Tuesday, 3 January 2012

టీటీడీకీ శతవిధాలా శఠగోపం కిలో రూపాయి బియ్యం

ధార్మిక సంస్థ టీటీడీకి గుత్తేదారులు శతవిధాలా శఠగోపం పెడుతున్నారు. కిలో రూపాయి సర్కారీ బియ్యానికి పాలిష్‌చేసి టీటీడీకి అంటగడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పౌరసరఫరాల బ్యాగుల్లోనే వచ్చిన వేలాది కిలోల బియ్యాన్ని టీటీడీ మార్కెటింగ్ అధికారులు పక్కన పెట్టారు. వాటి నమూనాలు తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. టీటీడీకి బియ్యం సరఫరా టెండరుదారైన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన గంగాదేవి మోడ్రన్ రైస్‌మిల్ నిర్వాహకులు శనివారం రెండు లారీల్లో 50 కిలోల బరువున్న 2,220 బియ్యం బ్యాగులు టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌కు పంపారు. మార్కెట్‌లో కిలో రూ.30లు పలుకుతున్న సోనా మసూరి బియ్యాన్ని రూ.21.06 లకు సరఫరా చేస్తామని గుత్తేదారు టెండర్ దక్కించుకున్నారు. నెలకు 50 లారీల బొప్పున 6 నెలలకు 300 లోడ్ల బియ్యం వారు సరఫరా చేయాల్సి ఉంది. మూడు నెలలుగా 150 లారీల బియ్యాన్ని సరఫరా చేశారు. కాగా అర్మూర్ రైస్ మిల్లు నుంచి వచ్చిన బియ్యం సంచులు పౌరసరఫరాల శాఖ రేషన్‌షాపు డీలర్లకు సరఫరా చేసే బ్యాగులు కావడం, వాటిపై అగ్‌మార్క్ ముద్ర లేకపోవడంతో టీటీడీ అధికారులకు అనుమానం వచ్చింది. అవి కిలో రూపాయి సబ్సిడీ బియ్యమనే భావించి వాటిని పక్కన పెట్టారు. పరీక్షల నిమిత్తం వాటిని టీటీడీ ల్యాబ్‌కు పంపినట్లు టీటీడీ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీహరి తెలిపారు.

No comments:

Post a Comment