Wednesday, 18 January 2012

ఎన్టీఆర్ నివాళులర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు



బాలకృష్ణది చిన్నపిల్లాడి మనస్థత్వం అన్న చిరంజీవి వ్యాఖ్యలపై బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవి మాటలు నేర్చారని, మంత్రి పదువుల కోసం ఢిల్లీలో బేరసారాలు ఆడే వ్యక్తి గురించి తానేమీ మాట్లాడనని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నారంటే అది ఆయన ఇష్టమన్నారు.పార్టీ ప్రచారానికి రావచ్చు, రాకపోవచ్చు అని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ అందరికీ ఆరాద్య దైవం అని కొనియాడారు. ఎన్టీఆర్‌కు తాము రాజకీయ వారసులం కాదని, పార్టీ కార్యకర్తలమని బాలకృష్ణ తెలిపారు.స్వర్గీయ నందమూరి తారక రామారావు 16 వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, దగ్గుబాటి తదితరులు ఎన్టీఆర్ ఘాట్‌కు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ నాయుడు ఎన్టీఆర్‌కు నివాళులులర్పించారు. అనేక మంది టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్‌కు తరలివచ్చారు.

రెండు నెలల్లో తిరుపతిలో రాత్రి వేళల్లో విమానాలు



కలియుగ వైకుంఠం తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు ఉందని పార్లమెంట్ అంచనాల కమిటీ పేర్కొంది. తిరుపతికి ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకొనే రైల్వే స్టేషన్, విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని పార్లమెంటరీ కమిటీ తెలిపింది. తిరుపతిలో సమావేశమైన కమిటీ అభివృద్ధి పనులను సమీక్షించింది. మరో రెండు నెలల్లో తిరుపతిలో రాత్రి వేళల్లో విమానాలు ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. రానున్న ఐదేళ్లలో తిరుపతి రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు.

నా రాజీనామాను ఆమోదించండి...ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

ఎమ్మెల్యే పదవికి తాను సమర్పించిన రాజీనామాను ఆమోదించాలని భూమా శోభా నాగిరెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తన రాజీనామాను సాంకేతిక కోణంలో చూడకుండా విలువలకు కట్టుబడి ఆమోదించాలని ఆమె కోరారు. అసలు ప్రజారాజ్యం పార్టీయే మనుగడలో లేనపుడు విప్ ధిక్కారానికి సంబంధించి వారిచ్చిన అనర్హత నోటీసుకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్వయంగా కాంగ్రెస్‌లో చేరిపోయి అక్కడ సమన్వయ కమిటీ సభ్యుడుగా నియమితులయ్యారనీ అలాంటపుడు ప్రజారాజ్యం ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. ఇంకా తాను పీఆర్పీ అధ్యక్షుడుగా ఉన్నానని చిరంజీవి చెబితే తాను తప్పకుండా ఆయన వద్దకు వెళ్లి వివరణ ఇస్తానని ఆమె ఎద్దేవా చేశారు. తనపై ఉన్న కేసులను ఎత్తివేస్తే కాంగ్రెస్‌లో చేరడానికి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినపుడు శోభ తప్పు పట్టారు. తన అక్రమాస్తులు, అవినీతిపై విచారణ జరక్కుండా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుకు మరొకరి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారనీ ఆయన అసెంబ్లీలో అవిశ్వాసతీర్మానం పెట్టింది కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కానే కాదనీ కేవలం జగన్‌ను సమర్థించే ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికేనని ఆమె అన్నారు. చంద్రబాబుకు రైతుల పట్ల ఏ మాత్రం ప్రేమ లేదననాడికి ఆయన తొమ్మిదేళ్ల పాలనలో చేసిన నిర్వాకమే నిదర్శనమని శోభ గుర్తు చేశారు. చంద్రబాబుకు, కాంగ్రెస్‌కు ధైర్యం ఉంటే తాజాగా అందరమూ కలిసి ఎన్నికలకు పోదాం సిద్ధం కావాలని ఆమె సవాలు విసిరారు. ఇప్పటికే రెండు సార్లు ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబుకు మళ్లీ అదే అనుభవం ఎదురవుతుందని ఆమె జోస్యం చెప్పారు.

