Thursday, 8 December 2011

కడప జిల్లాలో హెలికాప్టర్ల తయారీ కేంద్రం

జిల్లాలో హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయని ఏపీఐఐసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో పారిశ్రామిక పురోగతిపై ఆశలు చిగురిస్తున్నాయి.  జిల్లాలో పారిశ్రామిక పురోభివృద్ధి కుంటుపడింది. పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ముఖం చాటేస్తున్నారు. అన్ని మౌలిక వసతులు ఉన్నా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. రూ.10 వేల కోట్లతో ఇనుప పరిశ్రమ ప్రారంభించిన ఓ కంపెనీ పనులను సైతం వదులుకుని వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడలో హెలికాప్టర్ తయారీ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా అని ఏపీఐఐసీని కోరింది. 500 ఎకరాల స్థలంతో పాటు నీరు అందుబాటులో ఉన్నాయని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వాటిని కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామికవాడలో హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్లే. హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఆధ్వర్యంలో ఈ హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది.

జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తేవాలి...కలెక్టర్

జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తేవాలని కలెక్టర్ వి.దుర్గాదాస్ క్రీడాకారులకు ఉద్బోధించారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో  ఏపీ స్కూల్ గేమ్స్ అండర్ -19 రాష్ట్ర స్థాయి షటిల్ బ్యా డ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు. పట్టుదలతో సాధన చేస్తే స్టార్ ఆటగాళ్ల స్థాయికి చేరుకోవచ్చునన్నారు. గెలుపు ఓటములు సమా నంగా తీసుకోవాలన్నారు. నిరంతరంగా సాధ న చేసి, ఆత్మవిశ్వాసం పెంచుకుని, ఎంచుకున్న రంగంలో దూసుకుపోవాలని జిల్లా క్రికెట్ సంఘం కోశాధికారి, సీనియర్ షటిల్ బ్యా డ్మింటన్ క్రీడాకారుడు డాక్టర్ జొన్నా సత్యనారాయణ అన్నారు. చదువుతోపాటు క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆర్.ఐ.ఓ క్రిష్టప్ప అన్నారు. ఇన్‌చార్జ్ డీవీఈఓ ఒన్నప్ప, ప్రభు త్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజారాం, ఇన్‌చార్జ్ డీఎస్‌డీఓ జగన్నాథ రెడ్డి, క్రికెట్ లెవెల్ 2 కోచ్ శ్రీవాస్ రెడ్డి, పోటీల రాష్ట్ర పరిశీలకులు పోతులయ్య, కార్యనిర్వహణ కార్యదర్శి గోవిందరావు పాల్గొన్నారు. దాదాపు 16 జిల్లాల జట్లు ఈ పోటీలకు హాజరయ్యాయి.

గోవా ఎయిర్ పోర్ట్ లో శ్రియకు చేదు అనుభవం..?

ఒకప్పుడు నటి శ్రియ దక్షిణాది భాషల్లో టాప్‌లో ఉండేది. రానురాను కొత్త నీరు రావడంతో పాత నీరు వెనక్కువెళ్ళినట్లు ఈ ముద్దుగుమ్మకు సినిమాలు తగ్గిపోయాయి. అదేసమయంలో బాలీవుడ్‌లో కాలుపెట్టి.. అడపాదడపా నటిస్తోంది. టాలీవుడ్‌లో టాప్‌ హీరోలందరితోనూ నటించిన సెక్సీభామ శ్రియ. ఇప్పుడు కెరీర్‌లో చాలా కష్టాలు ఎదుర్కొంటోంది.ఇటీవల శ్రియకు ఓ చేదు అనుభం ఎదురయ్యింది. గోవా నుంచి ముంబాయ్ వెళ్లడానికి జెయిట్ ఎయిర్ వేస్ లో ఫ్లైయిట్ టిక్కెట్ బుక్ చేసుకుందట. కానీ ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన తర్వాత ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురయ్యిందట. మంచు పట్టెయ్యడంతో విమానం వెళ్లే వీలు లేనందున క్యాన్సిల్ చేసారట. కానీ ఆ విషయాన్ని ఎనౌన్స్ చేయలేదని శ్రియ మండిపడుతోంది. తనంతట తాను వెళ్లి అడిగితే కూల్ గా..వాతావరణం బాగా లేదు. ఫ్లైయిట్ క్యాన్సిల్ చేసాం అన్నారట. ఇంత నిర్లక్ష్యం తగదని, ఓ ప్లయిట్ క్యాన్సిల్స్ అయినప్పుడు ఆ విషయాన్ని ప్రయాణీకులకు ప్రకటించాల్సిన బాధ్యత ఎయిర్ పోర్ట్ వారిదేనని వాదిస్తోంది శ్రియ.

