Saturday, 3 March 2012

త్వరలో కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ....టిజి వెంకటేష్

ఆంధ్రలో చిచ్చు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని మంత్రి టిజి వెంకటేష్ విమర్శించారు. ఆంధ్రలో చిచ్చు పెట్టేందుకే ఉప ఎన్నిక జరుగుతున్న కోవూరు శానససభా నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తానని కెసిఆర్ చెబుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ప్రజలు ఓటేస్తే రాష్ట్ర విభజనకు ఓటేసినట్లేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన 17 మంది శానససభ్యులపై స్పీకర్ వేటు వేస్తూ సరైన నిర్ణయమే తీసుకున్నారని, వేటు బాధాకరమే అయినప్పటికీ అది సరైన నిర్ణయమని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు వైపు వెళ్లిన నాయకులు తిరిగి కాంగ్రెసులోకి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ త్వరలో కాంగ్రెసులో విలీనమవుతుందని ఆయన అన్నారు.

దగ్గుబాటి రాణాతో రామ్ గోపాల్ వర్మ సినిమా

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త సినిమా ప్రకటించారు. దగ్గుబాటి రాణా-నతాలియా జంటగా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందనుందని, అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం వర్మ బాలీవుడ్ లో రూపొందిస్తున్న ‘డిపార్ట్‌మెంట్’ చిత్రంలో బ్రెజిల్ భామ నతాలియా ఐటం సాంగులో నటిస్తోంది. ఇంతకు ముందు వర్మ నతాలియా అందచందాల గురించి తెగ పొగిడేసిన విషయం తెలిసిందే. నతాలియా లాంటి అందాన్ని నేను నా సినీ కెరీర్లో ఇదివరకెప్పుడూ చూడలేదని, ఆమె అందం చూసి పిచ్చిక్కిపోతోందని......హింసాత్మక ఘటన నేపథ్యంలో రక్తచరిత్ర సినిమా రూపొందించినట్లుగా, ఆమె ‘అందం’ గురించి అంతా చర్చించుకునేట్లుగా ఓ సినిమా తీయనున్నట్లు కూడా ప్రకటించారు వర్మ. మరి ఈ సినిమా...రాణా-నతాలియా జంటగా తీయబోయే సినిమా ఒకటేనా? అనేది తేలాల్సి ఉంది. వర్మ ఇప్పటి వరకు బోలెడు కొత్త సినిమాలు ప్రకటించారు. అందులో ఆచరణ వరకు వచ్చినవి చాలా తక్కవ. మరి ఈ సినిమాల సంగతేమిటో కాలమే నిర్ణయించాలి.

తిరుపతి దేవస్థానంకు భారీ బడ్జెట్

2010 కోట్ల రూపాయలతో టిటిడి బడ్జెట్ ని ఆమోదించారు. ఈరోజు జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో దీనిని ఆమోదించారు. దేశంలోని దేవాలయాల చరిత్రలో ఇదే భారీ బడ్జెట్ . భక్తుల కోసం తిరుపతిలో కాటేజీలు నిర్మించాలని నిర్ణయించారు. తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం దేవాలయాలకు పెద్దపీట వేశారు. కన్యాకుమారిలో 22.5 కోట్ల రూపాయలతో ఆలయం, కల్యాణమండపం నిర్మించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరున 'నిత్యకల్యాణం' ప్రారంభిస్తారు. టిటిడి విద్యాసంస్థలలో పని చేసే అధ్యాపకుల జీతాలు పెంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది 150 శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తారు. మహాద్వారం వైపు నుంచి వయోవృద్ధులతోపాటు మరొకరిని అనుమతించాలన్న ప్రతిపాదనని ఆమోదించారు. గత ఏడాది హుండీ ఆదాయం 730 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 800 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని అంచనావేశారు.
బడ్జెట్ లో వివిధ విభాగాలకు కేటాయించిన నిధులు ఈ విధంగా ఉన్నాయి. 

 

హిందూ ధర్మప్రచారానికి 106 కోట్ల రూపాయలు
ఆరోగ్యం కోసం 58.43 కోట్ల రూపాయలు
ఆస్పత్రి కోసం 22.04 కోట్ల రూపాయలు
పెన్షన్ పథకానికి 50 కోట్ల రూపాయలు
విద్యాసంస్థలకు 65 కోట్ల రూపాయలు
ఇంజనీరింగ్ విభాగానికి 149 కోట్ల రూపాయలు
విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి 39.63 కోట్ల రూపాయలు



 

