Saturday, 15 October 2011

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది

                           
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు చిత్తూరు జిల్లా నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో 50 శాతం మంది ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. రెండు నెలల్లోనే ఈ జిల్లాలో పార్టీకి విశేష స్పందన అభించింది. ఈ నియోజకర్గంలో 1,27,250 మంది ఓటర్లు ఈ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం వివరాలను జగన్మోహన రెడ్డికి అందజేశారు. 43 పంచాయతీల నుంచి నమోదైన సభ్యత్వం వివరాలను ఆయన తెలియజేశారు

రాష్ట్రం విడిపోవడమంటే మన హృదయాన్ని పగులగొట్టడమేనన్నారు

కడప నగరంలో శుక్రవారం జరిగిన సీమ సమైక్యాంధ్ర సదస్సులో రాయలసీమ జిల్లాల నుండి మేధావులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘం నాయకులు, మహిళా నాయకురాళ్లు కదం తొక్కారు. ఈ సందర్భంగా జెఎసి కన్వీనర్ సిహెచ్. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నాయకులు తమ ఉద్యమంతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనకు ముందే నికర జలాల సమస్య, పెండింగ్ ప్రాజెక్టుల సమస్య తేల్చాల్చిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ విభజన రెండవ అంశంగా భావిస్తామన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తెలంగాణ కన్నా రాయలసీమే అన్నింట వెనుకబడి ఉందన్నారు. పోతిరెడ్డిపాడుకు 30 రోజులు వరద నీళ్లు పారితే ప్రస్తుతం మనకు నీళ్లు వచ్చాయన్నారు. గాంధీగిరి అంటునే కెసిఆర్ రౌడీయిజం చేస్తున్నాడన్నారు. రాయలసీమ వాసులుగా మనం ఏం పోగొట్టుకున్నామో వారికి చెప్పవలసిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటి ఉద్యమాలు జరిగాయన్నారు. రాష్ట్రం విడిపోవడమంటే మన హృదయాన్ని పగులగొట్టడమేనన్నారు. మరో మాజీ మంత్రి రామమునిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విడిపోతే దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లుతుందన్నారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి అల్లూరు సీతారామరాజుకన్నా ముందే బ్రిటిష్ వారిపై పోరాడాడన్నారు. తెలంగాణ వారు మన మంచి తనాన్ని బలహీనతగా తీసుకుంటున్నారన్నారు. రాయలసీమ జర్నలిస్టు సంఘం నాయకులు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టే దమ్ము ఎవరికి లేదన్నారు. జెఎసి తీసుకునే ఎలాంటి నిర్ణయాలనైనా మీడియా అమలు చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే మనకు నీళ్లుండవు, ప్రాజెక్టులు కూడా వారే కట్టుకుంటారన్నారు. అందుకే మన భావాన్ని ఢిల్లీకి గట్టిగా తెలపాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ వారు నెల రోజులుగా పోరాటం చేస్తుంటే మనం చోద్యం చూడడం దురదృష్టకరమన్నారు. కర్నూలు టిడిపి నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ వారికి బుద్ధి వచ్చేలా మనం ఉద్యమించాలన్నారు. మైనార్టీ నాయకులు షేక్ హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను కోరటం మనం చేసిన త్యాగాలకు ఫలితమా అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపే ప్రతిపాదనను ఖండించాలన్నారు. మైనార్టీ నాయకులు అమీర్‌బాబు మాట్లాడుతూ సమైక్యతే ముస్లింల మనోభావమన్నారు. లక్ష మంది పొట్టి శ్రీరాముల లాంటి వారు త్యాగాలకు సిద్ధంగా ఉన్నారన్నారు. అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమన్నారు. ప్రొద్దుటూరు భార్ అసోసియేషన్ అధ్యక్షులు నూరుల్లా మాట్లాడుతూ రాయలసీమ ఉద్యమ కారులపై పోలీసులు పెట్టే ఎలాంటి కేసులైన తమ భార్ అసోసియేషన్ ఉచితంగా వాధిస్తుందన్నారు. మహిళా నాయకురాలు చిక్కేరు జానకి మాట్లాడుతూ తెలంగాణ పోరాటం స్వార్థపూరిత పోరాటమన్నారు. ప్రతి రోజు రాయలసీమ ఉద్యమం ఉండాలన్నారు. మరో నాయకురాలు అల్లె ప్రభావతి మాట్లాడుతూ ఉద్యమంలో ఉద్యమంలో మహిళల మనోభావం దెబ్బతింటోందని ఉద్యమంలో మా పాత్రే ముందుండాలన్నారు

ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్‌గా మారిందన్నారు

విభజన పేర రాయలసీమను అడ్డంగా నరకొద్దని కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ అన్నారు. నగరంలోని రోడ్లు భవనాల అతిధి గృహంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన పేర వేల సంవత్సరాల చరిత్ర ఉన్న రాయలసీమను విడదీయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రాజకీయ లబ్దికోసం, సీట్లసంఖ్య పేర ప్రభుత్వం సీమను విడదీయాలని చూస్తోందన్నారు. అదే జరిగితే పూర్తిగా నష్టపోయేది సీమవాసులేనన్నారు. ఇప్పటికే ప్రతేకవాదులు సీమవారిని గూండాలుగా చిత్రీకరిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో సీమలోని మేథావులు, విద్యార్థుల, రైతులు సీమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ఉద్యమం బలపడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేని పరిస్థితికి వచ్చిందని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్‌గా మారిందన్నారు.
సీమలో తాగు, సాగునీటి సమస్య, కరవు, ఫ్యాక్షన్ నెలకొన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో సీమను విడదీస్తే అనంతపురం జిల్లా ఎడారిగా మారడం ఖాయమన్నారు. సీమ అభివృద్ధికి ప్రభుత్వం 30 టిసింఎంల నీరు కేటాయించాలని, రూ.50 వేల కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ టూర్ ప్యాకేజీ ప్రకటించాలన్నారు. రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే సీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని నరేష్ డిమాండ్ చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను తిరుపతి రాజధానిగా విశాల రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలన్నారు. తాను గతంలో బిజెపిలో ఉన్నపుడే ఈ ప్రతిపాదన చేశానన్నారు. విశాల రాయలసీమ కోసం త్వరలో రాజకీయాలకు అతీతంగా వేదిక ఏర్పాటుచేసి మేథావులు, రైతులు, విద్యార్థులతో చర్చించి ఉద్యమాన్ని మందుకు తీసుకువెళ్తామన్నారు. బిసి కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ విభజన పేర సీమను విడదీస్తే ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతామన్నారు. విశాల రాయలసీమ కోసం రథయాత్రలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పెనుకొండ కాంగ్రెస్ నాయకులు రమేష్, జాకీర్‌హుసేన్, సరోజమ్మ, సుధాకర్, అమర్, కబీరయాదవ్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి వెనకాడము

                                                   
రైతు సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాక పోతే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి వెనకాడమని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుసెనగ పంట దెబ్బతిన్న రైతులకు అండగా నిలవడం కోసం టిడిపి పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కరువు యాత్ర కార్యక్రమంలో శుక్రవారం లత్తవరణ పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, జిల్లా టిడిపి అధ్యక్షులు పార్థసారధిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటు గొప్పలు చెబుతోందని, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. రైతుల పక్షాన టిడిపి అండగా ఉంటుందని అన్నారు. రైతులకు పంట నష్టపరిహారం అందచేయలేదన్నారు. జిల్లా రైతులను ఆందుకోవడం కోసం ఈ సమస్యలను హైదరాబాద్ వరకు తీసుకెళ్లి మొండి ప్రభుత్వం మెడలు వంచడానికి దశలుగా టిడిపి అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. పంట దెబ్బతిన్న రైతులకు పరిహరం పంపిణీ చేస్తామని, పంటల బీమా అందచేస్తామని ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల ఖాతా జమ చేయలేదన్నారు. జిల్లా రైతులను ఆదుకోవడం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు రుణ మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎకరానికి 10 వేల రూపాయలు చొప్పున పరిహారం అందచేయాలని వారన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నప్పమటికీ రైతు గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాక పోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు

Friday, 14 October 2011

వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సు ద్వారా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు

వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సు ద్వారా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహపరిశోధన సంచాలకులు డాక్టర్‌ కె.రాజారెడ్డి పేర్కొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గురువారం వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సు తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సీమలో నివసించు యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే సదుద్ధేశంతో ఆచార్య ఎన్‌.జి.రంగా విశ్వవిద్యాలయం పరిధిలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సులను నూతనంగా ప్రారంభించడం జరిగిందన్నారు. దీంతో వ్యవసాయాభివృద్ధి, విత్తనోత్పత్తులలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే అవకాశం ఉంటుందన్నారు ఈ క్రమంలోనే తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ నెల 10 నుంచి తరగతులు ప్రారంభించడం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల కాలపరిమితి గల ఈ కోర్సుకు పదోతరగతి లేదా దానికి సమానమైన పరీక్షలలో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. అభ్యర్థులు కనీసం నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండవలెనని చెప్పారు. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కోర్సులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణాధికారులుగా ఉద్యోగాలు పొందడమే కాకుండా ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎన్‌.వి.నాయుడు, డాక్టర్‌ మునస్వామి, డాక్టర్‌ గిరిధర్‌క్రిష్ణ, డాక్టర్‌ ఎ.రామక్రిష్ణారావు, డాక్టర్‌ సుబ్బారావు, డాక్టర్‌ వాసంతి, డాక్టర్‌ మురళీకృష్ణ, డాక్టర్‌ రమణ తదితరులు పాల్గొన్నారు

తిమ్మమ్మమర్రిమాను చరిత్ర

                                              
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిమ్మమ్మమర్రిమాను ఒక చరిత్రగా నిలిచిపోయింది. మహాశివరాత్రి పండుగ వస్తూనే ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక ప్రాంత ప్రజలకు ఒక్కసారిగా తిమ్మమ్మమర్రిమాను చరిత్రను గుర్తు చేసుకుంటారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం, నంబులపూలకుంట మండలంలోని కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలో కదిరి పట్టణానికి 27 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న తిమ్మమ్మమర్రిమాను గూటిబైలు పరిసరాలలో మర్రిమాను 1100 ఊడలతో 6.20 ఎకరాలు విస్తరించి ఉన్నది. మద్రాసులో ఉన్న అడియార్‌ మర్రిచెట్టు, కలకత్తాలోని బొటానికల్‌ గార్డెన్‌లో ఉన్న మర్రిచెట్టుకన్నా తిమ్మమ్మమర్రిమాను పెద్దచెట్టుగా ప్రసిద్ధి చెందింది.

ఈ మర్రిచెట్టును తిమ్మమ్మమర్రిమానుగా గిన్నీస్‌బుక్క్‌ ఆఫ్‌ వరల్డ్‌లో తన స్థానం సుస్థిర పరుచుకుంది. ప్రస్తుతం ఈ మర్రిచెట్టుకు దాదాపు 562 సంవత్సరాలు చరిత్ర ఉంది. ఆ ప్రాంత మంతా దైవసంభూతంగా పేరు ఉన్న పతీవ్రత తిమ్మమాంబ పేరు మీద తిమ్మమ్మమర్రిమానుగా ఈ మహావృక్షం ప్రసిద్ది గాంచినది. ఈ మహావృక్షం వెనుక ఆసక్తి గల కథ కూడా ఉన్నది. అనంతపురం జిల్లా, పెనుకొండ తాలుక, బుక్కపట్నం గ్రామంలో చెన్నక్క, వెంకటప్ప అనే దంపతులకు తిమ్మమాంబ జన్మించింది. ఈమెకు పెళ్ళి వయస్సు వస్తూనే నంబులపూలకుంట మండలానికి చెందిన గూటిబైలు గ్రామంలో నివాసం ఉన్న బాలవీరయ్యతో వివాహం జరిపించారు. అయితే వివాహం జరిగిన కొద్దిరోజులకే ఆమె భర్తకు అంటువ్యాధి సోకి అనారోగ్యంతో క్షీణిచారు.

