స్వాంతత్ర్యం రాకముందు తెల్ల దొరలపై.. ఆపై
రజాకార్లపై పోరాడిన యోధుడు రాజన్న. ఈ పోరాటంలో రాజన్న ప్రాణాలు వదులుతాడు. అతని భార్య
లచ్చమ్మ (స్నేహ) కూడా చనిపోవడంతో అనాథైన కూతురు మల్లమ్మను ఓ ముసలాయన చేరదీస్తాడు. ఇదంతా
పూర్వ కథ. మల్లమ్మ పుట్టడంతో కథ మొదలవుతుంది. మల్లమ్మ పెరిగి పెద్దదవుతూ పాట మీద ప్రేమ
పెంచుకుంటుంది. ఆమె ఉండే నేలకొండపల్లి దొరల అధీనంలో ఉంటుంది. దొరసాని (శ్వేతమీనన్)కు
రాజన్న వల్ల జరిగిన అవమానం కారణంగా పాటంటే అసహ్యం. తన మాట కాదని పాటలు పాడుతున్న మల్లమ్మను
చంపేయబోగా ఆమె సంగీతం మాస్టారు కులకర్ణి (నాజర్) సాయంతో తప్పించుకుంటుంది. అతని మాట
విని ఢిల్లీలో ప్రధానిని కలవడానికి బయల్దేరుతుంది. అదే క్రమంలో తన తండ్రి రాజన్న కథ
కూడా తెలుసుకుంటుంది. రాజన్న కథేంటి? మల్లమ్మ ప్రధానిని కలిసిందా అన్నది మిగిలిన కథ.
రాజన్న తన పాటతో గ్రామ ప్రజల్లో ఉత్తేజం
తెచ్చి, ఉద్యమాన్ని లేవనెత్తే సన్నివేశాలే సినిమాలో ప్రధాన ఆకర్షణ. 20 నిమిషాల పాటు
సాగే ఈ ఎపిసోడ్ సినిమాకు ఆయువుపట్టు. వీటిని రాజమౌళే తెరకెక్కించాడు. రాజన్న పాటతో
ఉత్తేజితురాలై ముసలమ్మ పోరాడే తీరు, ఆపై పిల్లాడు ఉరికి వచ్చి దొర మనిషిని చంపే వైనం..
ఆపై గ్రామ ప్రజలంతా కలిసి దొర సైన్యాన్ని మట్టుబెట్టే తీరు ప్రేక్షకుల్నీ ఉత్తేజపరుస్తాయి.
ఇవే కాదు రాజమౌళి తీసిన యాక్షన్ సన్నివేశాలన్నీ ఆకట్టుకునేలా సాగాయి. దాదాపుగా నాగార్జున
కనిపించే సన్నివేశాలన్నింటికీ రాజమౌళే దర్శకత్వం వహించినట్లు అర్థమైపోతుంది. ఫ్లాష్
బ్యాక్ సన్నివేశాలన్నీ మాస్ ను, యూత్ ను ఆకట్టుకుంటాయి. ఐతే నిజాం పాలకుల క్రూరత్వాన్ని ప్రతిబింబించేందుకు
తీసిన ‘పన్ను’
సన్నివేశం చాలా ఇబ్బందికరంగా
ఉంది. అందుకు మరో మార్గాన్ని ఎంచుకుని ఉంటే బావుండేదేమో. తీవ్రత చూపించడానికి మరో మార్గమే
లేదా? వాస్తవంగా అలా జరిగి ఉన్నా కూడా అలా తీయాల్సింది కాదు. రాయడానికి ఇబ్బంది కలిగించే ఈ సన్నివేశాల్ని మహిళలు,
పిల్లలు థియేటర్లలో చూడగలరా?
ఆరంభంలో మల్లమ్మ పాత్ర చుట్టూ నలభై నిమిషాల
పాటు సాగే సన్నివేశాల్లో సెంటిమెంట్ ప్రధానంగా నడిచాయి. కొన్ని సన్నివేశాలు కంటతడి
పెట్టిస్తాయి. తొలి అరగంటా సినిమా స్వచ్ఛంగా సాగింది. కానీ మల్లమ్మ ప్రధానిని కలవడానికి
ఢిల్లీకి బయల్దేరడంతోటే కథ సినిమాటిక్ గా తయారైంది. ఆరేళ్ల పాప నడుచుకుంటూ ఢిల్లీకి
వెళ్లిపోవడం టూమచ్. రైలెక్కించి ఉంటే బావుండేదేమో. ఇక యాక్షన్ ప్యాక్డ్ ఫ్లాష్ బ్యాక్
ముగిశాక.. సినిమాను సాదాసీదాగా ముగించిన తీరు కూడా నిరాశ పరుస్తుంది. క్లైమాక్స్ కూడా
ఏమాత్రం ఆసక్తి కలిగించలేకపోయింది. కేవలం మల్లమ్మ పాట విని ప్రధాని తెలంగాణ ప్రాంతానికి
దొరల నుంచి విముక్తి కలిగించడం అతిశయోక్తిలా అనిపిస్తుంది.
సినిమాకు ప్రధాన బలం కచ్చితంగా కీరవాణి సంగీతమే.
సందర్భానుసారంగా గుండెల్ని హద్దుకునే పాటలు, సన్నివేశాలకు చక్కగా సరిపోయే నేపథ్య సంగీతంతో
కీరవాణి సినిమాకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా బిట్ సాంగ్స్ కథను నడిపించడానికి బాగా ఉపయోగపడ్డాయి.
రజాకార్ల నేపథ్యంలో మంచి కథ రాయడంలో, అప్పటి మాండలికాల్ని, మనుషుల ఆహార్యాన్ని తెరమీదకు
తేవడంలో విజయేంద్రప్రసాద్ విజయవంతమయ్యాడు. ఆయన దర్శకత్వ ప్రతిభ సెంటిమెంట్ సన్నివేశాల్లో
బాగా కనిపించింది. ఐతే యాక్షన్ సన్నివేశాలన్నీ తానే తీసి, తండ్రిని డామినేట్ చేశాడు
రాజమౌళి. ఆర్ట్ డైరెక్టర్ అరవై ఏళ్ల కిందటి వాతావరణాన్ని ప్రతిబింబించే వాతావరణాన్ని
తేవడంలో బాగానే కృషి చేశాడు. ఫైట్ మాస్టర్లు కూడా అత్యుత్తమ ప్రతిభ చూపారు. మొహమాటం
లేకుండా చెప్పాలంటే నాగార్జున రాజన్న పాత్రలో పూర్తిస్థాయిలో రాణించలేకపోయాడు. ఆహార్యం,
నటన ఓకే కానీ.. డైలాగ్ డెలివరీలో తేలిపోయాడు. రాజన్న పాత్రకు గంభీరమైన కంఠం అవసరం.
కానీ సాఫ్ట్ గా ఉండే నాగార్జున వాయిస్ అందుకు సూటవలేదు. గంభీరమైన డైలాగుల్ని నాగార్జున
పలుకుతుంటే ఇబ్బందికరంగా అనిపించింది. స్నేహది పరిమితమైన పాత్ర. సినిమాలో అందరికంటే
ఎక్కువ ఆకట్టుకునేది బేబి అనినే. అంత చిన్న వయసులోనూ మల్లమ్మ పాత్రలో అద్భుతంగా నటించి
మార్కులు కొట్టేసిందా అమ్మాయి. మల్లమ్మ తాత పాత్ర పోషించిన నటుడు చాలా సహజంగా నటించాడు.
మిగతా పాత్రలన్నీ మామూలే.
తెలంగాణ ప్రజలతో ముడిపడిన కథాంశం కాబట్టి
ఈ ప్రాంతంలో రాజన్నకు బాగానే ఆదరణ దక్కే అవకాశముంది. మిగతా ప్రాంతంలో స్పందన తక్కువగా
ఉండొచ్చు. తెలంగాణ కథాంశం అన్నది పక్కనబెట్టి ఓ సినిమాగా చూస్తే రాజన్న గుడ్ ఫిలిం.
తెలుగులో చారిత్రక కథాంశంతో తీసిన సినిమాల్లో చాలావరకు ఘోరంగా దెబ్బతిన్నవే. ఐతే నాగార్జున,
రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ కలిసి చేసిన సిన్సియర్ ఎఫర్ట్ మాత్రం మెచ్చుకోదగ్గదే. కానీ
శ్రీరామరాజ్యం లాంటి సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ కోసం వెతుకుతున్న తెలుగు ప్రేక్షకులు..
సీరియస్ గా సాగే రాజన్నను ఎంతవరకు ఆదరిస్తారన్నది సందేహం. మహరాజ పోషకులైన యువత నుంచి
ఎలా స్పందన వస్తుందన్నదాన్ని బట్టే రాజన్న ఫలితం ఆధారపడి ఉంది.
No comments:
Post a Comment