Tuesday, 3 January 2012

జగన్ లక్ష్యంగా విజయ సాయిరెడ్డి అరెస్టు?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి అరెస్టు వెనుక పెద్ద కథ నడిచినట్టుగా విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసిందని జగన్‌కు చెందిన సాక్షి దిన పత్రిక రాసింది. అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనుండటం, మరో పదహారు మంది ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదు స్పీకర్ వద్ద పెండింగులో ఉందని, ఈ నేపథ్యంలో జగన్‌ను ఏదోలా ఇరుకున పెట్టే యత్నంలో భాగంగా, సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన, కేంద్ర హోంమంత్రి చిదంబరంతో ఆయన చర్చల పర్యవసనంగానే ఈ అరెస్టు చోటు చేసుకుందన్న వాదన వినిపిస్తోందని రాసింది. విచారణలో సిబిఐకి సాయి రెడ్డి పూర్తిగా సహకరించారని, క్రమం తప్పకుండా ఆయన విచారణకు హాజరవుతున్నప్పటికీ అరెస్టు చేయడం వెనుక రాజకీయమైన ఒత్తిళ్లు పని చేశాయనే అనుమానం వ్యక్తం చేసింది.అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెసు విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే జరగబోయే ఉప ఎన్నికలు కాంగ్రెసు, టిడిపికి ఇబ్బందికరమేనని, ఈ నేపథ్యంలో జగన్ ప్రతిష్టను దెబ్బతీయాలన్న లక్ష్యం, ఒత్తిళ్ల కారణంగానే అరెస్టు జరిగిందని వాదనలు వినిపిస్తున్నాయని పేర్కొంది. ఏడాదిగా సొంత పార్టీ తలనొప్పులతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి ఎదురవుతున్న పెను సవాళ్ల నేపథ్యంలో తాజాగా సిఎం ఢిల్లీలో చిదంబరంతో సుదీర్ఘంగా చర్చించిన క్రమంలో వ్యూహాత్మకంగానే సాయి రెడ్డి అరెస్టు దిశగా అడుగులు పడినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. దీనికి రెండు రోజుల ముందే సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారని పేర్కొంది.

టీటీడీకీ శతవిధాలా శఠగోపం కిలో రూపాయి బియ్యం

ధార్మిక సంస్థ టీటీడీకి గుత్తేదారులు శతవిధాలా శఠగోపం పెడుతున్నారు. కిలో రూపాయి సర్కారీ బియ్యానికి పాలిష్‌చేసి టీటీడీకి అంటగడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పౌరసరఫరాల బ్యాగుల్లోనే వచ్చిన వేలాది కిలోల బియ్యాన్ని టీటీడీ మార్కెటింగ్ అధికారులు పక్కన పెట్టారు. వాటి నమూనాలు తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. టీటీడీకి బియ్యం సరఫరా టెండరుదారైన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన గంగాదేవి మోడ్రన్ రైస్‌మిల్ నిర్వాహకులు శనివారం రెండు లారీల్లో 50 కిలోల బరువున్న 2,220 బియ్యం బ్యాగులు టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌కు పంపారు. మార్కెట్‌లో కిలో రూ.30లు పలుకుతున్న సోనా మసూరి బియ్యాన్ని రూ.21.06 లకు సరఫరా చేస్తామని గుత్తేదారు టెండర్ దక్కించుకున్నారు. నెలకు 50 లారీల బొప్పున 6 నెలలకు 300 లోడ్ల బియ్యం వారు సరఫరా చేయాల్సి ఉంది. మూడు నెలలుగా 150 లారీల బియ్యాన్ని సరఫరా చేశారు. కాగా అర్మూర్ రైస్ మిల్లు నుంచి వచ్చిన బియ్యం సంచులు పౌరసరఫరాల శాఖ రేషన్‌షాపు డీలర్లకు సరఫరా చేసే బ్యాగులు కావడం, వాటిపై అగ్‌మార్క్ ముద్ర లేకపోవడంతో టీటీడీ అధికారులకు అనుమానం వచ్చింది. అవి కిలో రూపాయి సబ్సిడీ బియ్యమనే భావించి వాటిని పక్కన పెట్టారు. పరీక్షల నిమిత్తం వాటిని టీటీడీ ల్యాబ్‌కు పంపినట్లు టీటీడీ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీహరి తెలిపారు.

రూ.7 లక్షలిస్తే పోస్టు గ్యారంటీ!

‘మీరు పరీక్షకు హాజరైతే చాలు. మిగతా సంగతి మేము చూసుకుంటాం. మాకు తెలిసిన ఒక మంత్రి ద్వారా పోస్టు వచ్చేలా చూస్తాం. రూ.7 లక్షలిస్తే పోస్టు గ్యారంటీ’ అంటూ వీఆర్వో, వీఆర్‌ఏ ఉద్యోగార్థులను దళారులు మభ్యపెడుతున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు దళారులు రంగంలోకి దిగారు. మరోవైపు ప్రభుత్వం ఈ పరీక్షను అవకతవకలకు తావులేకుండా నిర్వహిస్తామని చెబుతోంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మూల్యాంకనం సైతం అందుబాటులో ఉన్న సాంకేతిక విధానం ద్వారా నిర్వహిస్తారు. ఈ విషయం తెలియని కొందరు అమాయక నిరుద్యోగులు దళారుల మాయలో పడి మోసపోతున్నారు. కొందరైతే అప్పు చేసి మరీ దళారుల చేతుల్లో పెడుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దళారుల అవతారమెత్తి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. జిల్లాలో వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు విపరీతమైన పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు సగటున 440 మంది పోటీ పడుతున్నారు. ఈ నెల 30న జిల్లా కేంద్రంలో రాత పరీక్ష జరగనుంది. ఆరోజు ఉదయం వీఆర్వో, మధ్యాహ్నం వీఆర్‌ఏ అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని రూపొందించే బాధ్యత జేఎన్‌టీయూకు అప్పగించారు. జిల్లాలో పర్యవేక్షణలో రాత పరీక్ష నిర్వహిస్తారు.

పరిటాల కుటుంబం నుంచి ప్రాణహాని...సూరి భార్య గంగుల భానుమతి

పరిటాల కుటుంబం, ఆయన అనుచరులే సూరిని హత్య చేశారని సూరి భార్య గంగుల భానుమతి ఆరోపించారు. మంగళవారం ఉదయం మీడియతో మాట్లాడుతూ  పరిటాల కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని మద్దిలచెర్వు సూరి భార్య గంగుల భానుమతి భయం వ్యక్తం చేశారు. తన భర్త హత్యకు పరిటాల కుటుంబీకులే కారణం అని ఆరోపించారు. టిడిపి నేతలతో కుమ్మక్కై తన భర్తని భానుయే హత్య చేశాడని ఆమె ఆరోపించారు. భాను బతికే ఉన్నాడని ఆమె చెప్పారు. పోతుల సురేష్, చమన్ సహకారంతో తనని హత్య చేసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. పటోళ్ల, సూరి హత్యలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. సూరి హత్య తరువాత తమ కుటుంబం కష్టాల్లో ఉందని ఆమె చెప్పారు.

Monday, 2 January 2012

జగన్ అక్రమాస్తుల కేసులో తొలి అరెస్ట్...జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి

జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి అరెస్ట్ సోమవారం ఉదయం నుంచి దిల్‌కుషా గెస్ట్‌హౌజ్‌లో విజయసాయిరెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ సాయంత్రం ఆయనను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయసాయిరెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి సీబీఐ కారణాల్ని వెల్లడించలేదు. విజయసాయిరెడ్డిపై 120(బి), 409, 477, 477(ఏ) సెక్షన్ల కింద డిసెంబర్ 17 తేదిన కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్ అండ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్13 క్లాజ్ 4 కింద మొత్తం 72 మందిపై సీబీఐ అభియోగాలు మోపారు. జగన్ ఆస్తుల కేసులో సీబీఐ పరిధిని మించి విచారణ చేస్తోందని విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసులో పదుల సార్లు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఎవర్ని కూడా ఇన్నిసార్లు సీబీఐ ప్రశ్నించలేదు.ఈ రోజు ఉదయం నుంచి విజయసాయిరెడ్డిని సుదీర్ఘంగా విచారించిన సి.బి.ఐ మరి కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందకు హాజరు పరచనున్న సి.బి.ఐ బెంగళూరులో ఉన్న జగన్ విజయసాయిరెడ్డి అరెస్ట్ పై స్పందించవద్దని పార్టీ నేతలను ఆదేశించిన జగన్.

దూరంగా పొండి అంటూ మీడియాఫై...నాగార్జున ఫైర్

సెలబ్రిటీల కుటుంబాల్లో వివాహ వేడుకైనా, విషాద వేడుకైనా, ఏవేడుకైనా ఈ మధ్య మీడియా తెగ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. మీడియా ఇలా పోటీ పడటానికి వివిధ చానల్స్ మధ్య పెరిగి పోతున్న పోటీ తత్వమే అని కొత్తగా చెప్పక్కర్లేదు. వీరి పోటీ తత్వం ఒక్కోసారి సదరు సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజా విషయానికొస్తే... .అన్నపూర్ణమ్మ మరణంతో అక్కినేని కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ వైపు కుటుంబీకులంతా విషాదంలో మునిగి ఉంటే మీడియా హడావుడి కూడా మొదలైంది. అసలు మీడియాకు చాలా దూరంగా ఉండే నాగార్జునకు వారి తీరు నచ్చ లేదని, తన మనుషుల ద్వారా మీడియా వారిని ఆదేశించాడని, వచ్చి పోయే వారిని ఇబ్బంది పెట్టకుండా తమ ఇంటికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. నాగార్జున ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం కూడా ఉంది. అన్నపూర్ణమ్మ అంతిమ యాత్రలో అక్కినేని నాగేశ్వరరావు కనిపించక పోవడంపై కారణం ఏమిటి? అంటూ ఊహాగానాలు ప్రసారం కావడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

క్రికెట్‌లో సచిన్ గొప్ప బ్యాట్స్‌మన్‌గా గొప్పతనం...కెప్టెన్ క్లార్క్

 క్రికెట్‌లో సచిన్ గొప్ప బ్యాట్స్‌మన్‌గా ఎదగడానికి అతడికి ఉన్న మానసిక దృఢత్వమే కారణమని, అదే అతని గొప్పతనమని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. సిడ్నీ మైదానంతో ప్రత్యేక అనుబంధం ఉన్న కారణంగా రెండో టెస్ట్‌లో సచిన్ తన వందవ సెంచరీ చే సే అవకాశం ఉందన్నాడు. ఆసీస్ బౌలర్లు జాగ్రత్తగా లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉందని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు రాసిన వ్యాసంలో హెచ్చరించాడు. ప్రపంచ క్రికెట్‌లోని మేటి బౌలర్లను సచిన్ చీల్చి చెండాడాడని, కోర్ట్నీ వాల్ష్, వసీం అక్రం, కర్ట్‌లీ ఆంబ్రోస్, వకార్ యూనిస్, మెక్‌గ్రాత్, షేన్‌వార్న్ వంటి బౌలర్లను కూడా అద్భుతంగా ఎదుర్కొన్నాడని ఆధునిక బ్రాడ్‌మన్ గురించి క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు.