Saturday, 21 January 2012

తాజా టెస్ట్‌ ర్యాంకింగ్‌లలో టాప్‌ టెన్‌లో ఇండియన్స్‌ ఇద్దరే



అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసిసి) విడుదల చేసిన తాజా టెస్ట్‌ ర్యాంకింగ్‌లలో బ్యాటింగ్‌ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుండగా బౌల ర్లలో జహీర్‌ ఖాన్‌ ఒక స్థానం పతనమై తొమ్మిదవ స్థానంలో నిలి చాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ జాబితాలలో టాప్‌ టెస్‌లో ఉన్న భారతీయులు వారిద్దరే. నంబర్‌ వన్‌ ఇంగ్లండ్‌పై మొదటి టెస్ట్‌ లో పాకిస్తాన్‌కు పది వికెట్లతో విజయాన్ని దక్కించిన తరు వాత ఆఫ్‌ స్పిన్నర్‌ సరుూద్‌ అజ్మల్‌ ప్రపంచంలో అత్యున్నత ర్యాంకులో ఉన్న స్పిన్నర్‌ అయ్యాడు. ఈ టెస్ట్‌ దుబాయిలో మూడు రోజులలో ముగిసింది. 34 ఏళ్ల ఫైసలాబాద్‌ వాసి అజ్మల్‌ 55 పరుగులకు 7 వికెట్లు, 42 పరుగులకు 3 వికెట్ల తో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును గెలుచుకోవడమే కాకుం డా నంబర్‌ 3 ర్యాంకును కూడా సాధించాడు. పాకిస్తాన్‌ తరఫున తన 18వ టెస్ట్‌లో రెండవ సారి పది వికెట్లు తీసుకు న్న సరుూద్‌ అజ్మల్‌ ఏకంగా తొమ్మిది స్థానాలు పురోగమించా డని, అతను ఇంగ్లండ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ను మూడు నుంచి నాలుగవ స్థానానికి నెట్టాడని ఐసిసి ఒక ప్రకటనలో తెలియజేసింది. దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టీన్‌ మొదటి స్థానంలో కొనసాగుతుండగా ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్స న్‌ రెండవ స్థానంలో ఉన్నాడు. దుబాయిలో ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్‌లో 89 పరుగులకు నాలుగు వికెట్లు తీసుకున్న మరొక పాక్‌ స్పిన్నర్‌ అబ్దుర్‌ రెహ్మాన్‌ ఐదు స్థానాలు పురోగ మించి 14వ స్థానంలో నిలిచాడు. టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ల ర్యాం కింగ్‌లలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌లకు శుభవార్త ఏమీ లేదు. ఇంతకు ముందు వరుసగా 3,4 స్థానాలలో ఉన్న అలస్టెయిర్‌ కుక్‌, ఇయాన్‌ బెల్‌ వరుసగా రెండు, మూడు స్థానాలు పతన మయ్యారు. కెవిన్‌ పీటర్సన్‌ టాప్‌ 10లో స్థానం కోల్పోయాడు. అతను ఆరు స్థానాలు పతనమై 16వ స్థానంలో నిలిచాడు. ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌ కూడా ఆరు స్థానాలు పతనమై 34వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌లలో వికెట్‌కీపర్‌ మాట్‌ ప్రయర్‌, స్వాన్‌ మాత్రమే పురోగమించారు. ప్రయర్‌ ఒక స్థానం ముందుకు జరిగి 18వ స్థానంలోను, స్వాన్‌ 11 స్థానాలు పురోగమించి 64వ స్థానంలోను నిలిచారు. పాక్‌ బ్యాట్స్‌మ న్‌లలో యూనిస్‌ ఖాన్‌ నాలుగవ స్థానానికి, కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హక్‌ 14వ స్థానానికి, మహమ్మద్‌ హఫీజ 30వ స్థానానికి పురోగ మించారు. బ్యాట్స్‌మన్‌ల జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార్‌ సంగక్కార మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాక్విస్‌ కలిస్‌ రెండవ స్థానంలోను, ఎబి డివిలీర్స్‌ మూడవ స్థానంలోను ఉన్నారు.