గ్రామంలో ఉన్న వారు వారిని చూసి అసహించుకుంటుంటే ఈ బాధను పడలేక గ్రామానికి ఒక కిలోమీటరు సమీపంలో తిమ్మమాంబ ఒక రాతి కోటను నిర్మించుకుని, అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కోటలోకి తీసుకెళ్ళి ఆయనకు సేవలు చేసింది. అయినా అతను ఆరోగ్యం క్షీణించి మరణించాడు. అప్పట్లో ఆమె తన భర్త మరణించడంతో తానుకూడా అతనితో పాటు సతీసహగమణం చేసుకోవాలని చితిపేర్చుకుంది, చితిలోపల పచ్చని మర్రికొమ్మతో పాటు, మామిడి తోరణాలు కట్టారు. గ్రామ స్తులు అందరు చూస్తుండగానే భర్తను చితిలో దహనం చేస్తున్న సమయంలో ఆమెకూడా చితిలోకి దూకి సతీసహగమణం చేసుకున్నది. తర్వాత కొంత కాలానికి ఆ చితి వద్ద మర్రికొమ్మ మొక్క చిగురించింది.

ఆ మొక్క నేడు ప్రపంచంలోకెల్లా పెద్ద వృక్ష్యంగా మారింది. నాటి నుంచి మర్రిమాను తిమ్మమ్మమర్రిమానుగా ప్రఖ్యాతి గాంచినది. వారి సమాధి వద్ద చిన్న గుడి నిర్మించారు. అందులో బాలవీరయ్య, తిమ్మమాంబ విగ్రహాలు నెలకొల్పి ఉన్నాయి. అప్పటి విగ్రహాలకు నేటి వరకు మహాశివరాత్రి పండుగ రాగానే మూడు రోజులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్కడ నిర్మించిన తిమ్మమాంబ సమాధిఘాట్‌, తిమ్మమాంబ, బాలవీరయ్యల విగ్రహాలు, వన్యప్రాణుల షెడ్‌, శివఘాట్‌, కళ్యాణమండపం, గెస్ట్‌ హౌస్‌, ఓబుళేసుని గుట్ట తదితర వంటివి అక్కడ సందర్శించదగ్గ విషయాలుగా నెలకొల్పారు. ఈ మహాశివరాత్రి పండుగ రాగానే కర్నాటక ప్రాంతం బెంగుళూరు, కోలార్‌, చెనై్న, చిత్తూరు, కడప, అనంతపురం వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.

ప్రయాణికులకు మహాశివరాత్రి ఉత్సవాలకు గాను తిమ్మమ్మమర్రిమాను వద్దకు కదిరి డిపో నుంచి స్పెషల్‌ సర్వీసులు బస్సులు కూడా నడుపుతున్నారు. అయితే అక్కడ పర్యాటకులకు, సందర్శకులకు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మర్రిమాను వద్దకు వస్తున్న యాత్రికులు, పర్యాటకులకు అక్కడ బసచేయాలన్న గధులు లేక వచ్చిన వారు పూజలు నిర్వహించుకుని వెళ్లుతున్నారే తప్ప బసచేయడానికి కష్టంగా మారిందని పర్యాటకులు పేర్కొన్నారు. అదే విధంగా పర్యాటకులకు స్నానం గదులు, లేక పోవడంతో వచ్చిన పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రయాణం చేసి వచ్చిన వారికి సకాలంలో తాగునీటి కుళాయిలు లేక పోవడంతో ఎక్కువ సమయం మర్రిమాను వద్ద గడపలేక పోతున్నారు

