Wednesday, 4 January 2012

ముక్కోటి ఏకాదశికి శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నామని కార్యనిర్వాహణాధికారి వి.హనుమంతరావు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ వేలల్లో మార్పులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 3గంటలకు ఆలయ ద్వారాలను తెరచి మంగళహారతులు, మూడున్నర్ర గంటలకు సుప్రభాతసేవలను నిర్వహించి భక్తులకు స్వామిఅమ్మవార్లు దర్శనమివ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లు రావణ వాహనంలో ఆసీనులై ఉత్తర ద్వారమైన శివాజీ గోపురం మీదుగా గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేవస్థానంలో నేడు అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్లు భక్తులు ఆ విషయాన్ని గమనించగలరని ఆయన తెలిపారు.రాష్ట్ర ఎన్నికల అధికారి కమిషనర్ బన్వర్‌లాల్ కుటుంబసమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించారు. వీరికి సాధరంగా దేవస్థానం కార్యనిర్వాహణాధికారి హనుమంతరావు, ఆలయ ఎఇఓ సదానందం, వసతి గృహ ఎఇఓ రాజశేఖర్, అర్చకులు, వేదపండితుల నడుమ ఘనంగా ఆహ్వానం పలికి స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనాది కార్యక్రమాలను నిర్వహించి శేషవస్త్రాన్ని, స్వామి వారి జ్ఞాపికను స్వీకరించారు.

వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల

కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్న సన్నిధి తిరుమల పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశికి సర్వహంగులతో ముస్తాబైంది. ఏకాదశి, ద్వాదశిలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పది రోజుల ముందే టిక్కెట్ల అమ్మకాల్ని పూర్తి చేశారు. దేశ వ్యాప్తంగా 12 కౌంటర్లు ఏర్పాటు చేసి ఏకాదశికి 30 వేల, ద్వాదశికి 30 వేల టిక్కెట్లను విక్రయించారు. భక్తుల తాకిడి నేపథ్యంలో వారం రోజుల నుంచి ఏర్పాట్లలో టీటీడీ తల మునకలైంది. గతంలో ఎప్పుడు లేని విధంగా తొలిసారిగా ఆలంయం ఎదుట ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విక్రయించకూడదని నిర్ణయించారు. క్యూలైన్లను పరిశీలించిన అధికారులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. క్యూలైన్లలో వెళ్లే భక్తులు వరాహస్వామి ఆలయంతో పాటు స్వామివారి పుష్కరిణి సందర్శన అనంతరం దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

మొబైల్ ద్వారా రైలు టికెట్లు

రైలు టికెట్లను ఇకమీదట మొబైల్ ఫోన్ ద్వారానే పొందవచ్చు. తొలుత పేరును రిజిస్టర్ చేసుకోవడంతోపాటు.. మొబైల్‌లో ఇంటర్నెట్ సదుపాయం ఉండి తగిన సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.. మొబైల్ వినియోగదారులు రైలు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా ఈ-టికెట్‌ను బుక్ చేసుకునే ఈ సౌలభ్యాన్ని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్’(ఐఆర్‌సీటీసీ) ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలా బుక్ చేసుకున్న తరువాత ప్రయాణికులకు పీఎన్‌ఆర్, రైలు నంబర్, ప్రయాణ తేదీ, ఎక్కే తరగతితోసహా పూర్తి వివరాలతో కూడిన రిజర్వేషన్ మెసేజ్ వస్తుంది. ఇకమీదట ప్రయాణికులు ఈ-టికెట్ ప్రింటవుట్‌ను తమతోపాటు తీసుకెళ్లనక్కర్లేదు. ప్రయాణ సమయంలో మొబైల్‌లో టికెట్ కన్ఫర్మేషన్‌తో కూడిన రిజర్వేషన్ మెసేజ్‌ను చూపితే చాలు. ప్రయాణికులు ఈ విధంగా టికెట్ బుక్ చేసుకునేందుకు మొదటిసారి మాత్రమే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత నుంచి ఐడీ, పాస్‌వర్డ్‌ను వినియోగించి టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. దీనిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్టు, ప్రస్తుతానికి రోజూ వెయ్యి మందికిపైగా యూజర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నట్టు రైల్వే అధికారి వివరించారు. ఈ-టికెట్లకోసం వసూలు చేసే సర్వీస్ చార్జీని స్లీపర్ క్లాస్‌కు రూ.10, ఆపై తరగతికి రూ.20 చొప్పున వసూలు చేస్తారు.

