Wednesday, 28 December 2011

జెకె భారవి దర్శకత్వంలో మోహన్ బాబు,నాగార్జున

ప్రముఖ రచయిత జె కె భారవి దర్శకుడుగా మారి చేస్తున్న చిత్రం ఆది శంకరా చార్య. ఈ చిత్రంలో ఆల్రెడీ నాగార్జున గెస్ట్ గా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు మోహన్ బాబు కూడా ఓ కీలకమైన పాత్రలో కి ఈ సినిమాలోకి వచ్చి చేరిందని తెలుస్తోంది. మోహన్ బాబు భారవి చెప్పిన కథ విని, ఇంత వరకు చిత్రించిన టోటల్ రషెస్ చూసి, అద్భుతంగా ఉందని అభినందిస్తూ ఆది శంకరలో నటించడానికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుతున్నారు. గతంలో తాను రాసిన అన్నమయ్యలో మోహన్ బాబు ఓ కీలకమైన పాత్రను చేసి చిత్రానికి వెన్నుముకలా నిలిచారు. ఇక నాగార్జున ఈ చిత్రంలో చేయటంపై భారవి మాట్లాడుతూ..‘నా అభిమాన హీరో నాగార్జునను ఈ పాత్రలో చూడాలని 3 ఏళ్లుగా కలలుకన్నాను. ఆ కలను అవలీలగా ఒక్క స్ట్రోక్ తో నాగ్ నిజం చేశారు. త్వరలో అన్నమయ్య, శ్రీరామదాసులను మించిన సబ్జెక్టు ఇస్తాను’ అంటూ భారవి ఉద్వేగంతో చెప్పారు.ఈ విషయమై నాగార్జున మాట్లాడుతూ...హిందూ ధర్మాన్ని నిలబెట్టిన ఆది శంకరుడి దివ్య చరిత్రలో ఆ మహనీయుడి జీవితాన్ని మలుపు తిప్పిన అత్యంత కీలకమైన ఒక మాస్ పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, భారతీయుడిగా అది నాబాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఇందులో హీరో కౌషిక్, రియల్ స్టార్ శ్రీహరి, డైలాగ్ కింగ్ సాయికుమార్, సుమన్, జయప్రద, రోషిణి, రోజా, తులసి, ఆనంద్, నాగబాబు, అశోక్ కుమార్, శివ పార్వతి, సంగీతలతో పాటు మరికొందరు నటిస్తున్నారు. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆది శంకరాచార్య, వేదవ్యాస్ పాటలు అందించగా..నాగ్ శ్రీవత్స సంగీతం సమకూర్చుతున్నారు.

సినీనటుడు సిదార్థపై బెదిరింపు ఫిర్యాదు

ప్రముఖ సినీ నటుడు సిద్ధార్థ్‌పై హత్యాబెదిరింపు కేసు నమోదైంది. దక్షిణచెన్నయ్ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన డిజైనర్ బాబు పోలీసు కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఫిర్యాదు చేశారు. సిద్దార్థ, ఆయన తండ్రి సూర్యనారాయణ కోరిక మేరకు గతంలో వారి ఇంటిని రూ.6 లక్షల 63 వేల వ్యయంతో అలంకరించారని, అయితే వారు రూ.4 లక్షల 30 వేలు మాత్రమే ముట్టజెప్పి మిగతా సొమ్ము ఇచ్చేందుకు నిరాకరించారని ఫిర్యాదులో తెలిపారు. ఈ నెల 13వ తేదీన బాకీ కోసం వారి ఇంటికి వెళ్లిన తనను హత్య చేస్తామని బెదిరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఆర్థిక నేర విభాగం సీఐడీ పోలీసులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అధికార పార్టీ నాయకులు జలయుద్ధం




