Thursday, 1 March 2012

రెండోసారి కీమోథెరపీ చేయించుకున్న ...యువరాజ్‌సింగ్

ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న క్రికెటర్ యువరాజ్‌సింగ్ రెండోసారి కిమోథెరపీ చేయించుకున్నారు. అమెరికాలోని బోస్టన్‌తో చికిత్స పొందుతున్న యూవీ మెల్లమెల్లగా క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నాడు. తాను రెండో సారి కీమోథెరిపి చేయించుకున్నట్లు యువరాజ్‌ ట్విటర్‌లో తెలిపాడు. చికిత్సలో భాగంగా మళ్లీ స్కానింగ్‌ ఈనెల ఏడో తేదీన ఉన్నట్లు యువీ ట్విటర్‌లో చెప్పారు.ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న యువీ ట్యూమర్‌ తగ్గుతోందన్నాడు. గత నెల రోజుల నుంచి బోస్టన్‌లోనే ఉంటున్న యువరాజ్‌ మే మొదటి వారంలో మళ్లీ బ్యాట్‌ పట్టే అవకాశాలున్నాయి. జనవరిలో చికిత్సలో భాగంగా యువీ గుండు చేయించుకున్నాడు. ఈనెల మొత్తం యువీ చికిత్స తీసుకోనున్నాడు. వచ్చే నెల నుంచి రిహాబిలిటేషన్‌ మొదలవుతుంది.

నేటి నుంచి అనంతపురం జిల్లాలో చెరువు పోరు బాట

'నీరు లేనిదే మనిషికి మనుగడ లే దు... నీటి వనరులున్న చోట నాగరికత ఉంటుంది. జిల్లాలో సాగునీటి సౌకర్యాలు పెద్దగా అందుబాటులో లేనందున చెరువులను అభివృద్ధి చేయడం ద్వారానే కరువు కోరల నుంచి రైతన్నలకు విముక్తి లభిస్తుంది. అందుకే 'చెరువు బాట' ప్రతి ఒక్కరికీ బతుకు బాట కావాలనే ఆకాంక్షతో ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నామ'ని రాయలసీమ వికాస సాధన సమితి అధ్యక్షుడు, సీనీనటుడు నరేష్ పేర్కొన్నారు. జిల్లాలో గురువారం నుంచి 'చెరువుబాట' పేరుతో ఆయన రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భా న్ని పురస్కరించుకుని  మార్చి 1 న అనంతపురంలో రథయాత్రను ప్రారంభించి ఆరు రోజుల్లో 36 మండలాల మీదుగా 800 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ప్రజలను చైతన్య పరచనున్న ట్లు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, కళాకారు లను భా గస్వాములను చేయనున్నట్లు తెలిపారు. యాత్ర ద్వారా ప్రతి చెరువు చరిత్రా తెలు సుకోవాలని ఆశిస్తున్నామన్నారు. యాత్రకు జాతీయ స్థా యిలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో మెగసెసే అవార్డు గ్రహీ త, వాటర్‌మన్ ఆఫ్ ఇండియాగా పే రొందిన రాజస్థాన్ కు చెందిన రాజేంద్రసింగ్‌ను ఆహ్వానించామన్నారు. ఇక్కడి చెరువుల అభివృద్ధి కోసం అవసరమైతే ప్రధాన మంత్రిని కూడా కలుస్తామన్నారు.చెరువుల అభివృద్ధి కోసమే రాయలసీమ వికాస సాధన సమితి దేశంలోనే కరువు జిల్లాగా గుర్తింపు పొందిన అనంతపురం నుంచి ప్రా రంభించి రాయలసీమ వ్యాప్తంగా ఉండే చెరువులను అభివృద్ధి పరిచేందుకు అంచెలంచెలుగా పోరాటాలు చేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ వికాస సాధన సమితి ఏర్పాటు చేసినట్లు నరేష్ వెల్లడించారు.
 
 


 



 
   

జగన్ సిఎంగా ఉంటే బాగుండేది ...డిఎల్ రవీంద్రా రెడ్డి

మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేదని కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు మదనపడుతున్నారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి గురువారం అసెంబ్లీ లాబీల్లో అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒరిగిందేమీ లేదని అనుకుంటున్నారని ఆయన అన్నారు.మూడు నెలల్లో ఆసుపత్రుల్లో డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. వారం రోజుల్లో 130 పిహెచ్‌సిలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉందని కానీ మందుల కొరత మాత్రం లేదని చెప్పారు. మందులు అన్ని ఆసుపత్రులలో దొరుకుతున్నాయని చెప్పారు. 
 