రాలయసీమ ఎమ్మెల్యేలపై అనర్హత ఆమోదం

ఎట్టకేలకు సభాపతి 'అంతిమ తీర్పు' వెలువడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, దేశ చరిత్రలోనే తొలిసారిగా అధికార పార్టీకి చెందిన 6 మంది ఎమ్మెల్యేలపై మూకుమ్మడిగా అనర్హత వేటు పడింది. 'శోభా నాగిరెడ్డి రాజీనామాకు ఆమోదం... 6 మందిపై వేటు'... ఇది శుక్రవారం రాత్రి పొద్దుపోయాక స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించిన నిర్ణయం. దీంతో... 3 చోట్ల ఉప ఎన్నికల ప్రక్రియ ముగియకముందే, పది జిల్లాల పరిధిలో మరో 17 స్థానాల్లో ఉప సమర వేదిక సిద్ధమైంది. దీంతోపాటు నెల్లూరు లోక్‌సభ స్థానానికీ ఉప ఎన్నిక జరగనుంది.'సెమీ ఫైనల్స్'కు తెరలేచింది. ఖాళీ అయిన స్థానాలకు ఆరు నెలలలోపు ఉప ఎన్నికలు జరగాలి. అంటే... సెప్టెంబర్ 3లోపు ఉపసమరం ముగియాలి. అయితే జూలై 25లోపు రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. అందువల్ల ఆలోపే ఉప ఎన్నికలు జరపక తప్పదు.

అనంతపురం జిల్లా

గుర్నాథరెడ్డి (అనంతపురం అర్బన్)
కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం)
కర్నూలు జిల్లా
చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు)
శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ)
కడప జిల్లా
అమర్నాథ రెడ్డి (రాజంపేట)
శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)

Friday, 2 March 2012

రామ్ గోపాల్ వర్మ వార్నింగ్..!

వివాదాస్సద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రెడ్డి గారు పోయారు’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలతో రాజకీయ కోణాన్ని టచ్ చేస్తూ ఈ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపారు ఈ దర్శకుడు. వర్మ ఈ టైటిల్ ప్రకటించిందే ఆలస్యం....‘రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్’ నుంచి వార్నింగ్ కూడా వచ్చింది. వెంటనే టైటిల్ మార్చాలని హెచ్చరించారు. వైఎస్‌ఆర్ అభిమానుల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వర్మ దిగొచ్చినట్లే కనిపిస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్ ను ‘రెడ్డి గారు పోయారు’అని కాకుండా ‘ఆయన పోయారు’గా మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా...టైటిల్ మార్చాలని వచ్చిన హెచ్చరికలపై వర్మ ట్విట్టర్లో తనదైన రీతిలో స్పందించారు. ‘రెడ్డి గారు పోయారు టైటిల్ మీద ఎందుకు ప్రాబ్లమో? అర్థం కావడం లేదు. వాళ్ల ప్రాబ్లం రెడ్డి గారు పోలేదనా? లేక రెడ్లెవరూ పోరనా?’’ అని వ్యాఖ్యానించారు. వర్మ వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరినట్లయింది. అయితే వైఎస్‌ఆర్ అభిమానులు తన బెండు తీస్తారని గ్రహించిన వర్మ టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