ఎల్లప్పుడు మా కుటుంబం కార్యకర్తల కోసం..భూమా

కార్యకర్తల కోసం మా కుటుంబం ఎల్లప్పుడు పాటు పడుతుంటూనే ఉంటుందని భూమా దంపతులు అన్నారు.  పట్టణంలోని భూమా స్వగృహంలో శిరివెళ్ళ మండలం నుండి భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు భూమా దంపతులకు మద్దతు తెలిపేందుకు ఆళ్లగడ్డ పట్టణానికి వచ్చి వారిని కలిశారు. ఈ సందర్భంగా భూమా దంపతులు మాట్లాడుతూ ఈ రోజు మామీద అభిమానంతో ఇంత మంది ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీరు చూపించే ఆదరాభిమానాలు చాలా గొప్పవని అన్నారు. నా పుట్టిన రోజు సందర్భంగా శిరివెళ్ళలో మీరు చూపించిన ప్రేమ నేను మరచి పోనని భూమా అన్నారు. పార్టీ అభివృద్ధిపై మీరు బాధ్యత తీసుకోవాలన్నారు. పదవి ఉన్న, లేకపోయిన ప్రజలకు అండగా ఉంటామని వారు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో వైఎస్సార్ పార్టీకి సంఘీభావంగా ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నారు. అందుకు మీకు అండగా ఉంటామని ముస్లిం సోదరులకు భూమా దంపతులు హామీనిచ్చారు. ఓట్లు మఖ్యం కాదని ప్రజల ఆదరాభిమానాలు ముఖ్యమని వారి అండే మాకు కొండంత అండని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శిరివెళ్ళ మండలానికి చెందిన ఖాజాహుస్సేన్, అబ్దులుఖదుర్సు, చాంద్‌భీ, సలాం, నబీరసూల్‌తో పాటు మరో 200 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో వై ఎస్సార్సీ నాయకులు బివి.రామిరెడ్డి, భూమా వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 విగ్రహాలపై చెయ్యేస్తే రాజకీయ సమాధి
 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల మీద చేయి పెడితే రాష్ట్ర ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజకీయ సమాధి కడతారని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. ఈ రోజు ఇక్కడ జరిగిన వార్డుబాట కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని ఆరోపించారు. ఎన్‌టీఆర్ చనిపోయి 16 సంవత్సరాలు కావస్తున్నా తన సొంత ఊరు నారావారిపల్లెలో ఆయన విగ్రహం పెట్టించాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు రాలేదన్నారు. అన్న తీరు నచ్చక ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడు ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయించారన్నారు. ప్రజల గుండెల్లో దేవుడిలా కొలువైన వైఎస్ రాజశేఖరరెడ్డిని వారి గుండెల నుంచి చెరిపేసేందుకు చంద్రబాబు నానా రకాల పాట్లు పడుతున్నారని విమర్శించారు.

జెసి బ్రదర్స్ రాజకీయడ్రామా

రాయదుర్గం నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జిగా గుణపాటి దీపక్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించడంతో జిల్లా లో జెసి బ్రదర్స్ ఆడుతున్న రాజకీయడ్రామా బహిర్గతమయ్యిందని డిసిసి అధ్యక్షులు పాటిల్ వేణుగోపాలరెడ్డి అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో  ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పాటిల్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లా లో గత సంవత్సరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తాను ఓడిపోడానికి ము ఖ్యంగా జెసిబ్రదర్స్ కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. ఎన్నికలకు మూడురోజుల ముందు టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో జెసి బ్రదర్స్ కుదుర్చుకున్న ఒప్పందం మేరకే జెసి ప్రభాకరరెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డిని ఈరోజు నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమిస్తూ ప్రాధాన్యతను ఇచ్చారని వివరించారు. తనను ఓడించాలన్న ధ్యే యంతోనే ఇలాంటి రాజకీయకుట్రను నాటకీయంగా నడిపిన జెసి బ్రదర్స్‌పై ఎన్నికల సమయంలోనే వదంతులు వచ్చాయని ఆ వదంతులు నేడు నిజం అయ్యాయని తెలిపారు. ఈ నియోజకవర్గంలో దీపక్‌రెడ్డితో రాజకీయ అరంగేట్రమ్ చేయించాలన్న కుట్రపూరిత రాజకీయ పన్నాగమే నేడు బహిర్గతమయ్యిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోవుంటూ అనేక పదవులను అనుభవించిన జెసి దివాకరరెడ్డి పార్టీకి ద్రోహంచేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగావున్న తనను ఓడించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి రాజకీయ డ్రామాలు ఆడుతున్న జెసి దివాకరరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంపై తాను తీవ్రంగా మనస్థాపం చెందానని ఇలాంటివి భవిష్యత్తులో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులకు జరుగరాదని అన్నారు. ఈ విషయంలో అప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని కాని అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సివుందని పాటిల్ వేణుగోపాలరెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ భారీ ఏర్పాట్లు


ఈనెల 30న తిరుమలలో నిర్వహించే రథసప్తమి వేడుకలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఆ రోజున భక్తులందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యాన్న ప్రసాదం అందజేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి కూరగాయలు అందించడానికి దాతలు ముందుకొచ్చారు. నిత్యాన్న ప్రసాద సముదాయంతో పాటు తిరుమలలోని యాత్రిక వసతి సముదాయాల్లోనూ భక్తులకు అన్నప్రసాదాలు పంచి పెట్టాలని నిర్ణయించారు. తిరు వీధుల్లో ఉదయం నుంచి రాత్రి వాహన సేవ ముగిసేంత వరకు తాగునీరు, మజ్జిగ తదితరాలను అందించనున్నారు.సూర్యజయంతిగా పిలిచే రథసప్తమి రోజున స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. దీనికోసం ఆ వాహనాలను టీటీడీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సుకు ఆలయానికి అనుసంధానంగా ఉన్న కదిలే వంతెనలో లోపాలు సరి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

Friday, 20 January 2012

అనంత రైతు ప్రత్యామ్నాయం ఏంటి...?

‘సబ్సిడీలు ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని అడగంలేదు. ఉచిత పథకాలు కూడా అవసరం లేదు. మాకు కావాల్సింది సాగునీరు మాత్రమే ’ - కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామ రైతుల నివేదన
 ‘జిల్లా వాతావరణానికి అనువైన వంగడాలు రూపొందించాలి. సాగునీటి లభ్యత పెంచి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా చూడాలి ’- కంబదూరు మండలం ములకనూరు గ్రామ రైతుల వినతి
‘‘ప్రత్యామ్నాయ పంటలు పండించమని సలహాలు ఇస్తున్నారేగాని పండిన తర్వాత ఆ పంట ఉత్పత్తులు ఎక్కడ విక్రయించుకోవాలో ఎవరూ చెప్పడం లేదు. ధర లేకపోతే పంటలు పండించి ప్రయోజనం ఏమిటి’ 
- గాండ్లపెంట మండలం కమతంపల్లి గ్రామ రైతుల ఆవేదన. 
ఇవి అనంతపురం రైతులు పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి మొర పెట్టుకొన్న సమస్యలు.. జిల్లాలోని వ్యవసాయరంగ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్న కేంద్ర అత్యున్నత సాంకేతిక కమిటీ రెండో రోజు గురువారం పది మండలాల్లో పర్యటించింది. కంబదూరు మండలం ములకనూరు గ్రామంలోని పంట పొలాలను ఏకే సింగ్ పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తించినట్లు చెప్పారు.  పూర్తి వర్షాధారంతో వ్యవసాయం చేస్తున్న రైతులకు సామూహిక(సమష్టి) సాగు విధానం మేలు చేకూర్చుతుందని కేంద్ర బృందం చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధన కౌన్సిల్ డిప్యూటీ డెరైక్టర్ ఏకే సింగ్ అభిప్రాయపడ్డారు. నిపుణుల సలహాలు ఇలా ఉన్నప్పటికీ అనంత రైతులకు అవసరం అయినవి ఎన్నో చేయాల్సి ఉంది. 
చీడపీడల నుంచి పంటలను సంరక్షించుకోవడానికి తక్షణ సలహాలు, సూచనలు ఇచ్చే నిపుణులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి... పండించిన పంటను స్థానికంగానే గిట్టుబాటు ధరకు విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది...  ప్రధానంగా నీటిలభ్యత తక్కువుగా ఉన్నందున స్పింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలి... నాణ్యమైన విత్తనాల కొరతను ఎదుర్కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు..వారికి మేలురకం విత్తనాలు అందచేయాలి... రైతులు కూడా  ఉద్యాన పంటలతోపాటు పశుపోషణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది..... పంటల సాగుకు నీటి లభ్యతలేని ప్రాంతాల్లో పాడిని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది 

రైతులు కూడా కేంద్ర పర్యటక బృందానకి కొన్ని ఫిర్యాదులు చేశారు..స్థానికంగా వ్యవసాయాధికారులు తమకు అందుబాటులో ఉండరన్నారు.. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. భూమిలోని తేమతోపాటు వాతావరణంలోని తేమను గ్రహించే వంగడాలతోపాటు సాగునీరు అందచేయాలని కోరారు. కర్ణాటకలో లీటరు పాలకు నాలుగు రూపాయలు అదనంగా ఇస్తున్నారని, ఆ ధరను ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉందని రైతులు విన్నవించారు.  పలువురు రైతులు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే ఆ పంటలు ఎక్కడ విక్రయించుకోవాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. డ్రిప్, స్పింక్లర్లకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా సబ్సిడీ విధానం అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా కేంద్ర కమిటీ కూడా స్థానిక అదికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖల 
తీరుపై సరిగా లేదని  కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతులకు సలహాలు,సూచనలు అందజేయాల్సిన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖ అధికారుల పనితీరు సక్రమంగా లేదని కమిటీ అభిప్రాయపడింది. మూడు బృందాల సభ్యులకు ఆయా శాఖల అధికారుల వైఖరిపై పలు ఫిర్యాదు అందాయి. క్షేత్ర స్థాయిలో కూడా కమిటీ సభ్యులకు ఎదురైన అనుభవాలతో ఆయా శాఖల అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో విఫలమవుతున్నారని గుర్తించినట్లు కమిటీలోని ఒక శాస్త్రవేత్త తెలిపారు. కాగా డాగర్ నేతృత్వంలోని బృందం గురువారం సాయంత్రం పుట్టపర్తిలో బాబా సమాధిని సందర్శించింది.

