. సచిన్ వందో సెంచురీ పూర్తి అయిన వెంటనే ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పుస్తకం 95 శాతం పూర్తి అయిందని ఒపస్ మీడియా గ్రూప్ సీఈవో కార్ల్ ఫోలర్ పేర్కొన్నారు.ఇక ఈ పుస్తకం విశేషాలను గనుక గమనించినట్లైతే 37 కేజీల బరువుతో పాటు 700 పేజీలు ఇందులో ఉంటాయి. ప్రపంచంలో మొట్టమొదటి సారి ఓ క్రికెటర్‌పై పుస్తకం రావడం ఇదే మొట్టమొదటి సారి. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పేజీ కూడా 18*18 సైజులో ఉంటుంది. మంచి నాణ్యతతో రావాలనే ఉద్దేశంతో దీన్ని యంత్రాలతో కాకుండా చేతితోనే బైండింగ్ చేస్తున్నారు. సచిన్ గురించి ఆయా రంగాల్లో ప్రముఖుల వ్యాఖ్యానాలు ఉంటున్నప్పటికీ ఈ పుస్తకానికి ఫొటోలే ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఇప్పటికే మాస్టర్‌ను ఏడడుగుల ఎత్తుండే పొలరాయిడ్ కెమెరాతో షూట్ చేశారు. ప్రపంచ ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ గ్జెనాన్ టెక్సేరియా ఈ ప్రాజెక్టులో పనిచేశాడు.

శ్రీశైలం మల్లన్న గాలిగోపురానికి బీటలు

పాలకుల పర్యవేక్షణలోపం... అధికారుల నిర్లక్ష్యం వెరసి శ్రీశైలం మల్లన గాలిగోపురం పాలిటశాపంలా తయారైంది. పురాతన కాలంనాటి ఆయలగోపురశిఖరాలపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యపు దోరణితో వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. శ్రీశైలం మల్లన్న గాలిగోపురం పిచ్చిమొక్కలతో కళావిహీనంగా తయారైంది.
గాలి గోపురాన్ని పునరుద్ధరించే విషయంలో పాలకమండలి, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శులు వెల్లువెత్తున్నాయి. నిత్యం రద్ధీగా ఉండే శ్రీశైల క్షేత్రంలో గాలిగోపురాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. గోపురాలపై ఉన్న శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తర ద్వారంగాఉన్న శివాజీ గోపురం శిధిలావస్థకు చేరుకుందని రెండేళ్లక్రితం నిపుణుల కమిటీ నిర్థారించింది. గోపురాన్ని పునరుద్ధరించాలనే సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. గోపురం బీటలు వారుతున్న పట్టించుకునే నాథుడే కరవయ్యాడని భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గోపురాలపై శిల్పాలు విరిగిపోవడంతోపాటు పిచ్చిమొక్కలతో కళావిహీనంగా ఉన్నాయి. పురాతన కాలంనాటి శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారులు చొరవతీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

నిమ్స్ సెగలు కడప రిమ్స్‌ను కూడా తాకాయి

హైదరాబాద్ నిమ్స్ సెగలు కడప రిమ్స్‌ను కూడా తాకాయి. నిమ్స్‌లో ఖైదీలకు వైద్యంపై జరిగిన కుంభకోణం లాంటిదే కడప రిమ్స్‌లోనూ చోటుచేసుకుంది. దీంతో విచారణ జరిపిన సర్కార్, రిమ్స్ ఆర్ఎంఓ, సూపర్నెంట్‌లను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం కడపలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. విచారణలో ఉన్న ఖైదీలకు ఎలాంటి అనారోగ్యం లేకున్నా వైద్యం కోసం కడప రిమ్స్‌లో చేర్చుకున్నారు. అలాగే వారిని హైదరాబాద్ నిమ్స్‌కు రెఫర్ చేశారు. చాపాడు మండలం శెట్టిపల్లికి చెందిన జయరాం రెడ్డితో పాటు, మరో ఇద్దరు ఓ మర్డర్ కేసులో నిందితులు. విచారణ ఖైదీలుగా ఉన్న వీరిని కడప రిమ్స్‌లో చేర్చుకోవడమే గాకుండా మరింత వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు రిఫర్ చేశారు. ఈ ఘటనలో నిమ్స్ వైద్యులు సస్పెండ్ కాగా, కడపలో కూడా విచారణ ఎదుర్కొంటున్న ఆర్‌ఎంఓ, సూపర్నెంట్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రిమ్స్ వైద్యుల సస్పెన్షన్‌తో డాక్టర్ల చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా ప్రలోభాలకు లోబడి చికిత్సలకు రిఫర్ చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.