అనంతపురం జిల్లాలో కరవు బృందం పర్యటన

జిల్లాలో వ్యవసాయ పరిస్థితులపై అధ్యయనం చేసి వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక రూపొందించేందుకు కేంద్ర అధ్యయన బృందం రెండు రోజుల పాటు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటన చేయనున్నట్లు కలెక్టర్ వి.దుర్గాదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర సాంకేతిక బృందంలో 19 మంది సభ్యులు ఉంటారన్నారు. వీరందరూ ఆయా రంగాలలో వివిధ అంశాలలోనిష్ణాతులని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో, వాతావరణ అంశాలు వంటి అనేక పరిశోధనలు చేసిన అపార అనుభవజ్ఞలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందినవారన్నారు. క్షేత్ర పర్యటనలో వివిధ భౌగోళిక, స్థానిక అంశాలు, అక్కడి పంటల సాగు, దిగుబడి, వర్షపాతం తదితర వివరాలతో పాటు స్థానిక రైతులతో ముఖాముఖి కార్యక్రమం చేపడతారన్నారు. 19 మం ది సభ్యులతో కూడిన బృందం జిల్లాలో మూడు బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయి పర్యటన చేయనుందన్నారు. 18న ఒకటవ బృందం అనంతపురం నుంచి బయలుదేరి మలకవేములకు చేరుకుంటుంది. అక్కడ రైతులతో ము ఖాముఖి ఏర్పాటు అనంతరం కదిరికి చేరుకుని అక్కడ నుంచి బట్రేపల్లి, యనుములదొడ్డివారి పల్లి, కటారుపల్లి చేరుకుంటుంది. రెండవ బృందం అనంతపురం నుంచి గుట్టూరు, అడదాకులపల్లి, చెరుకూరులకు చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడుతుందన్నారు. అనంతరం మడకశిరకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తుందన్నారు. మూడవ బృందం అనంతపురం నుంచి బయలుదేరి చక్రాయపేట, చీమలవాగుపల్లిలలో రైతులతో సమావేశమవుతుందన్నారు. అనంతరం గుంతకల్లుకు చేరుకుని రాత్రికి గుంతకల్లులోనే బస చేస్తుందన్నారు. 19న ఒకటవ బృందం కటారుపల్లి నుంచి బయలుదేరి కమతంపల్లి, పులగంపల్లి, ముక్తాపురం గ్రామాలలో రైతులతో సమావేశమవుతుందన్నారు. రాత్రికి అనంతపురం చేరుకుంటుందన్నారు. రెండవ బృందం మడకశిర నుంచి బయలుదేరి హీరేతుర్తి, ములకనూరు, పంపనూరు గ్రామాలలో రైతులతో సమావేశమై రాత్రికి అనంతపురం చేరుకుంటుందన్నారు. మూడవ బృందం గుంతకల్లు నుంచి బయలుదేరి పందికుంటలో రైతులతో సమావేశమవుతుందన్నారు. రేణిమాకుల పల్లిలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌ను సందర్శిస్తుందన్నారు. మాళ్యంలో రైతులతో సమావేశమై రాత్రికి అనంతపురం చేరుకుంటుందన్నారు. 19న రాత్రికి మూడు బృందాలు అనంతపురం చేరుకుని జిల్లా కేంద్రంలోనే బస చేస్తాయన్నారు. 20న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రెవెన్యూ భవన్‌లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఎన్‌జీఓలు, అభ్యుదయ, ఆదర్శ రైతులతో సమావేశమవుతారని తెలిపారు.

Tuesday, 17 January 2012

బాలయ్యపై పోటీపై పార్టీదే నిర్ణయం, చర్చిస్తాం...చంద్రబాబు నాయుడు


సినీ హీరో, తమ పార్టీ నాయకుడు బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చెప్పారు. బాలయ్య పోటీపై పార్టీలో చర్చిస్తామని ఆయన అన్నారు. బాలయ్య పోటీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. అయితే, బాలయ్య పార్లమెంటుకు పోటీ చేస్తారా, శాసనసభకు పోటీ చేస్తారా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఏ విషయమైనా పార్టీలో చర్చిస్తామని, పార్టీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని ఆయన అన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం బాలయ్య పోటీ విషయంపై చంద్రబాబు మాట్లాడారు. బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. దీన్ని బట్టి పార్టీ నిర్ణయం పేర చంద్రబాబు తన నిర్ణయాన్ని బాలయ్యపై రుద్దబోతున్నట్లు చర్చ జరుగుతోంది. బాలకృష్ణను లోకసభకు పంపేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల నుంచి తనకు పోటీ లేకుండా చూసుకోవడమే ఆయన ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. నందమూరి హరికృష్ణను రాజ్యసభకు పంపించినట్లే, బాలకృష్ణను లోకసభకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. బాలకృష్ణను కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన అభిమానులు చూస్తున్నారు. శాసనసభకు ఆయనను పోటీకి దించే 2014 ఎన్నికల్లో పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి పోటీ రావడం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే, ముందే ఆయనను అడ్డం తొలగించుకోవాలనే ఎత్తుగడలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ నిర్ణయం పేర ఆయనను వచ్చే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా లోకసభకు పోటీ చేస్తే శాసనసభకు ఎక్కువ మందిని గెలిపించే అవకాశాలుంటాయని ఆయనకు నచ్చజెప్పే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏమైనా, బాలకృష్ణ విషయంలో చంద్రబాబు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.సినీ హీరో, పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేతిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ ప్రకటించినప్పటి నుంచి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై చర్చ జరుగుతోంది. తాజాగా, ఆయన లోకసభకు పోటీ చేస్తారా, శాసనసభకు పోటీ చేస్తారా అనే చర్చ ప్రారంభమైంది. ఈ చర్చను చంద్రబాబు నాయుడే ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. విజయవాడ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు నాయకుడు లగడపాటి రాజగోపాల్‌పై బాలకృష్ణ పోటీ చేస్తే బాగుంటుందని తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మొత్తం వ్యవహారానికి ఓ మలుపు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడే ఆ మాటలు అనిపించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. బాలకృష్ణ ప్రతిస్పందన, పార్టీ ఇతర నాయకుల ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది చంద్రబాబు చూడదలుచుకున్నట్లు భావిస్తున్నారు.

పరిటాల హత్యకు హోంమంత్రి ఫాం హౌస్ లో కుట్ర...మంత్రి శంకరరావు

ప్రస్తుత హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫాం హౌస్ నుండే దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర హత్యకు కుట్ర జరిగిందని ఆరోపిస్తూ చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావు మంగళవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆయన సోనియాకు ఎనిమిది పేజీల లేఖ రాసి ఫ్యాక్స్ చేశారు. అందులో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరిటాల హత్యకు కుట్ర సబితా ఫాం హౌస్ నుండే జరిగిందన్నారు. సబిత తనయుడు కార్తీక్ రెడ్డి భూఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనపై దాడి జరిగి నెల రోజులు దాటినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించక పోవడం బాధాకరమన్నారు. దాడికి కారకులపై సబితా రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సోనియాకు విజ్ఞప్తి చేశారు.కార్తీక్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. బడుగు, బలహీన వర్గాలను దూరం చేసుకోవడం పార్టీకి సబబు కాదని లేఖలో అధినేత్రికి విజ్ఞప్తి చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలోనూ అవినీతి కొనసాగుతోందని అందులో పేర్కొన్నారు. పాలనపై అధిష్టానం ఐబి రిపోర్టు తెప్పించుకోవాలని సూచించారు. అవసరమైతే కిరణ్ కుమార్ రెడ్డిని సిఎంగా తప్పించాలన్నారు.

రాయలసీమలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి



హిందువుల పండుగల్లో మొట్టమొదటి పండుగ సంక్రాంతి. ఈ పండుగకు ఎంత దూరంలో ఉన్నప్పటికీ తప్పనిసరిగా స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో, గ్రామస్థులతో కలిసి సంక్రాంతి పండుగ చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు పట్టణాల్లో చదువుతున్న యువకులు, ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు ప్రతి ఒక్కరూ గ్రామాలకు చేరుకున్నారు. దీంతో పట్టణాలన్నీ ఖాళీ అయ్యాయి. ఏ పల్లెలో చూసినా వాహనాలతో కొత్త కొత్త వ్యక్తులతో కనిపించాయి. గ్రామానికి చేరుకున్న కొత్తవ్యక్తులు, పల్లెకు చెందిన వారు గ్రామంలో ఉండే రైతులను పలకరించడం, కలిసి మెలిసి సంక్రాంతి పండుగను చేసుకున్నారు. అయితే రైతును ఏమాత్రం కదిలించినా కష్టాలను దిగమింగుతూ వారికి తమ కష్టం ఎందుకు చెప్పుకోవాలన్న ఆలోచనతో చిరునవ్వుతో వారిని పలకరించడం, వచ్చిన బంధువులను, స్నేహితులకు, అల్లుళ్లు, ఆడ బిడ్డలకు ఎక్కడా ఏలోటు రాకుండా చూసుకోవాలన్న తాపత్రయం ప్రతి ఒక్కరిలో కనపడింది. తమ కష్టాలు ఎన్నిఉన్నా వారు వచ్చేది సంవత్సరానికి ఒకమారే కదా, వచ్చినపుడువారికి తమ కష్టాలను చూపడం భావ్యం కాదన్న విధంగా సంతోషంగా పండుగను జరుపుకోవాలన్న సదుద్దేశంతో కలిసి మెలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. అయితే పండుగకు కావాల్సిన నిత్యావసర సరుకులు ధరల పోటు ఆకాశాన్ని అంటినా కొనుగోలుచేయక తప్పలేదు. ఆరేడు సంవత్సరాలుగా వరుస కరవులతో సంక్రాంతి పండుగ కాలక్రమేణా ఆనవాయితీగా చేస్తున్న కార్యక్రమాలు చేయడం తప్ప పండుగలో పూర్తి కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. పండుగ వచ్చింది ఏదో చేసుకోవాలా, నలుగురితో నారాయణ అన్న చందంగా చేయడమేతప్ప మనస్ఫూర్తిగా రైతు లు ఈ పండుగను జరుపుకోలేకపోతున్నారు. కారణం ప్రభుత్వ వైఫల్యం, ప్రకృతి కనికరించకపోవడం రైతులను ప్రతియేడు నష్టాలలోకి నెట్టేస్తోంది. గతంలో సంక్రాంతి పండుగ అంటే గ్రామ సీమలు కళకళలాడుతుండేవి. పారుతున్న సెలయేర్లు, పక్షుల రాగాలతో, పచ్చని పైర్లతో రైతన్న ముఖంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. పండించిన ధాన్యం రాసులుపోసి ఎటువెళ్లినా రైతన్నకు ఆప్యాయత, అనురాగాలు చూపించేవారు. ప్రస్తుతం అదే రైతన్న బజారులోకి అప్పుకోసం వెళితే గతంలో పిలిచి అప్పు ఇచ్చే ఆసాములు నేడు ముఖం చాటుచేసుకుని వెళ్తున్నారు