విశ్రాంతినివ్వాలని కోరా...వీరేంద్ర సెవాగ్

ఆసియాకప్ నుంచి తనకు విశ్రాంతిని ఇవ్వాల్సిందిగా బోర్డును కోరాననీ, తనను జట్టు నుంచి తప్పించలేదనీ వీరేంద్ర సెవాగ్ స్పష్టం చేశాడు. కోల్‌కతా లోని స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు జట్టు ఫిజియో ఇవాన్ స్పీచ్‌లీ ఒక ఫిట్‌నెస్ నివేదికను సెలెక్టర్లకు పంపాడు. ఆ నివేదికలో సెవాగ్, జహీర్‌లకు విశ్రాంతినివ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. కెప్టెన్ ధోనీ, కోచ్ డంకన్ ఫ్లెచర్ కూడా సెవాగ్ విశ్రాంతిని కోరుకుంటున్నాడని సెలెక్టర్లకు చెప్పారు. దీంతో సెవాగ్‌ను ప్రధాన సెలెక్టర్ శ్రీకాంత్ సంప్రదించాడు. తాను విశ్రాంతి తీసుకుంటాననీ, తాను జట్టులో ఉండాల్సిందేనని సెలెక్టర్లు భావిస్తున్నట్లయితే అందుబాటులో ఉంటాననీ సెవాగ్ అతడికి తెలిపాడు. అందువల్ల సెవాగ్‌కు రెస్ట్ ఇచ్చారు. తాను గాయాన్ని దాచాలని అనుకోవడంలేదని సెవాగ్ ‘మిడ్ డే’ పత్రికతో చెప్పాడు. ‘నేను వెన్ను నొప్పితో బాధ పడుతున్నాను. కొంత విశ్రాంతి అవసరం. ఫిట్‌నెస్ విషయంలో నేనెప్పుడూ జట్టు మేనేజ్‌మెంట్‌ను తప్పుదోవ పట్టించలేదు. ఇది వరకు భుజానికి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా అప్పటి కోచ్ కిర్‌స్టెన్, కెప్టెన్ ధోనీని సంప్రదించాను’ అని సెవాగ్ పేర్కొన్నాడు. ఫిజియో నివేదికను ఆధారంగా చేసుకునే సెవాగ్‌కు విశ్రాంతినిచ్చారు. అయితే జట్టును ప్రకటించినప్పుడు సెవాగ్ ఫిట్‌నెస్ సమస్య గురించి శ్రీకాంత్ వివరించకపోవమే ఈ గందరగోళానికి కారణమయ్యింది. సెలెక్షన్ కమిటీ సమావేశానికి ముందే సచిన్.. తను ఆసియా కప్‌లో అడాలనుకుంటున్నానని టీం మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. జట్టులో స్థానం దక్కించుకోని సెవాగ్, జహీర్, ఉమేష్‌లకు విశ్రాంతినిస్తున్నట్లు మాత్రమే శ్రీకాంత్ చెప్పాడు. వారికి అయిన గాయాలేంటో అతడు తెలపలేదు. అయితే జహీర్‌కు చీలమండ గాయమైనందు వల్ల, ఉమేష్ సుదీర్ఘ సిరీస్ ఆడి అలసిపోయినందు వల్ల విశ్రాంతిని ఇచ్చారని తెలుస్తోంది.

జగన్ అరెస్టు విషయంలో రాజకీయాల్లో చర్చ..!

కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విషయంలో ఇక కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. జగన్‌కు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న జగన్ అరెస్టుకు కూడా రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.  జగన్ వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి శాసనసభ్యత్వానికి చేసిన రాజీమానామాను ఆమోదిస్తూ, జగన్ వర్గానికి చెందిన పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హులు శాసనసభ స్పీకర్ ప్రకటించనున్నారు. ఈ వారంలోనే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని తెలిసింది. బహుశా మూడు లేదా నాలుగో తేదీన స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని శాసనసభ సచివాలయ వర్గాలు తెలిపాయి. ఆరో తేదీ ప్రాంతంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. 3, 4 తేదీల్లో కాని పక్షంలో రాజ్యసభ ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాతనైనా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడవచ్చని భావిస్తున్నారు. ఇక అక్రమ ఆస్తుల వ్యవహారంలో జగన్ సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జగన్ ఆస్తుల వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్‌ను రెండు, మూడు రోజుల్లో సిబిఐ అరెస్టు చేయవచ్చని విశ్వసనీయంగా తెలిసింది. నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఇప్పటికే సిబిఐ అధికారులు విచారించారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టుకు నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు సంకేతంగా అభిప్రాయపడుతున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయిన వారం పది రోజుల్లో జగన్ అరెస్టు కూడా ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన తర్వాత ఆరు నెలల్లో ఆ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టయిన పక్షంలో ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఉండదని, అదే విధంగా జగన్ అరెస్టుతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కూడా నైతికంగా కొంత దెబ్బ తినవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. దీని ప్రభావం ఉప ఎన్నికలపై పడవచ్చని, కాంగ్రెస్ పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని అనుకుంటున్నారు. అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఏదో ఒక రోజు సిబిఐ తనను అరెస్టు చేయకతప్పదన్న అభిప్రాయంతో జగన్ కూడా ఉన్నారు. ఇందుకు మానసికంగా ఆయన సిద్ధంగానే ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశమైనపుడు సిబిఐ తనను అరెస్టు చేయవచ్చన్న అంశాన్ని ఆయనే స్వయంగా ప్రస్తావించారు. ‘సిబిఐ నన్ను అరెస్టు చేస్తే పార్టీని అమ్మ చూసుకుంటుంది’ అని జగన్ వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ నాయకులు తెలియజేశారు. జగన్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాల వల్ల రానున్న పదిహేను రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.ఈ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ‘ముఖ్యు’లకు కూడా అధిష్ఠానం చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగన్ విషయంలో కఠినంగా ఉండాలన్న నిర్ణయంలో భాగంగా ముందుగా ఆయనకు మద్దతు ఇస్తున్న నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి గతంలో లోక్‌సభ సభ్యత్వానికి చేసిన రాజీనామా లోక్‌సభ స్పీకర్ ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో జగన్‌కు మద్దతు ఇస్తున్న పదిహేడు మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకుంటోంది. ఈ వారంలోనే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి.