Monday, 5 December 2011

వైఎస్ విజయమ్మ వెంట 19 మంది ఎమ్మెలు

కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో జరుగుతున్న అవిశ్వాస తీర్మానం సందర్బంగా ఆమె సభకు హాజరయ్యారు. ఆమె వెంట జగన్ వర్గం ఎమ్మెలు 19 మంది సభకు చేరుకున్నారు. మహిళా ఎమ్మెల్యేలు సుచరిత, కొండ సురేఖ దగ్గరుండి వైఎస్ విజయమ్మను సభలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు జోహార్‌ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు.
ప్రభుత్వం తమ పార్టీ  ఎమ్మెల్యే లను బెదిరిస్తుందని, అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డబ్బును, పదవుల్ని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఎరగా చూపుతుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు

పులివెందుల రోగులకు శిక్ష

అక్కడ నర్సులే డాక్టర్లు. ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యం చేస్తారు. దంత వైద్యులు సాధారణ వైద్యుల అవతారం ఎత్తుతారు. ఉన్న ఒకే ఒక సూపరింటెండెంట్ పరిపాలనా బాధ్యతలతో వైద్యం చేయలేని పరిస్థితి. ఇక మందుల సంగతి చెప్పక్కరలేదు. అనేక వ్యాధులకు మందులు బయట కొనుక్కోవాల్సిందే...ఇదీ పులివెందుల ఏరియా ఆస్పత్రి దుస్థితి. 15 మంది వైద్యులు ఉండాల్సిన చోట ఇద్దరే ఇద్దరున్నారు. వారిలో ఒకరు సర్జన్. మరొకరేమో దంత వైద్యుడు. ఆస్పత్రులలో అన్ని మందులూ ఉన్నాయని మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పే మాటలకూ అక్కడి పరిస్థితికీ పూర్తి విరుద్ధం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రభుత్వ పెద్దలు దీని గురించి పట్టించుకోవడమే మానేశారు. రాజకీయ కక్షతో వైద్య శాఖ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి అక్కడ వైద్యులను నియమించేందుకు కృషి చేయడం లేదు.ఓట్లు వేయలేదనే కోపంతో..సాధారణంగా నేతలు రాజకీయ కక్షలు పెట్టుకున్నా...ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవకుండా ఉండేందుకు వారికి ఇబ్బంది కలగకుండా చూస్తారు. మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం అలా కాదు.. మొన్నటి ఉప ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్ దక్కనీయకుండా ఓడించడంతో, వారిపై ‘కసి’ పెంచుకున్నారు. దీనికి తోడు ఆయనపై భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత ఊరు పులివెందుల. అందుకేనేమో మంత్రి డీఎల్ మరింత రాజకీయ కక్ష పెంచుకుని అక్కడి ఆస్పత్రిలో సేవలు మెరుగు పరిచే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వైద్యులను నియమించకపోవడంతో రోగులకు నర్సులే దిక్కవుతున్నారు. ఆయుర్వేద, దంత వైద్యులు జనరల్ డ్యూటీ డాక్టర్‌లుగా మారిపోయారు

సినిమా అనేది గ్లామర్...ముద్దుగుమ్మ త్రిష

సినిమా అనేది గ్లామర్ ప్రపంచం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ముద్దుగుమ్మ త్రిష బాగా వంటబట్టించుకున్నట్టుంది. ఈ వయ్యారికి రోజు రోజుకీ వయసు పెరుగుతున్నా మరింతగా ద్విగుణీకృత అందంతో కనిపిస్తుండటం విశేషం. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ సరసన బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ‘బాడీగార్డ్’ చిత్రంలోనూ అలాగే జూ. ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దమ్ము’ చిత్రంలోనూ త్రిష నటిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌తో నటించిన ‘తీన్‌ మాన్’ చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన త్రిష ప్రస్తుతం ఆ చిత్రానికి భిన్నంగా మరింత గ్లామర్‌ గా తదుపరి చిత్రాల్లో కనిపించనుందట. తన గ్లామర్ రహస్యం గురించి త్రిష మాట్లాడుతూ ‘సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఈ రంగంలో ఎక్కువ కాలం రాణించాలంటే ఒకటి లక్ వుండాలి లేదా గ్లామరైనా వుండాలి. ఓ నటిగా కావాల్సిన అర్హతలు అన్నీవున్నా ఈ రెండింటిలో ముఖ్యంగా గ్లామర్‌ లేకపోతే ఈ ఫీల్డ్‌లో ఎక్కువ కాలం నిలబడటం కష్టమే. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ గ్లామర్‌ గా వుండటానికే అధిక ప్రాధాన్యతనిస్తా’ అంటోంది.

ప్రలోభాలకు లొంగేది లేదు....ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

అవిశ్వాస తీర్మానం విషయంలో తాము కాంగ్రెసు పెట్టే ప్రలోభాలకు లొంగేది లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. ప్రభుత్వానికి మద్దతివ్వాలని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై కాంగ్రెసు నాయకులు ఒత్తిడి తెస్తున్నారని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. ప్యాకేజీలు ఇస్తామని చెబుతున్నారని, తమకు ప్యాకేజీలు అవసరం లేదని ఆమె చెప్పారు. రైతుల సమస్యలపైనే తాము తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నామని ఆమె చెప్పారు. తమ వర్గం శానససభ్యులను ప్రలోభ పెట్టడానికి కాంగ్రెసు యంత్రామంతా రంగంలోకి దిగిందని ఆమె అన్నారు. కెవిపి రామచందర్ రావు, బొత్స సత్యనారాయణ, డి. శ్రీనివాస్, మంత్రులు తమ పార్టీ శాసనసభ్యులను లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండాలని ఐదేళ్ల కోసం ప్రజలు తీర్పు ఇస్తే, కక్కుర్తి పడి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారని వైయస్ జగన్ క్యాంప్ శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. తమపై ఈ రోజు రాత్రే అనర్హత వేటు పడినా ఫరవా లేదని వారన్నారు.

అవిశ్వాసంపై లగడపాటి జోస్యం

తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోమవారం జోస్యం చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి 171 మంది ఎమ్మెల్యేల ఓట్లు వస్తాయని చెప్పారు. టిడిపి పెట్టిన అవిశ్వాసం వీగిపోతుందన్నారు. టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు తన హయాంలో రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెసు ప్రభుత్వం రైతులకు ఎంతో చేస్తుందన్నారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి విమర్శించారు. టిడిపి పెట్టిన అవిశ్వాసాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. మా బలాన్ని మేం నిరూపించుకుంటామన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఎమ్మెల్యేలు తిరిగి వస్తున్నారన్నారు

అద్దె గర్భం ద్వారా...తండ్రయిన అమీర్ ఖాన్‌

బాలీవుడ్ స్టార్ కపుల్ అమీర్ ఖాన్-కిరణ్ రావు అమ్మనాన్నలయ్యారు. వారికి డిసెంబర్ 1న మగ బిడ్డ జన్మించాడు. మరి అమీర్ భార్య కడుపుతో ఉన్నట్లు ఈ మద్య వార్త ఎక్కడా విన్నట్లు లేదే...అని అనుమాన పడనక్కర్లేదు. ఎందుకంటే కిరణ్ రావు అసలు గర్భం దాల్చలేదు. మరి వీరికి ఈ బిడ్డ ఎలా జన్మించాడని అనుకుంటున్నారా...? ఇదంతా వైద్య శాస్త్రం తెచ్చిన పెను మార్పుల మహత్యం. వీరిద్దరు IVF పద్దతి ద్వారా surrogate mother ( ఇతరుల కొరకు తాను బిడ్డను కను స్త్రీ) ద్వారా బిడ్డను కన్నారు. అమీర్ ఖాన్ వీర్య కణాలు, కిరణ్ రావు స్త్రీ అండంతో టెస్టుట్యూబ్ ద్వారా పిండాన్ని సృష్టించి...ఆ పిండాన్ని వేరొక మహిళ గర్భంలో ప్రవేశ పెట్టి బిడ్డను జన్మింప చేస్తారు. అదన్నమాట మ్యాటర్.ఈ విషయమై అమీర్ ఖాన్ సోమవారం మీడియాకు ఓ స్టేట్ మెంట్ విడుదల చేశారు. నేను మగ బిడ్డకు తండ్రయ్యాను. తన భార్య కిరణ్ రావు గర్భం దరించడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించక పోవడం వల్ల ఈ పద్దతిలో బిడ్డను కనాల్సి వచ్చిందని అమీర్ ఖాన్ అందులో పేర్కొన్నారు. మేము తల్లిదండ్రులయినందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

వైఎస్ జగన్,వైఎస్ విజయమ్మ....ఓట్లు వేస్తారా?

మాజీ ముఖ్యమంత్రి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రవేశ పెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వైఎస్ విజయమ్మ ఓటేస్తే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటి ఛైర్మెన్ నర్రెడ్డి తులసి రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుతో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వస్తుందా వ్యతిరేకంగా ఓటు వేస్తుందా అన్నది విజయమ్మ ఇష్టమేనని అనుకూలంగా వేస్తే చంద్రబాబుతో కుమ్మక్కు అయినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబు ప్రవేశ పెడుతున్న అవిశ్వాస తీర్మానం టీకప్పులో తుఫాను లాంటిదని వంద శాతం వీగిపోతుందని జోష్యం చెప్పారు.అవిశ్వాసంలో నెగ్గాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని జగన్ వర్గ ఎమ్మెల్యేలు , తెలంగాణా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టడానికేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు, ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దంగా లేరని రెండున్నర సంవత్సరాల మిగతా కాలం పూర్తి చేయాలనే భవనతో ఉన్నారని తెలియజేశారు. ప్రజాహిత కార్యక్రమాలు తమ నియోజక వర్గాల్లో చేసుకోవాలనే ఆలోచనలు చేసి తద్వారా మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని కోరుకుంటున్నారు తప్ప అర్దాంతరంగాఎవ్వరూ ఎన్నికలు కోరుకోవడం లేదని తెలియజేశారు. వైఎస్ జగన్ వర ఎమ్మెల్యేలు విజయమ్మ, అవిశ్వాస తీర్మాణానికి అనుకూలంగా ఓట్లు వేస్తారా, వ్యతిరేకంగా ఓట్లు వేస్తారన్నది వారి ఇష్టమేనని తెలియజేశారు.