వారికి మద్దతుగా రంగంలోకి దిగిన రాజకీయ పార్టీల నాయకులు షట్టర్లకు అడ్డుగా వేసిన మట్టిని జేసీ ఆధ్వర్యంలో తొలగించిన తాడిపత్రి రైతులు కట్టలు గాలికి పోతుంటే ఏకులు ఏరుకున్నారనే చందంగా తయారయ్యారు మన నేతలు. హెచ్చెల్సీకి న్యాయంగా రావాల్సిన నీటి వాటాకు దారుణంగా కోత పడుతుంటే గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయడం మాని వచ్చిన అరకొర నీటి కోసం రచ్చకెక్కుతున్నారు. మంత్రి శైలజానాథ్, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి సుబ్బరాయసాగర్ నీటి విషయంలో నువ్వా.. నేనా అనే రీతిలో పోరు సాగిస్తున్నారు. అనంతపురం:ప్రభుత్వ అనాలోచిత వైఖరి.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అనంతపురం జిల్లాలో జల యుద్ధానికి దారితీసింది. ఇన్నాళ్లూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించిన రెండు నియోజకవర్గాల ప్రజల మధ్య చిచ్చు రేపింది. ఒక నియోజకవర్గం రైతులకు మంత్రి శైలజానాథ్ మద్దతుగా నిలిస్తే.. మరొక నియోజకవర్గం రైతులకు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి దన్నుగా నిలుస్తున్నారు. అధికార పార్టీలో ఉప్పునిప్పుగా పేరొందిన వీరిద్దరూ ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి తెరతీశారు. వివరాల్లోకి వెళితే.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ) ఆయకట్టులో తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ) కింద 31,131 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. ఈ ఏడాది టీబీసీ కింద 1.312 టీఎంసీలతో పది వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లందించాలని నిర్ణయించారు.
టీబీసీ ఆయకట్టుకు నీళ్లందించడానికి వీలుగా సుబ్బరాయసాగర్ జలాశయాన్ని హెచ్చెల్సీ నీటితో నింపుతారు. సుబ్బరాయసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 0.48 టీఎంసీలు. ఈ జలాశయం గేట్లకు మరమ్మతు చేయకపోవడం వల్ల నీళ్లన్నీ వృథా అవుతున్నాయి. ఏనాడూ నీటి నిల్వ సామర్థ్యం మేరకు నీళ్లను నిల్వచేయలేని దుస్థితి నెలకొంది. సుబ్బరాయసాగర్ గేట్లకు మరమ్మతు చేయకపోవడానికి ప్రధాన కారణం సున్నపురాళ్ల గనుల యజమానుల ఒత్తిళ్లకు తలొగ్గడమేనన్న వాదన బలంగా విన్పిస్తోంది. సాగర్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తే సున్నపురాళ్ల గనుల్లోకి నీళ్లు చేరుతాయి. అప్పుడు ఖనిజాన్ని వెలికితీయడం కష్టమవుతుంది. ఈ గనులన్నీ అధికార పార్టీకి చెందిన ఓ కీలకప్రజాప్రతినిధి, మరొక సీనియర్ ప్రజాప్రతినిధి, విపక్ష పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి, వారి అనునయులకు చెందినవి కావడం గమనార్హం. సుబ్బరాయసాగర్ గేట్లకు మరమ్మతు ఎందుకు చేయడం లేదని నిలదీస్తే.. నిధుల్లేవనే కారణాన్ని హెచ్చెల్సీ అధికారులు చెప్పడం రివాజుగా మారిపోయింది. ఇదే తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల ప్రజల మధ్య జల యుద్ధానికి దారితీసింది.
సుబ్బరాయసాగర్ నుంచి టీబీసీ కెనాల్ ద్వారా తాడిపత్రి, శింగనమల నియోజకవర్గంలో పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు నీళ్లందుతాయి. సాగర్‌లో నీటిమట్టం ఆరు మీటర్ల మేర ఉంటేనే ఈ కాలువకు నీటిని విడుదల చేస్తారు. రెండు నియోజకవర్గాల మధ్య నీటి యుద్ధం శాంతిభద్రతలకు సవాల్‌గా మారడంతో సుబ్బరాయసాగర్ నుంచి నీటి విడుదలను అధికారులు ఆపేశారు. ఇదే అంశంపై హెచ్చెల్సీ ఎస్‌ఈ టీబీ రవిని  వివరణ కోరగా.. రెండు ప్రాంతాల నేతలతో మాట్లాడుతున్నామని,పరిస్థితినచక్కదిద్దుతున్నామని వివరించారు.
చెరువులను తప్పకుండా నింపుతాం :మంత్రి శైలజానాథ్
తాగునీటి సమస్యను తీర్చడానికి పుట్లూరు మండలంలోని చెరువులను తప్పకుండా నింపుతామని మంత్రి శైలజనాథ్ చెప్పారు. మంగళవారం ఆయన తో ఫోన్‌లో మాట్లాడారు. 15 రోజుల క్రితం ఐదు రోజుల పాటు సుబ్బరాయసాగర్‌లో ఉన్న నీటిని దౌర్జన్యంగా తీసుకెళ్లినా.. అప్పట్లో ఎవరూ అడ్డుచెప్పలేదన్నారు. కానీ తాగునీటి కోసం చెరువులకు నీటిని విడుదల చేస్తే అడ్డుకుంటున్నారన్నారు. మూడేళ్ల నుంచి ఏదో విధంగా పుట్లూరు చెరువులను నింపుతున్నామన్నారు. ప్రజా సమస్యల విషయంలో ఘర్షణలకు దిగాల్సిన అవసరం లేదని, బుధవారం సాయంత్రం అనంతపురం వచ్చి, సమస్యపై స్పందిస్తానన్నారు.

Tuesday, 27 December 2011

న్యూ జెర్సీలో పరిటాల సునీతకు సత్కారం


అనంతపురం జిల్లాలో మహిళలకు రక్షణ లేని సమయంలో, శాంతి భద్రతలు సరిగా లేని సమయంలో పరిటాల రవి రాజకీయంలోకి వచ్చినట్లు శ్రీమతి సునీత గుర్తు చేశారు. ఈ సందర్భంగా రవి చేసిన అనేక కార్యక్రమాలను గురించి వివరించారు. పెనుకొండలో 5000 మంది పేదలకు వివాహాలు, కల్యాణమండపాలు, కాలేజీలు, విద్యార్థుల కోసం పాఠశాలలు, స్కాలర్‌షిప్‌లు అందజేశారని ఆమె తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించనున్నట్లు సునీత తెలిపారు. తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పరిటాల రవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రవి కాంక్షించిన వితరణ కార్యక్రమాలు నిర్వహించదలచినట్టు, అలాగే పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పేదలకు వివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో వరద ప్రాంతాలైన నిద్‌జూర్, భావపురం గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో వృద్ధాశ్రమాన్ని నెలకొల్పనున్నట్లు సునీత తెలిపారు. అలాగే ఫోన్స్, మరియు ఇంటర్‌నెట్ ద్వారా తెలుగు దేశం పార్టీ చేసే సేవలను ప్రజలందరీకీ తెలియజేయడంలో తమవంతు సేవనందించవలసిందిగా సునీత ప్రవాసాం«ద్రులను కోరారు. న్యూజెర్సీలో జరిగిన ఈ సత్కార కార్యక్రమంలో పరిటాల సునీత కుమారులు పరిటాల సిద్ధార్థ, పరిటాల శ్రీరామ్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 400 మంది హాజరయ్యారు. ముందుగా పరిటాల సునీత జ్యోతి వెలిగించగా, పరిటాల రవి జీవిత చరిత్ర 'అస్తమించిన రవి' డాక్యుమెంటరీతో కార్యక్రమం ప్రారంభమైంది. వెంకట్ గరికపాటి ఈ వేడకను నిర్వహించగా, వంశీ ప్రియ వ్యాఖ్యాతగా వ్యవహరించి తన మధురమైన గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే చిన్నారులు అద్భుతమైన నృత్యాలను ప్రదర్శించారు. వెంకట్ గరికపాటి మాట్లాడుతూ రాజకీయంలో పరిటాల రవి ప్రతిభను తెలియజేస్తూ పరిటాల శ్రీరామ్‌ను రాజకీయాలలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. డాక్టర్ బాబూరావు దొడ్డపనేని, హరనాథ్ దొడ్డపనేని, సతీష్ వేమన, భక్త భల్ల, లక్ష్మి దేవినేని, మోహన్ కృష్ణ మన్నవ, రాధాకృష్ణ నల్లమల ప్రభృతులు ప్రసంగించారు. పరిటాల రవి ఆత్మశాంతి కోసం సభ ముందుగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ప్రవాసులను విశేషంగా ఆకర్షించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబూరావు దొడ్డపనేని, తానా కోశాధికారి సతీష్ వేమన, తానా ట్రస్టీ నరేన్ కొడాలి, దాము గేదెల, హరనాథ్ దొడ్డపనేని, మోహన్ కృష్ణ మన్నవ (నాటా రీజనల్ కోఆర్టినేటర్), శైలజా అడ్లూరు (టీఏజీడీవీ అధ్యక్షులు), రవి పొట్లూరి (టీఏజీడీవీ కార్యదర్శి) భక్త భల్ల్లా, రమణ గన్నె, రవి పొత్తూరు, లక్ష్మి దేవినేని, పున్నమ్ మంతెన ప్రభృతులు పాల్గొన్నారు,

పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అభిమానులకు న్యూఇయర్ రోజు గిఫ్టు

2011 సంవత్సరంలో ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండా అభిమానులను నిరాశ పరిచిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ న్యూఇయర్ రోజు గిఫ్టుతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలా కనిపించబోతున్నాడనే ఆసక్తి మెగా అభిమానులందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో జనవరి 1న రచ్చ తొలి ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రచ్చ సినిమాపై ఓ మెగా అభిమాని మాట్లాడుతూ ‘‘ రచ్చ సినిమాలో రామ్ చరణ్ న్యూ గెటప్ ను చూడటానికి మేమంతా ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నాం, న్యూ ఇయర్ రోజు ట్రైలర్ విడుదలైతే దాన్ని మాకు అందిన బహుమతిగా భావిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చెర్రీ మెడికల్ స్టూండెంట్ పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి సినిమాలోని ‘వాన వాన వెల్లువాయే’ పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చిలో రచ్చ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ ఈ చిత్రానికి నిర్మాతలు.
 

అన్నా హజారే అవినీతి ఉద్యమం కోసం రజనీకాంత్ ఉచితంగా..రూ. 8లక్షల

అవినీతిపై పోరాటం చేస్తున్న అన్నా హజారే బృందం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో దీక్ష చేయడానికి ఎంఎంఆర్‌డి గ్రౌండ్ కు రూ. 8లక్షల అద్దె కట్టే స్తోమత లేక తమ ప్రయత్నాన్ని విరమించుకుంది అన్నా బృందం. అయితే అన్నా అవినీతి పోరాటానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ అండగా నిలవడానికి ముందుకు వచ్చారు. చెన్నయ్ లో దీక్ష చేస్తే నగరం నడి ఒడ్డున గల తన రాఘవేంద్ర కళ్యాణ మంటపాన్ని మూడు రోజుల పాటు ఉచితం ఇచ్చేందుకు అంగీకరించారు. భారత అవినీతి వ్యతిరేక కమిటీ మెంబర్ ఎంఎస్. చంద్రమోహన్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తూ....తమ అభ్యర్థనకు రజనీకాంత్ సానుకూలంగా స్పందించారని, కళ్యాణ మంటపాన్ని దీక్ష కోసం ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించారని వెల్లడించారు. ఇప్పటికే అనేక మందికి అండగా నిలుస్తూ సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్...తాజాగా అవినీతి కి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి తన వంతు సాయం చేయడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టిటిడి ఉద్యోగులకు సంస్కృతభాషపై శిక్షణ

ఎక్కడైతే సంస్కృతభాష వృద్ధి చెందుతుందో అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు కూడా పరిఢవిల్లుతాయని ఆంధ్రా గిర్వాణి విద్యాపీఠం ప్రిన్సిపాల్ బ్రహ్మశ్రీ దోర్భల ప్రభాకర్ శర్మ అన్నారు. టిటిడి ఉద్యోగులకు సంస్కృత భాషపై టిటిడి యాజమాన్యం శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తిరుపతి శే్వతాభవనంలో ప్రారంభించారు. 10 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రభాకర్‌శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని పఠించగల్గిన శక్తి ఒక సంస్కృతభాషకే వుందన్నారు. ఇది మతపరమైన భాషే కాకుండా శాస్తప్రరంగా కూడా ఎంతో ఉత్కృష్టమైనదన్నారు. సంస్కృతభాషను 50 ఏళ్లక్రితమే ఉద్ధరించి వుంటే దేశం మరింత గొప్పగా అభివృద్ధి పథంలో నడిచేదన్నారు. సంస్కృతభాష శబ్ధపరంగాను, రూపపరంగాను, అలంకార పరంగాను ఏపరంగా చూసినా ఎంతో గాంభీర్యమైనదని, ఈగాంభీరతాభావం ఇతర భాషల్లో లేదన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి థార్మిక సంస్థ అయిన టిటిడిలో పనిచేస్తున్న ప్రతిఒక్క ఉద్యోగి భగవంతుని సేవతో పాటు భక్తుల సేవలో కూడా పాల్గొంటున్నారు. అలాంటి కృతార్థులైన ప్రతిఒక్క ఉద్యోగి ఈ భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. సంస్కృతభాషకు పూర్వవైభవం తీసుకురావడం కోసమే తాము సంస్కృతీభారతీ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా సంస్కృత భాషోద్యమం నడుస్తోందన్నారు. ఈ 10 రోజుల శిక్షణా తరగతులు పూర్తి అయిన తరువాత ప్రతి ఒక్కరూ సంస్కృతభాషను అనర్గళంగా మాట్లాడగలరన్న సంపూర్ణవిశ్వాసం తనకున్నంన్నారు. అందుకు కారణం సంస్కృతభాషను నేర్చుకున్నంత సరళంగా మరేభాషను నేర్చుకోలేరన్నారు. ముగింపు సమావేశం జనవరి 4వతేది జరగనుందని, ఈసందర్భంగా టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరవుతారని, ఈసందర్భంగా ప్రతి ఒక్క ఉద్యోగి సంస్కృతభాషలో సాధించిన పట్టును చాటాలని ఆయన హితవు పలికారు