పశుగ్రాసం పెంపకంలోకడప జిల్లాకు రెండోస్థానం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశుగ్రాసం పెంపకంలో కడప జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిందని పశు సంవర్ధక శాఖ జేడీ విజయ్‌కుమార్ అన్నారు. స్థానికంగా పశువైద్యశాలను  ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కరువును దృష్టిలో ఉంచుకొని చెరువులలోని మిగులు నీటితో పశుగ్రాసం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 40 చెరువులను గుర్తించామన్నారు. కరువు తీవ్రత దృష్ట్యా పశుగ్రాసం నిల్వ చేసేందుకు దృష్టి సారిస్తున్నామన్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒకటి చొప్పున 50 పాతర గుంతలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో మొక్క జొన్న, జొన్న పైరును కటింగ్‌చేసి పాతర గుంతలలో వేసి వాటిపై బెల్లం పానకం చల్లితే మూడు నెలలపాటు నిల్వ చేసుకోవచ్చన్నారు. అలాగే జిల్లాకు 404 మినీ డెయిరీలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటివరకు 10మినీ డెయిరీలు ఏర్పాటు చేశామన్నారు. పాడి పశువుల పెంపకానికి జిల్లాకు రూ..85లక్షలు మంజూరయ్యాయని, ఇందులో రూ..65లక్షలతో పాడి పశువులను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించామని చెప్పారు. అలాగే జిల్లాకు 91 గొర్రెల పెంపకం యూనిట్లు మంజూరయ్యాయని, ఇందుకు రూ..12లక్షల సబ్సిడీ విడుదలైందన్నారు. దీని ద్వారా 50శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు గొర్రెలను ఇస్తున్నామన్నారు. అంతేకాక జిల్లాకు కోళ్ల పెంపకానికి రూ..40లక్షలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటివరకు 1800మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 6కోడి పిల్లల పెంపకం కేంద్రాలను కడప 2, పులివెందుల, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు ప్రాంతాలలో ఒక్కొక్కటి చొప్పున నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో లబ్ధిదారునికి ఉచితంగా 45కోళ్లను అందిస్తామన్నారు. అలాగే ఆర్‌కేయూవై పథకం కింద జిల్లాకు 220 గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ..28వేలు ఇస్తున్నామని, ఇందులో రూ..14వేలు సబ్సిడీ వర్తిస్తుందన్నారు. ఇప్పటివరకు 110 యూనిట్లను లబ్ధిదారులకు ఇచ్చామని వివరించారు. అనంతరం ఆయన పశువైద్యశాలలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏడీ ప్రసాదరావు పాల్గొన్నారు.

బాలకృష్ణ గెలుస్తాడు...జెసి


హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుండి పోటీ చేస్తే గెలుపొందటం ఖాయమని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లాలో మాత్రం బాలయ్య ప్రభావం ఉండదన్నారు. కాగా జిల్లాలో మరోసారి కాంగ్రెసు పార్టీలో వర్గ పోరు బహిర్గతమైంది. జిల్లా కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు పాటిల్ వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డిపై విరుచుకు పడగా, జెసి ప్రభాకర్ రెడ్డి పాటిల్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో జెసి దివాకర్ రెడ్డి తనను కావాలనే ఓడించారని పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. టిడిపి అభ్యర్థిని గెలిపించినందుకు ప్రతిఫలంగా జెసి అల్లుడికి ఆ పార్టీ అధిష్టానం రాయదుర్గం ఇంచార్జ్ పదవి కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. తనను ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించిన జెసిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పాటిల్ వ్యాఖ్యలపై జెసి సోదరుడు ప్రభాకర్ రెడ్డి స్పందించారు.ఎవరు ఏ పార్టీలోనైనా ఉండవచ్చునని ఎదురుదాడికి దిగారు. తమ బంధువు టిడిపి పార్టీలో ఉంటే తమకేం సంబంధమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఓటమికి స్థానిక మంత్రుల అసమర్థతే కారణమన్నారు. గెలిస్తే మీ గొప్పతనం ఓడిపోతే మా వైఫల్యమా అని ప్రశ్నించారు. రాయదుర్గం ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పాటిల్ ఓడిపోతారన్నారు. కాగా గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ ఓడిపోయిన విషయం తెలిసిందే