పారిశ్రామిక వేత్తలు జిల్లాను ఎంచుకుంటున్నారు

ప్రస్తుతం పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలోనే పరిశ్రమల ఏర్పాటునకు అనువైన ప్రాంతంగా అనంతపురం జిల్లాను ఎంచుకుంటున్నారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపించడానికి పలువురు ఔత్సాహిక, అనుభవజ్ఞులైన పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. రెన్నెళ్లుగా పరిశ్రమల స్థాపనకు సంబంధించి జిల్లా పరిశ్రమల కేంద్రానికి అందిన దరఖాస్తులే ఇందుకు నిదర్శనం. ఒక మోస్తరు నుంచి భారీ పరిశ్రమల వరకు స్థాపించడానికి దరఖాస్తులు అందాయి. హిందూపురం సమీపంలోని తూమకుంట పారిశ్రామికవాడలో, చిలమత్తూరు మండలంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారు ఈప్రాంతంలో ఎక్కువగా పరిశ్రమలు వస్తున్నాయని ముమ్మర ప్రచారం ఉంది. ఈక్రమంలోనే సైన్స్‌సిటీ తదితరాలు తెరమీదకు వచ్చాయి. ఇక్కడ పరిశ్రమల ఔచిత్యాన్ని గుర్తించి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరిశ్రమల అవసరాలకు గండికోట రిజర్వాయర్‌ నుంచి 2 టిఎంసిల నీటిని కేటాయిస్తున్న ట్లు జిఓ కూడా జారీ చేశారు. అది ప్రస్తుతం అటకెక్కిన సంగతి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పరిశ్రమల స్థాపనకు ఇదొక్కటే అడ్డంకిగా మారింది. హిందూపురం ప్రాంతానికి బెంగళూరు విమానాశ్రయంతో పాటు, నగరం కూడా 100 కిలోమీటర్లపరిధిలోనే ఉంటుంది. ఇటీవలనే నెలకొల్సిన దేవనహళ్ళి అంతర్జాతీయ విమానాశ్రయం చిలమత్తూరు సమీపంలోని జాతీయ రహదారి నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. పుట్టపర్తి విమానాశ్రయం దగ్గరే. రైల్వే సౌకర్యం ఎలాగు ఉంది తెలంగాణ ప్రాంతంలో నెలకొన్ని పరిస్థితుల నేపధ్యంలో పారిశ్రామిక వేత్తలు ఇబ్బడిముబ్బడిగా ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. 8 మంది పారిశ్రామిక వేత్తలు స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమలు స్థాపించడానికి, టెక్స్‌పోర్ట్‌ పరిశ్రమను స్థాపించడానికి మరొకరు, వందలాది మంది చిన్నచిన్న పరిశ్రమలు స్థాపించడానికి దరఖాస్తులు చేసుకున్నారు. అయితే నీటికొరత వీరికి అడ్డంకిగా నిలుస్తోంది. గండికోట రిజర్వాయర్‌ నుంచి రావాల్సిన రెండు టిఎంసిల నీరు నిజంగా విడుదలైతే ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు స్థాపన అవుతాయి. చిలమత్తూరు మండలాన్ని ఇటీవలనే డార్క్‌ మండలంగా ప్రకటించారు. ఈకారణంగా ఇక్కడ నీటి లభ్యత చాలా కష్టమవుతుంది. పరిశ్రమల స్థాపనకు ప్రధానంగా కావాల్సింది నీటి సౌకర్యమే. ఆదిశగా పాలకులు ప్రయత్నం చేస్తే అనంతపురం పారిశ్రామిక జిల్లాగా ఖ్యాతిని గడిస్తుంది