మేమంతా కలిసే హ్యాపీగా ఉన్నాం అభిమానులు తన్నుకోవడమెందుకో?

అభిమానం అభిమానంలా ఉంటే ఒకే...అదే మితిమీరితే? హద్దులు దాటితే? శృతి మించితేనే సమాజానికి ప్రమాదం. ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్నది అదే. మెగా స్టార్, నందమూరి కుటుంబాలకు చెందిన హీరోల అభిమానులు, హీరో మహేష్ బాబు అభిమానులు ఒకపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. యుద్ధరంగాన్ని తలపిస్తున్నారు. ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ తీవ్రమైన పదజాలంతో ప్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలీసుల వ్యవస్థ అనేది లేకుంటే వీళ్ల వ్యవహారం ఎంత భయంకరంగా ఉంటుందో? మరి ఎందుకీ ఉన్మాదం? ఎందుకీ గొడవలు, ఎందుకీ పగలు, ప్రతీకారాలు? అభిమానులారా.. మీరు ప్రయాణిస్తున్న మార్గం ఇలా ఎక్కడి వరకు?మరి హీరోల మధ్య ఏమైనా గొడవలున్నాయా? ఏమైనా విబేధాలున్నాయా? అంటే ఏమీ లేదు. వాళ్లు వాళ్లు బాగానే ఉన్నారు. ఇటీవల రామ్ చరణ్ నిశ్చితార్థంలో పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్ చాలా క్లోజ్ గా ముచ్చట్లాడుకోవడమే ఇందుకు నిదర్శం. ఇక మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. జల్సా సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే ఇందుకు తార్కాణం. ఇది ఒకరకంగా మేమంతా కలిసే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మా మధ్య విబేధాలు, గొడవలు లేవని ఫ్యాన్స్ లోకాని వారంతా ఇచ్చిన సందేశం. ఈ విషయాన్ని ఇప్పటికైనా అభిమానులు గుర్తిస్తే మంచిదని అందరి అభిప్రాయం. తమ అభిమానాన్ని చాటు కోవడం పోటీ పండటంలో తప్పులేదు. కానీ మార్గం ఇది ఎంత మాత్రం కాదు. సినిమాను విజయంవంతం చేయడంలో పోటీ పడండి...పరిశ్రమ బాగుపడుతుంది. హీరో పేరు చెప్పి ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడండి మీ హీరోతో పాటు ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఇలా ఒకరిపై ఒకరు విద్వేషాలు, ప్రతీకారాలు పెంచుకోవడం ద్వారా జరిగేది హింస, వినాశనం తప్ప మరేమీ మిగలదు.

మహేశ్‌బాబు ఇంటిపై ఐటీ దాడులు

టాలీవుడ్ హీరో, ‘ప్రిన్స్’ మహేశ్‌బాబు ఇంటిపై ఆదాయపుపన్ను అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. అడ్వాన్స్ టాక్స్ చెల్లింపుల్లో తేడాలు ఉండటంతో మహేశ్‌బాబు ఇంటిపై దాడులు చేసినట్టు తెలుస్తోంది. దాడుల్లో ఆదాయపుపన్ను రిటర్న్స్‌పై ఐటీ ఆధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఇటివల విడుదలై, రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘దూకుడు’ చిత్ర నిర్మాత నివాసంపై కూడా దాడులు జరిగిన విషయం తెలిసిందే.

డర్టి పిక్చర్ పై రామ్ గోపాల్ వర్మ కామెంట్

విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ఏక్తా కపూర్ రూపొందించిన డర్టీపిక్చర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ...డర్టీ పిక్చర్ ని ఫ్యామిలీలు కూడా చూసేలా రూపొందించినందుకు ఫ్యామిలీ క్వీన్ ఏక్తాకు కుదాస్ అంటూ మెచ్చుకున్నారు. అలాగే అన్ని కుటుంబాలకి మనస్సు లోపల అంతర్గతంగా డర్టీ అనేది ఉంటుందని చాలా కాలంగా నా మనస్సులో అనుమానం ఉండేది. అది నిజమేనని ఏక్తా ప్రూవ్ చేసింది అని ట్వీట్ చేసారు. ఇక విద్యాబాలన్,నసీరుద్దీన్ షా కాంబినేషన్ లో వచ్చిన డర్టీ పిక్చర్ మొన్న శుక్రవారం దేశమంతటా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే టైటిల్ తో విడుదల చేసారు. సిల్మ్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 21 కోట్ల బడ్జెట్ తో ఏక్తా కపూర్ నిర్మించింది. మిలింద్ లూద్రియా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓపినింగ్స్ బాగానే తెచ్చుకోలగలిగింది. అలాగే దేశం మొత్తం మీద హిందీ వెర్షన్ కి శుక్రవారం 9.5 కోట్లు,శనివారం 10.7 కోట్లు,ఆదివారం 12.3 కోట్లు వసూలు చేసింది.

ఐదు సినిమాలు ఓకే చేసిన అనూష్క

అనూష్క రీసెంట్ గా ఐదు సినిమాలు ఓకే చేసింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే అవన్నీ తమిళ చిత్రాలు. అరుంధతి తర్వాత ఆ రేంజి హిట్ ని సాధించలేకపోయిన అనూష్క తమిళంలోనూ సింగం వంటి చిత్రాల ద్వారా తనకంటూ ఓ స్ధానం ఏర్పాటు చేసుకుంది. ఆ మధ్య విడుదలైన వేదం రీమేక్ కూడా అక్కడ వర్కవుట్ కాకపోయినా ఆమెకు మంచి పేరే తెచ్చి పెట్టింది. దాంతో హీరోలంతా ఆమెను తమ ప్రక్కన నటించాలంటూ కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమె వరసగా సినిమాలు సైన్ చేసేసింది. ఇప్పటికే కార్తీ సరసన ఆమె సినిమా చేస్తోంది.ఆ తర్వాత సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఆర్య హీరోగా ఒప్పుకున్న చిత్రం పిభ్రవరి నుంచి మొదలు కానుంది. అలాగే విక్రమ్ సరసన మరోసారి తాండవం చిత్రం కమిటైంది. మరో ప్రక్క సూర్య,అజిత్ చిత్రాలుకు ఓకే చేసింది. అవి ఆగస్టులో మొదలవుతాయి. ప్రస్తుతం తెలుగులో ఆమె నాగార్జున సరసన ఢమురకం చిత్రం మాత్రమే చేస్తోంది. ఆ తర్వాత వెంకటేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చిత్రం ఓకే చేసింది. అయితే ఇంకా ఆ ప్రాజెక్టు కన్ఫర్మ్ కాలేదు. అలాగే ప్రభాస్ సరసన ఆమె వారిధి చిత్రం చేసే అవకాసం ఉంది. 2012 లో ఆమె అస్సలు ఖాళీ లేకుండా తన డైరీని ఫిల్ చేసుకుని మిగతా హీరోయిన్స్ కి షాక్ ఇచ్చింది.