Showing posts with label తిరుమల. Show all posts
Showing posts with label తిరుమల. Show all posts
Wednesday, 4 January 2012
వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల
Tuesday, 3 January 2012
టీటీడీకీ శతవిధాలా శఠగోపం కిలో రూపాయి బియ్యం
ధార్మిక సంస్థ టీటీడీకి గుత్తేదారులు శతవిధాలా శఠగోపం పెడుతున్నారు. కిలో
రూపాయి సర్కారీ బియ్యానికి పాలిష్‌చేసి టీటీడీకి అంటగడుతున్నారనే ఆరోపణలు
వెల్లువెత్తాయి. పౌరసరఫరాల బ్యాగుల్లోనే వచ్చిన వేలాది కిలోల బియ్యాన్ని
టీటీడీ మార్కెటింగ్ అధికారులు పక్కన పెట్టారు. వాటి నమూనాలు తీసి పరీక్షల
నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. టీటీడీకి బియ్యం సరఫరా టెండరుదారైన
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన గంగాదేవి మోడ్రన్ రైస్‌మిల్
నిర్వాహకులు శనివారం రెండు లారీల్లో 50 కిలోల బరువున్న 2,220 బియ్యం
బ్యాగులు టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌కు పంపారు. మార్కెట్‌లో కిలో రూ.30లు
పలుకుతున్న సోనా మసూరి బియ్యాన్ని రూ.21.06 లకు సరఫరా చేస్తామని గుత్తేదారు
టెండర్ దక్కించుకున్నారు. నెలకు 50 లారీల బొప్పున 6 నెలలకు 300 లోడ్ల
బియ్యం వారు సరఫరా చేయాల్సి ఉంది. మూడు నెలలుగా 150 లారీల బియ్యాన్ని సరఫరా
చేశారు. కాగా అర్మూర్ రైస్ మిల్లు నుంచి వచ్చిన బియ్యం సంచులు
పౌరసరఫరాల శాఖ రేషన్‌షాపు డీలర్లకు సరఫరా చేసే బ్యాగులు కావడం, వాటిపై
అగ్‌మార్క్ ముద్ర లేకపోవడంతో టీటీడీ అధికారులకు అనుమానం వచ్చింది. అవి
కిలో రూపాయి సబ్సిడీ బియ్యమనే భావించి వాటిని పక్కన పెట్టారు. పరీక్షల
నిమిత్తం వాటిని టీటీడీ ల్యాబ్‌కు పంపినట్లు టీటీడీ మార్కెటింగ్ ఆఫీసర్
శ్రీహరి తెలిపారు.
Wednesday, 21 December 2011
శ్రీవారి సేవకులకు నూతన డ్రస్‌కోడ్ అమలు
శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి వచ్చే శ్రీవారి భక్తులకు సేవ
చేయడానికి టిటిడి ఏర్పాటు చేసిన శ్రీవారి సేవకులకు నూతన డ్రస్‌కోడ్
విధానాన్ని వచ్చే ఏడాది రథసప్తమి నుండి అమలు చేయనున్నట్లు టిటిడి
ప్రజాసంబంధాల అధికారి తలారి రవి ఒక ప్రకటనలో తెలిపారు. మానవసేవే మాధవసేవ
అన్న ప్రధానలక్ష్యంతో టిటిడి శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసింది. సాటి
భక్తులకు సేవలు అందించడానికి వీలుగా ఈ వ్యవస్థ టిటిడి ప్రవేశ పెట్టింది. గత
11సంవత్సరాల కాలంలో మూడున్నర లక్షలమంది శ్రీవారి సేవకులు ఇప్పటివరకు
భక్తులకు వివిధ విభాగాల్లో సేవలు అందించారు. నేడు సుమారు 40 విభాగాల్లో
శ్రీవారి సేవకులు భక్తులకు విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఇందులో మరీ
ముఖ్యంగా పేర్కొనవలసినవి దర్శనం క్యూలైన్లు, అన్న ప్రసాద భవనం, కల్యాణకట్ట,
పరకామణి, ఉద్యానవనశాఖ, పబ్లికేషన్ స్టాల్స్, సమాచార కేంద్రాలు తదితర
ప్రాంతాల్లో శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవలు ఎంతో
విశిష్టమైనవి. అయితే తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకూ
పెరుగుతున్న నేపధ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా టిటిడి శ్రీవారి సేవకుల
సేవలను మరింత పటిష్టం చేయడానికి నడుం బిగించింది. అందులో భాగంగా శ్రీవారి
సేవను క్రమబద్దీకరించడానికి తద్వారా ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి
నూతన విధివిధానాలను నిర్దేశించినట్లు టిటిడి తెలిపింది. శ్రీవారి సేవకు
విచ్చేసే సేవకులకు ఒక నిర్దిష్టమైన యూనిఫాంను నిర్ణయించింది. అందులో భాగంగా
పురుషులు తెల్లపంచె, లేదా ఫ్యాంటు, తెల్లషర్టు విధిగా ధరించాలని, మహిళలు
ముదురు ఆకుపచ్చ రంగు చీర, అదే రంగు రవిక(చీరపై డిజైన్ ఉండవచ్చు,
లేకపోవచ్చు) విధిగా ధరించి శ్రీవారి సేవకు రావాల్సి ఉంటుందని తెలిపారు.
ప్రారంభంలో 200మందితో ఆరంభమైన శ్రీవారిసేవ వ్యవస్థ నేడు అపారంగా
విస్తరించింది. శ్రీవారి సేవకుల్లో భక్తుల పట్ల మరింత సమర్థతతో సేవలు
అందించడానికి వీలుగా, అదే రీతిలో శ్రీవారి సేవకులను ప్రోత్సహించడంలో భాగంగా
టిటిడి ఇప్పటికే శ్రీవారి సేవకులకు ఉచిత వసతి, అన్నప్రసాద సౌకర్యాలను
కల్పిస్తోంది. అంతేకాకుండా ఏడురోజులు సేవ చేసిన వారికి ఎనిమిదవరోజు
శ్రీవారి దర్శనభాగ్యం కూడా టిటిడి కల్పిస్తోంది. త్వరలో శ్రీవారి సేవకులకు
లడ్డూ,ప్రసాదాన్ని సబ్సిడీకి అందించాలని టిటిడి యోచిస్తోంది. కాగా ఈ నూతన
డ్రస్‌కోడ్ విధానం 2012వ సంవత్సరం జనవరి 30న రథసప్తమి పర్వదినం నాటి నుండి
టిటిడి విధిగా అమలు చేయనుంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న శ్రీవారి
భక్తులకు ఈ మార్పును గమనించి విధిగా టిటిడి ప్రవేశపెట్టిన నూతన
విధివిధానాలను పాటించాలని టిటిడి కోరింది.
వైకుంఠ ఏకాదశికి ఈ దర్శన్ ద్వారా టిక్కెట్ల జారీ
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకునే
భక్తులకు ఈ దర్శన్ కౌంటర్ ద్వారా టిక్కెట్ల జారీ ప్రక్రియను టీటీడీ బుధవారం
ప్రారంభించింది. టిక్కెట్ల కోసం భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.100,
రూ.300 ప్రత్యేక ప్రవేశం టికెట్లను జారీ చేయనున్నారు. తిరుపతి మహతి
ఆడిటోరియంలోని ఈ-దర్శన్ కౌంటర్‌లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి టికెట్లు
మంజూరు చేయనున్నారు. జనవరి 5వ తేదీ ఏకాదశి దర్శనం కోసం రూ.100 ప్రత్యేక
ప్రవేశం 5 వేలు, రూ.300 ప్రత్యేక ప్రవేశం 500 టికె ట్లు జారీ చేయనున్నారు.
6వ తేదీ ద్వాదశి దర్శనం కోసం కూడా ఇదే సంఖ్యలోనే టికెట్లు జారీ
చేయనున్నారు. రూ.100 ప్రత్యేక ప్రవేశం పొందిన భక్తులు ఆయా పర్వదినాల్లో
అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా నడిచివెళ్లి కాలిబాటలోని కౌంటర్లలో తమ
టికెట్టును తిరిగి నమోదు చేసుకుంటేనే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఇందుకోసం ఈ-దర్శన్ కౌంటర్‌లో ప్రత్యేకంగా రెండు కౌంటర్లు ఏర్పాటు చేశామని,
అవసరమైతే మరికొన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈడీపీ విభా గం
అధికారి భాస్కర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఇక ఈనెల 24వ తేదీ నుంచి
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నయ్, ముంబయి, ఢిల్లీ,
పూణెతో పాటు మరో 60 ఈ-దర్శన్ కేంద్రాల ద్వారా రోజుకు రూ.100 ప్రత్యేక
ప్రవేశం టికెట్లు 25 వేలు, రూ.300 ప్రత్యేక ప్రవేశం టికెట్లు మరో 4500
కేటాయించనున్నారు.
Thursday, 15 December 2011
శ్రీవారి ఆలయంలో తిరుప్పావై సేవ ప్రారంభం
గురువారం
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించాడు. దీంతోతిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావై
సేవ ప్రారంభం అయింది. ధనుర్మాసం నెల్లాళ్లూ శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి
బదులుగా గోదాదేవి రచించిన పాశురాలను ఆలపించి శ్రీవారిని మేల్కొలుపుతారు. ఈ
సేవ రేపటి నుంచి వచ్చేనెల 16వ తేదీ వరకు జరుగుతుంది. శ్రీవళ్లి
పుత్తూరులో కొలువైన గోదాదేవి తన యుక్తవయసునుంచి శ్రీనివాసున్ని తన భర్తగా
భావించి ఆరాధిస్తుంది. ఆమె స్వామివారిని కీర్తిస్తూ తమిళంలో 30పాశురాళ్లను
రచించి అంకితమిచ్చింది. తదనంతరం శ్రీనివాసుడు గోదాదేవి వివాహం చేసుకున్నట్లు తమిళ పురాణాలు
చెబుతున్నాయి. ప్రతిఏటా సూర్య భగవానుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించినప్పటి
నుంచి కౌసల్యా సుప్రజా, రామా అని ప్రారంభమయ్యే సుప్రభాతానికి బదులుగా
గోదాదేవి రచించిన 30పాశురాళ్లను పాడి శ్రీవారిని మేల్కోపుతారు. తిరుప్పావై
సూర్యుడు మకర సంక్రమణం చేసేవరకూ ఆచరించడం జరుగుతుంది. ఈ కాలంలో శ్రీవారి
ఆలయంలో తిరుప్పావైతో పాటు సహాస్ర నామార్చన, తోమాల సేవలు కొనసాగుతాయి.
సహాస్ర నామార్చనలో స్వామి వారికి తులసీ దళానికి బదులుగా బిల్వపత్రాన్ని
వినియోగిస్తారు. స్వామివారి అలంకారంలో కూడా మార్పులు జరుగనున్నాయి. స్వామివారి రత్నభరణాలు పొదిగిన బంగారు చిలుకను సమర్పిస్తారు. ఇదిలా ఉంటే
స్వామివారికి ప్రతి రోజు రాత్రి జరిగే ఏకాంత సేవల సాధారణంగా
భోగశ్రీనివాసమూర్తి నిర్వహిస్తారు. అయితే ధనుర్మాసంలో మాత్రం గర్భాలయంలో
ఉండే శ్రీకృష్ణస్వామికి ఏకాంతసేవ, పవళింపు సేవ నిర్వహించడం జరుగుతుంది.
తిరుమలలో కలకలం శ్రీవారి ఆలయంపై వెలుగుచుక్క
తిరుమల శ్రీవారి ఆలయం పైభాగాన బాగా ఎత్తులో బుధవారం రాత్రి ఓ వెలుగుచుక్క
ప్రయాణించిన సంఘటన కలకలం రేపింది. ఆకాశంలో జరిగిన ఈ అద్భుతంపై రకరకాల
వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇది స్వామి దివ్యజ్యోతి అని, తిరుమల
క్షేత్రానికి అదృష్టమని కొందరు అంటుంటే, ఇది ‘ఫ్లైయింగ్ సాసర్ ’(ఎగిరే
పళ్లెం) అయి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే భక్తులు మాత్రం
ఇది స్వామి జ్యోతి అయి ఉంటుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇది
సాయిజ్యోతి అని కొంత మంది ప్రచారం చేస్తుంటే, ఇది తోకచుక్క అని ఇంకొంతమంది
అంటున్నారు. తోకచుక్క అయితే ఆకాశం నుండి కిందకు జారుతూ క్రమంగా
అదృశ్యమవుతుంది. అయితే బుధవారం శ్రీవారి ఆలయంపై తూర్పు నుండి పడమర వైపు
కదులతూ వెలుగుచుక్క దర్శనమిచ్చింది. అందరూ చూస్తుండగానే కనుమరుగైంది.
అయ్యప్ప మకరజ్యోతి తరహాలో రెండు నిమిషాల పాటు ఆలయంపై ఈ వెలుగు చుక్క
ముందుకు సాగింది. ఆలయ గోపురంపై నుండి ఓ వెలుగుచుక్క వెళుతూ వుండటాన్ని విధి
నిర్వహణలో వున్న ఓ సెక్యూరిటీ గార్డు గమనించి, పాత్రికేయులకు చూపించాడు.
కొంత మంది ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన వారు ఈ వెలుగుచుక్కను కెమేరాల్లో
బంధించారు. అయితే సాధారణ కెమేరాల్లోకి ఈ చుక్క అందుబాటులోకి రాలేదు.
దివిటీలా వెలుగుతూ పడమర వైపు పయనిస్తూ రెండు, మూడు నిమిషాల వ్యవధిలో
కనుమరుగయింది. ఈ వెలుగు రహస్యమేమిటో శాస్తవ్రేత్తలే తేల్చాల్సి ఉంది. ఏది
ఏమైనా బుధవారం వెంకన్న ఆలయంపై ఆవిష్కృతమైన ఈ అద్భుతంపై వాడివేడిగా చర్చ
సాగుతోంది.
Monday, 12 December 2011
తిరుపతి దేవస్థానం పవిత్రత దెబ్బ...చిన జీయర్‌కు లీగల్ నోటీస్
Subscribe to:
Posts (Atom)