Saturday, 11 February 2012

పుత్తూరులో ధర్నా చేపట్టిన రోజా

చిత్తూరు జిల్లా పుత్తూరులో రోడ్డు నిర్వాసితుల పోరుబాటకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్ధతు పలికింది. నివాస ప్రాంతాలను బలవంతంగా ఖాళీ చేయించిన ప్రభుత్వం, వారికి పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తోందంటూ ఆందోళన చేపట్టింది.  ఈ ఆందోళన కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు.రైతులను పట్టించుకోనందుకు గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని ఇప్పుడు కాంగ్రెసుకు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులను పట్టించుకోకుంటే టిడిపికి పట్టిన గతే కాంగ్రెసుకు పడుతుందన్నారు. అధికార పార్టీని రైతులు తరిమి తరమి కొడతారని హెచ్చరించారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి తర్వాత రాష్ట్రంలో రైతులను పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి జగన్ రైతాంగ సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. పక్క రాష్ట్రంలో రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నారని కానీ రాష్ట్రంలో మాత్రం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రోజా బాధితులతో కలిసి శనివారం పుత్తూరు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో చెన్నై, రేణిగుంట జాతీయ రహదారిలో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు స్తంభించాయి. బాధితులకు న్యాయం జరిగే వరకూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని రోజా అన్నారు.

తిరుపతి ఆస్పత్రిలో సీఎం ఆకస్మిక తనిఖీలు

తమ సమస్యల పరిష్కారం కోసం జూనియర్ వైద్యలు అత్యవసర సేవలు నిలిపివేసిన నేపథ్యంలో తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉదయం ఆకస్మి తనిఖీలు నిర్వహించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయో రోగులను అడిగి తెలుసుకున్నారు.150 పడకలతో ఉన్న ఆస్పత్రిని 350 పడకల ఆస్పత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఓపీ బ్లాక్ ఏర్పాటు చేస్తామని, అనెస్తీషియా, డాక్టర్ల యూనిట్లు పెంచాతామన్నారు.ఈ ఏడాది డిసెంబర్ వరకు మహిళలకు పావలా వడ్డీ కోసం కొత్త కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రతి మండలాల్లోనూ స్త్రీలకోసం రూ. 25 లక్షతో శ్రీశక్తి భవన్‌ను నిర్మించనున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. దేశంలోనే 54 శాతంపైన ఉన్న 25 సంవత్సరాలోపు యువకులను అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నామని తెలిపారు. 2012 డిసెంబర్ నెలాఖరులోనూ లక్షా పదహారు వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన ప్రకటించారు. జిల్లాలో ఒక్కరోజు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి శనివారం శ్రీకాళహిస్తిలోని టూరిజం హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్దాలు చప్పడం మానలేదని, ప్రపంచ బ్యాంకుకు జీతగాడిగా పనిచేసిన చంద్రబాబును ప్రజలు నమ్మరని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. బాబు హయాంలో జిల్లాకు ఒక్క పరిశ్రమా రాలేదని, స్వలాభం కోసం మదర్ డెయిరీని మూయించారని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానని పేర్కొన్న జగన్, మాతృసంస్థను మోసం చేశారని కిరణ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. అధికార దాహంతో జగన్ పార్టీని వీడారని ధ్వజమెత్తారు. జగన్ వర్గం ఎమ్మెల్యేల విషయమై స్పీకర్ నాదెండ్ల మనోహర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అలాగే కడప జిల్లాకు చెందిన రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాలనేతలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో రోగులకు మూడు పూటలా ఉచిత భోజనం అందజేస్తామని సీఎం ప్రకటించారు. సీఎంతో మంత్రులు గల్లా అరుణకుమారి, రఘువీరా, ఎమ్మెల్యే చిరంజీవి, ఎంపీ చింతామోహన్ తదితరులు ఉన్నారు.

Friday, 10 February 2012

పేద విద్యార్థుల ఉజ్వల భవితకే ఉపకార వేతనాలు

పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకే ఉపకార వేతనాలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సాయంత్రం చిత్తూరు కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో వివిధ జూనియర్, డిగ్రీ, ఎంబిఎ, యూనివర్శిటీ ప్రిన్స్‌పాల్స్, కరస్పాండెంట్‌లతో మంత్రి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునేందుకు, ఆర్థికంగా చేయూతను అందించేందుకే పీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తున్నదని తెలిపారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతకు విద్యను అందించి దేశానికి ఉపయోగపడే విధంగా వారిని ప్రయోజకులుగా చేసే మంచి ఆశయంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమంలో కళాశాల ప్రిన్స్‌పాల్స్ సమన్వయంతో కలసి పనిచేయాలని కోరారు. స్కాలర్‌షిప్‌లను, రీయింబర్స్‌మెంట్‌ను శాశ్వతంగా కొనసాగించేందుకు కళాశాల ప్రిన్స్‌పాల్ వారి సలహాలను, సూచనలను అందించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి యాజమాన్యాలు ఎటువంటి అవకతవలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, సాంఘిక సంక్షేమశాఖ రేమాండ్ పీటర్ మాట్లాడుతూ విద్యార్థుల దరఖాస్తు లు వెంటనే పరిశీలించి ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. ఈసంవత్సరం 1,259కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, విచారణ ప్రక్రియ కళాశాల యాజమాన్యాల వారు మరింత వేగవంతం చేయాలన్నారు. కళాశాల యాజమాన్యాల వారు కళాశాలకు ఏప్రాంతంలో అనుమతి తీసుకుని వుంటే ఆప్రాంతంలోనే కళాశాలను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకొని అమలుచేస్తున్న కార్యక్రమానికి కళాశాలల ప్రిన్స్‌పాల్స్ సహకారం అందించాలన్నారు.

జర్నలిస్టు పాత్రలో...పవన్ కళ్యాణ్

గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన చేశాడు దర్శకుడు. తాజాగా శుక్రవారం తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా టైటిల్ ప్రకటించారు పూరి జగన్నాథ్. ఈ చిత్రానికి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే టైటిల్ ఖారారు చేసినట్లు వెల్లడించారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నాడు. మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.


గుండుతో ఉన్న చిత్రాన్ని తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్

అమెరికాలోని బోస్టన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో కీమో థెరపీ చికిత్స పోందుతున్న టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ తన తాజా చిత్రాన్ని మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సాధారణంగా కీమో థెరపీ చికిత్స పొందే ఎవరికైనా జుట్టు రాలిపోవడం సహాజం. యువరాజ్ గుండుతో ఉన్న చిత్రాన్ని తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేసి.. దాని క్రింద 'మొత్తానికి జుట్టు రాలిపోయింది.... కానీ యువీ స్ట్రాంగ్' గా ఉన్నాడంటూ కామెంట్ రాశాడు. ట్రీట్‌మెంట్ మొదట్లో, నేను కోపంతో పాటు కొంత గందరగోళ పరిస్దితిలో ఉన్నాను. నేను నా జీవితంలో విభిన్నంగా కొన్ని పనులు చేసి ఉన్నానని ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు తెలియగానే.. ఆ షాక్ నుండి తేరుకోవడానికి నాకు కౌన్సిలర్ చేసిన సహాయం మరువలేదని అన్నారు. ప్రస్తుతం నేను ఓ ఫైటర్‌ని. గతంలో మాదిరి కాకుండా నేను ఇంకా బలవంతుడి మాదిరి తిరిగి వస్తానని యువరాజ్ తెలిపాడు.అంతక ముందు యువరాజ్ తన బీజ కణ క్యాన్సర్‌తో బాధపడుతూ అమెరికాలో చికిత్స చేసుకుంటున్న యువరాజ్ మొదటి సారి ఓ ప్రముఖ ఛానల్‌తో ఫోన్‌లో ఛాట్ చేస్తూ "నాకే ఎందుకు ఇంత ఇబ్బంది కోలవేరి డి?" అని అన్నారు. అమెరికాలో ఉన్న బోస్టన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో డాక్టర్లు నా ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని అన్నాడు. డాక్టర్లు ఇచ్చే మెడిషన్‌కు బాగానే రెస్పాండ్ అవుతున్నానని అంటున్నారు. దేవుడి దయవల్ల నేను తొందరలోనే మీ ముందుకి వస్తానని తెలిపాడు.


బాలకృష్ణ హీరోగా ‘శ్రీమన్నారాయణ’

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘శ్రీమన్నారాయణ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. ఇప్పటికే పార్వతి మెల్టన్, ఇషా చావ్లాలను మీరోయిన్లుగా ఎంపిక చేశారు. మాస్ మసాలా ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య ‘సింహా’ సినిమాలో మాదిరిగా లెక్చరర్ పాత్ర పోషిస్తున్నారని, అభిమానులు మెచ్చే పూర్తి వినోదాత్మక యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్లుతో గ్లామర్ డోస్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందట. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. ఆయన నన్ను ఓ తండ్రిలా ప్రోత్సహించారు అంటున్నారు దర్శకులు పరుచూరి మురళి. ఆయన తాజా చిత్రం 'అధినాయకుడు'టైటిల్ ప్రకటన సందర్భంగా ఆయన ఇలా స్పందించారు. అలాగే ..కథ వినగానే బాలకృష్ణ ఈ సినిమా చేయడానికి ఒకే అన్నారు.ఈ సినిమాలోని మూడు క్యారెక్టర్స్‌ని ఎంతో కష్టపడి డీల్ చేశాం. బాలయ్య చాలా అద్భుతంగా నటించారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మాణానికి సహాయం అందించారు అన్నారు. బాలకృష్ణ, లక్ష్మీరాయ్ జంటగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న 'అధినాయకుడు' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంతో జరుగుతోంది.

యువతరం రాజకీయాల్లోకి రావాలి...చంద్రబాబు

యువతరం రాజకీయాల్లోకి రావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. యువ తరంగం సదస్సులో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మాఫియా పాలన రాజ్యమేలుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని పెంచి పోషిస్తోందన్నారు. మద్యం సిండికేట్లలో మంత్రి అవినీతికి పాల్పడ్డారని, ఆమంత్రిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.తిరుపతి లోని పార్టీలో గ్రూపులున్నా.. సదస్సును విజయవంతం చేసేదిశగా యువతను సమీకరించడంలో తలమునకలయ్యా రు. టీడీపీ అధినేత చంద్రబాబు యువతకు పెద్దపీట వేస్తామ న్న ప్రకటనతో విశ్వవిద్యాలయాల విద్యార్థుల్లోనూ కదలిక వచ్చిందని పార్టీ శ్రేణులు సంబర పడుతున్నాయి. ఈ సదస్సు తో అటు పార్టీకి,ఇటు యువతలో రాజకీయ చైతన్యానికి నాంది పలకటం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.