Wednesday, 29 February 2012

కెసిఆర్‌కు పోటీ సభ పెడతా... టిజి వెంకటేష్

ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొంటానని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. అయితే పార్టీ నేతలు వద్దని చెబుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో ఆంధ్ర ప్రజా సమితి పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వస్తే తాను కాంగ్రెసు తరఫున ప్రచారం చేసేందుకు వెళతానని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం చెప్పారు. కెసిఆర్ కొవూరులో ప్రచారం చేస్తే అదే సమయంలో నేను అక్కడ సభను ఏర్పాటు చేస్తానని చెప్పారు. కెసిఆర్ అక్కడ ప్రత్యేక వాదం వినిపిస్తే తాను సమైక్యవాదం వినిపిస్తానని చెప్పారు. ఆయనపై ఎవరూ దాడి చేయకుండా చూస్తానని చెప్పారు. కెసిఆర్ అక్కడ ఏర్పాటు చేసే సభకు ఎక్కువ జనం వస్తే రావొచ్చునని.. అడవి మనుషులను చూసేందుకు కూడా జనం అధికంగా వస్తారని విమర్శించారు.

ఏప్రిల్ నుంచి సచిన్‌కు మంచిరోజులు

సచిన్ టెండూల్కర్‌కు 39వ పడిలోకి అడుగుపెడితే అతనికిక అన్నీ మంచిరోజులేనని కేరళకు చెందిన ఎంకే దామోదరన్ అనే ఓ జ్యోతిష్కుడు నొక్కి వక్కాణిస్తున్నాడు. ఏప్రిల్ 24న సచిన్ పుట్టినరోజని, ఆ రోజు తర్వాత అతను వందో శతకం సాధించేస్తాడని అన్నాడు. రాబోయే ఏడాదికాలంలో సచిన్ శతకాల సంఖ్య 102కు చేరుతుందని కూడా చెబుతున్నాడు. కాబట్టి సచిన్ తొందరపడి రిటైర్మెంట్ ప్రకటించకూడదన్నాడు. భారత జ ట్టు 2011 వరల్డ్‌కప్ గెలుస్తుందని ముందే చెప్పానన్నాడు.

అసెంబ్లీలో బడ్జెట్ పై ప్రసంగం...వైయస్ విజయమ్మ

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఏమైనా కక్ష ఉంటే తమపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం అసెంబ్లీలో అన్నారు. ఆమె ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైయస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం నీరుగారుస్తుందని విమర్శించారు. వైయస్ కాంగ్రెసును రెండుసార్లు అధికారంలోకి తీసుకు వచ్చారన్నారు. అలాంటి వ్యక్తి పైన కక్ష ఉంటే మాపై తీసుకోండి కానీ ఆయన పేదల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై కాదన్నారు. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం ఎందుకు నడపలేక పోతుందన్నారు. పెట్రోలు, గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెరిగాయో అందరికీ తెలుసన్నారు.దేశానికి వెన్నుముక అయిన వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం బాధకరమని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమమే ధ్యేయంగా నడిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంను ఆమె గుర్తు చేసుకున్నారు. బరువైన హృదయంతో.. ఉద్వేగంగా పదిహేను నిమిషాలపాటు మాట్లాడిన విజయమ్మ ప్రసంగాన్ని సభ్యులు శ్రద్దగా విన్నారు. ప్రజా సమస్యలపై విజయమ్మ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా ఉందని పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రశంసించారు.
 

వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి పోటీ చేయను... జేసీ దివాకర్‌రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని, శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చలు జరగడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీని చూస్తుంటే భరించలేకపోతున్నానని, శాసనసభకంటే రాజ్యసభే బాగుందని, అయితే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని జేసీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను తాడిపత్రి నుండి పోటీ చేయనని దివాకర్‌రెడ్డి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాజ్యసభకు తమ అభ్యర్థిని నిలబెట్టే అవకాశముందన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేల వేటు విషయమై స్పీకర్ చూసుకుంటారని జేసీ పేర్కొన్నారు.