సచిన్ టెండూల్కర్ చౌక్‌గా మార్చవద్దు:మార్కండేయ కట్జూ

చాందినీ చౌక్ పేరును సచిన్ టెండూల్కర్ చౌక్‌గా మార్చాలనే ప్రతిపాదనపై ప్రెస్ కౌన్సిల్ చైర్‌పర్సన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు. చాందినీ చౌక్ పేరును మార్చడం దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించడమేనని కట్జూ అన్నారు. చాందినీ చౌక్ పేరు మార్పుపై అభ్యంతరం తెలుపుతూ ఢిల్లీ మేయర్ రజనీ అబ్బీకు డాక్టర్ కేఎన్ కట్జూ మెమోరియల్ ట్రస్ట్ తరుపున లేఖను రాశారు. సచిన్ టెండూల్కర్ చౌక్‌గా పేరును మార్చే ప్రతిపాదన వార్తను జాతీయ దినపత్రికల్లో చూశానని.. చాందినీ చౌక్ పేరు మార్చడం అభ్యంతరకరమైందని.. దారుణమైన విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షాజహాన్ చక్రవర్తి కాలంలో నిర్మించిన చాందినీ చౌక్ పేరు మార్చడం ప్రాచీన ఢిల్లీ నగర చరిత్రను అవమానించడమేనని ఆయన అన్నారు.

 ఇక సేవింగ్స్ ఖాతాలకూ నంబర్ పోర్టబులిటీ

కొద్ది కాలం క్రితం టెలికాం రంగంలో ప్రవేశపెట్టిన నంబర్ పోర్టబులిటీని సేవింగ్స్ బ్యాంకు ఖాతాలకు కూడా విస్తరింపచేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. దీని వల్ల ఎస్‌బి ఖాతాలు గల కస్టమర్లు ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మార్చుకున్నా నంబర్ అదే ఉంచుకునే వెసులుబాటు కలుగుతుంది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు నంబర్ పోర్టబులిటీని ప్రవేశపెట్టే యోచన ఉన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, వాటిని గుర్తించామని, పరిష్కరించే ప్రయత్నం జరుగుతున్నదని ఆర్థిక సర్వీసుల శాఖ కార్యదర్శి డికె మిట్టల్ చెప్పారు.అంతకు ముందు ఆయన ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి గోపాలన్, ఆర్థిక కార్యదర్శి ఆర్.ఎస్.గుజ్రాల్, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసుతో సమావేశమయ్యారు. నంబర్ పోర్టబులిటీ సదుపాయం అందుబాటులోకి తేవాలంటే బ్యాంకులు ఐడెంటిఫికేషన్ కోడ్, నో యువర్ కస్టమర్ (కెవైసి), కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్‌ను పూర్తి స్థాయిలో అమలు పరచాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దీని వల్ల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను మరో బ్యాంకుకు మార్చుకున్న కస్టమర్లు ఆ బ్యాంకులో కెవైసి లాంఛనాలు పూర్తి చేయాల్సిన పని ఉండదని ఆయన తెలిపారు.

మంత్రులు, ఎమ్మెల్యేలకు మద్యం మాఫియాతో సంబంధాలు..చంద్రబాబు

నిబంధనలకు విరుద్ధంగా 31 మద్యం దుకాణాలను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఎలా కేటాయించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. డిస్టిల్లరీ పర్మిట్లు ఇష్టాను సారంగా ప్రభుత్వం ఇస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ ముడుపు తీసుకుని మద్యం తయారీకి అనుమతులు ఇస్తున్నారని బాబు ఆరోపించారు.చిత్తూరు జిల్లా, కుప్పం నియోజక వర్గంలో రెండో రోజైన బుధవారం పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కులేదని అన్నారు. మద్యం నియంత్రణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్యం మాఫియాపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీయే సమాధానం చెప్పాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడి మద్యం విక్రయాలతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు మద్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా జరిగిన మోటారు సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.

సిడ్నీలో ధోనీసేనకు చేదు అనుభవం

భారత్, ఆస్ట్రేలియాల గత సిడ్నీ టెస్టు భజ్జీ, సైమండ్స్ గొడవతో అత్యంత వివాదాస్పదమైతే... తాజాగా మ్యాచ్ ఆరంభానికి ముందు మైదానం వెలుపల టీమిండియా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని జులియా గిలార్డ్ ఆహ్వానం మేరకు తేనీటివిందుకు వెళ్లిన ధోనీసేన ఆమె అధికార నివాసం ముందు పడిగాపులుపడాల్సి వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటలకు ఆరంభం కావాల్సిన కార్యక్రమం పది నిమిషాలు ఆలస్యమైంది. అయితే, 15 నిమిషాలు ముందుగానే వెళ్లిన భారత క్రికెటర్లను ప్రధాని సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో గిలార్డ్ ఇంటి ముందు కొంతసేపు మండుటెండలోనే ఎదురుచూసిన ధోనీ బృందం ఎండకు తాళలేక గేటు బయట పార్క్ చేసిన టీమ్ బస్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత ఆటగాళ్లను ప్రధాని నివాసంలోకి అనుమతించారు.