Friday, 13 January 2012

బిజినెస్ మ్యాన్ సినిమా రివ్యూ

మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రెండువేల థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రం ఇనీషియల్ గా అందిన టాక్ ప్రకారం...హిట్ అని తెలుస్తోంది. అయితే దూకుడు రేంజా,పోకిరీ రేంజా అనేది తేలాలి అంటున్నారు. పస్టాఫ్ ఫన్ తో గడిచిపోయినా,సెకండాఫ్ మొత్తం గన్స్ ,పోలీసులు,ప్రేమతో నడుస్తుంది. దాంతో కొద్దిగా స్లో అయ్యినా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకు హైలెట్ అని చెప్తున్నారు.సూర్య(మహేష్ బాబు) తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ అవుతారు. అక్కడ సంపాదించిన డబ్బుతో ఇండియాలో ఏదైనా వ్యాపారం చేద్దామని వస్తారు. అప్పటికి మహేష్ ది చిన్న వయసు. జయదేవ్(ప్రకాష్ రాజ్) వీరిని మోసం చేసి డబ్బు గుంజుకుని సూర్య తల్లిదండ్రులను చంపేస్తాడు. సూర్య ఈ చిన్న వయసులో తల్లిదండ్రులను చంపిన వారిపై హత్యాయత్నం చేయబోయి బోస్టన్ స్కూల్ లో చేరుతాడు. ఈ క్రమంలో ఇక్కడి మనుషుల మీద, ఈ దేశం మీద కసి పెంచుకుంటాడు. అప్పటికి ముంబైలో డాన్ ఎవరూ ఉండరు. తనే డాన్ గా ఎదగాలనుకుంటాడు. తన స్నేహితుడు బ్రహ్మాజీతో కలిసి లోకల్ గా చిన్న గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుంటాడు. మంచి చెడు తేడా లేకుండా సెటిల్ మెంట్లు చేస్తూ భాయ్ గా ఎదుగుతుంటాడు. ఈక్రమంలోనే ప్రతిపక్ష పార్టీ లాలూ(షయాజీ షిండే)కి పొలిటికల్ సపోర్టు ఇచ్చి మేయర్ గా గెలిపిస్తాడు. రూలింగ్ పార్టీలో ఉన్న జయదేవ్(ప్రకష్ రాజ్)కి కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. పోలీస్ కమీషనర్ కూతురు చిత్ర(కాజల్)ను ట్రాప్ చేసి ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు. తనకు ఉపయోగ పడుతుందనే ఉద్దేశ్యంతోనే మొదలు పెట్టి నిజంగానే ప్రేమిస్తాడు. దేశం మొత్తం సూర్య భాయ్ నెట్కవర్క్ విస్తరిస్తుంది. ప్రధాన మంత్రిని శాసించే స్థాయికి ఎదుగుతాడు. మరి సినిమా క్లైమాక్స్ ఏమిటి అనేది తెరపై చూడాల్సిందే. ఇక ఈ చిత్రం కథ ముంబై కి డాన్ అవుదామనే సూర్య అనే కుర్రాడి కథ. అతనికో సాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. పక్కా రివేంజ్ తో నడిచే స్టైలిష్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.అలాగే ఈ కథ గొప్పగా లేక పోయినా హీరో క్యారెక్టైరేజన్ హైలెట్ గా తీర్చిదిద్దటం ప్లస్ అయ్యిందని,అదే టాక్ పాజిటివ్ గా రావటానికి కారణమంటున్నారు. ఇక కాజల్ కూడా ఇంతకుముందు లేని విధంగా ఈ సినిమాలో గ్లామర్ తో కుర్రకారుకి వెర్రిక్కించిందని అంటున్నారు. ఇక మహేష్ చెప్పే పంచ్ డైలాగ్స్ కు ధియోటర్స్ లో విజిల్స్ మ్రోగుతున్నాయి. అయితే పూరీ టేకింగ్ కొత్తగా ఏమి లేదని,మహేష్ గ్లామర్ సినిమాని నిలబెడుతుందని,సంక్రాతి విజేతగా చిత్రం నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.సినిమాలో సీన్ టు సీన్ మహేష్ బాబే కనిపిస్తాడు. డైలాగ్స్ అదిరి పోయాయి. సినిమా విజయ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. కాజల్ పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదు. ప్రకాష్ రాజ్, షయాజీ షిండే, నాజర్ తదితరులు తమ తమ పాత్రల మేరకు బాగా నటించారు

Sunday, 8 January 2012

108 వాహనాల నిర్వహణ రవాణా శాఖ పరిధిలోకి

అత్యవసర వైద్య సేవల కోసం వినియోగిస్తున్న 108 వాహనాల నిర్వహణను ఆర్టీసీకి అప్పగించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ యోచిస్తున్నట్టు సమాచారం. 108ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోకపోవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని భావిస్తున్న సత్తిబాబు 108ని రవాణా శాఖ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సగానికిపైగా 108 వాహనాలు షెడ్‌లకే పరిమితం కావడం పట్ల సత్తిబాబు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో 108 వాహనాల బాధ్యతను ఆర్టీసీకి అప్పగిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

విభేదాలున్నా సర్దుకుంటా...టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు

ప్రోటోకాల్ వీఐపీ దర్శనంలో మూడు కేటగిరిల విధానం రద్దు చేయనున్నట్టు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. వచ్చే పాలకమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎమ్మెల్యేలకు కలిగిన అసౌకర్యానికి ఆయన క్షమాపణ కోరారు. రెండో బ్రహ్మోత్సవాల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈవో, జేవోలతో విభేదాలు లేవని, ఒకవేళ ఉన్నా తానే సర్దుకుంటానన్నారు. అన్నదానంలో కల్తీ బియ్యాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో టెండర్ మారుస్తామని బాపిరాజు తెలిపారు.

మహేష్ బాబు-కాజల్ మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్లపై. ..నమ్రత ఓకే!

మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ సినిమా మరో వారంలో విడుదలవుతుందనే తరుణంలో సినిమాలో మహేష్ బాబు-కాజల్ మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్ ఉందనే వార్తలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మహేష్ బాబు ఇదివరకెన్నడూ ఏ హీరోయిన్ తో కూడా లిప్ లాక్ సీన్లలో నటించలేదు కాబట్టి తమ అభిమాన హీరో తెరపై ముద్దు సరసం పండిస్తుంటే చూడాలని ఆశ పడుతున్నారు అభిమానులు. మరి ముద్దు సీన్ వార్త నిజమా? కాదా?అనే సందేహంలో ఉన్న అభిమానులకు దర్శకుడు పూరి జగన్నాధ్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ...సినిమాలో మహష్ బాబు-కాజల్ మధ్య ముద్దు సీన్ ఉందని కన్ ఫర్మ్ చేశారు. మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్ అనుమతి మేరకే ముద్దు సీన్ కు ఓకే చేశాడని, సినిమాకు ఎంతో కీలకంగా ఉండే ఆ సీన్ పై ఆమె ఎలాంటి అభ్యంతరం తెలుపకుండా ఓకే చెప్పిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

బిజినెస్‌మేన్ సినిమాలో మహేష్‌ది కంత్రీ క్యారెక్టర్

మహేష్‌ది కంత్రీ క్యారెక్టర్. అతను ఏంచెబుతున్నాడో, ఎందుకు చెబుతున్నాడో అర్థంకాదు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు అని పూరీ జగన్నాధ్ చెప్పుకొచ్చారు. ఆయన తన తాజా చిత్రం ‘బిజినెస్‌మేన్’త్వరలో విడుదల కానున్న సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి ఇలా స్పందించారు. అలాగే... మహేష్‌ని తప్ప సినిమాలో మరెవరినీ చూడలేం. వినోదం కూడా అతని క్యారక్టర్‌ ద్వారానే ఉంటుంది. బ్రహ్మానందం, అలీ వంటి కమేడియన్స్‌ లేరు. పోకిరితో పోలిస్తే మహేష్‌ పర్‌ఫార్మెన్స్‌ పెరిగింది. వాయిస్‌లో కూడా మార్పు కనిపించింది అని పూరి పేర్కొన్నారు. భాయ్ కావాలనుకున్నోడి కథ ఇది. ‘పోకిరి’ చిత్రానికి ఈ చిత్రానికి మహేష్‌లో చాలా మార్పు వచ్చింది. ఇందులో కొత్త మహేష్ కనిపిస్తాడు. ఆ చిత్రం తర్వాత మా ఇద్దరి కాంబినేషన్‌లో చిత్రం అంటే అంచనాలుంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఈ చిత్రం వుంటుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో.. ‘పోకిరి’ తరహా డైలాగ్‌లు మాత్రం వుండవు. ఈ చిత్రంతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేయనున్నాం. థియేటర్లు సర్దుబాటు కానందున తమిళ, మళయాల భాషల్లో ఈ చిత్రాన్ని 15 రోజులు ఆలస్యంగా విడుదల చేస్తున్నాం’ అన్నారు. బిజినెస్ గురించి మాట్లాడుతూ..‘మూడున్నర నెలల్లో ‘బిజినెస్‌మేన్’ పూర్తి చేశాం. మొత్తం 74 రోజులు షూటింగ్ చేస్తే మహేష్ 65రోజులు వర్క్ చేశాడు. ముందు ఈ చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయాలనుకున్నాం. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 13న విడుదల చేస్తున్నాం’ అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్.ఇది ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రం 16 వందల థియేటర్లలో విడుదలవుతోంది. ఈ రోజు నుంచే అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో ఏ చిత్ర విడుదల కాలేదు. ఈ చిత్ర ఆడియోకు అన్ని చోట్లా మంచి స్పందన లభిస్తోంది. సార్ వస్తారా పాట విశేషంగా అలరిస్తోంది. ఈ చిత్రానికి మహేష్ స్పెషల్ ఎట్రాక్షన్.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్‌పై ఫైర్ ...మంత్రి టిజి వెంకటేష్

చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఆదివారం మరోసారి ధ్వజమెత్తారు. కెసిఆర్ వెనుక ఉద్యమకారులు లేరని గూండాలు మాత్రమే ఉన్నారని అన్నారు. నిత్యం ప్రజలను రెచ్చగొట్టే విధానంతో కెసిఆర్ ముందుకెళుతున్నారన్నారు. గుడ్లు, రాళ్లు విసిరినంత మాత్రాన తెలంగాణ రాదన్నారు. ఉద్యమాల పేరుతో అరాచకాలు చేస్తున్న వారి కోసం కొత్త జైళ్లు వస్తున్నాయన్నారు. సంఘ విద్రోహశక్తులకు, ఉద్యమకారులకు ప్రత్యేక జైళ్లు అవసరమన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణవాదుల దాడి అవివేకం అన్నారు. బాబు తన హయాంలో తెలంగాణకు అధిక ప్రాధాన్యతమిచ్చి, రాయలసీమకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం నీరుగారిందని, కెసిఆర్ ఉచ్చులో యువత పడవద్దని సూచించారు.లక్ష ఉద్యోగాల ప్రణాళికను అడ్డుకున్న వారు చరిత్రహీనులవుతారని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ముగ్గురు శాసనమండలి సభ్యులపై వేటు పడుతుందని చెప్పారు. కాగా ఆంధ్ర ప్రదేశ్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడిగా టిజి వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గుంతకల్లులోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు చేసి, ఆర్యవైశ్య పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశారు.

వెంకన్న సొమ్ముతో ప్రైవేట్ బ్యాంక్‌ల వ్యాపారం

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను విక్రయించే ఓ ప్రైవేటు బ్యాంక్ టిక్కెట్ల విక్రయంతో వచ్చిన సోమ్మును సొంత ఖాతాలో వేసుకుని తన వ్యాపారానికి (రొటేషన్) వినియోగించుకుంటున్న వైనం ఇటవల ఎల్‌ఎఫ్ ఆడిట్‌లో వెలుగు చూసింది. దీంతో టిటిడి యాజమాన్యం బ్యాంక్ అధికారులను పిలిచి ప్రశ్నించింది. తమను నిలదీస్తే టిక్కెట్ల విక్రయాలు తాము చేయలేమని, ఆ బాధ్యతల నుండి తప్పుకుంటామని బ్యాంకు అధికారులు బెదిరింపు ధోరణిలో చెప్పటంతో టిటిడి అవాక్కయింది. ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయాల గత రెండు దశాబ్దాలుకు పైగా ఓ ప్రైవేటు బ్యాంకుకు అప్పగించిన విషయం విదితమే. అయితే ఈ టిక్కెట్ల విక్రయానికి బ్యాంకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, వారి జీతబత్యాల చెల్లింపు, ఇతర వౌలిక సదుపాయాల కల్పనకు ఏటా కొన్ని లక్షల రూపాయల ఆర్థిక భారాన్ని భరిస్తోంది. ఈ నేపథ్యంలో 2009-10 సంవత్సరంలో ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయం ద్వారా 54 కోట్ల రూపాయలు టిటిడి ఖాతాలో జమ చేయాల్సి ఉంది. అయితే ఆ ప్రైవేటు బ్యాంకు కేవలం 52 కోట్ల రూపాయలను మాత్రమే జమ చేసి మిగిలిన రెండు కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాలోనే ఉంచుకున్నట్లు ఎల్‌ఎఫ్ ఆడిట్‌లో వెలుగు చూసింది. తద్వారా 2 కోట్ల రూపాయలపై వెంకన్నకు రావలసిన వడ్డీ డబ్బులు సదరు బ్యాంకు ఖాతాలోకే చేరుతున్నాయి. ఇది పలు విమర్శలకు దారి తీస్తోంది. ఓ వైపు కోట్ల రూపాయల టిటిడి సోమ్మును తమ ఖాతాలో వేసుకుని, తిరిగి తాము భక్తులకు, టిటిడికి సేవ చేస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఓ వైపు వ్యాపార దృక్పథంతో తిరుమలలో బ్యాంకును ఏర్పాటు చేసుకుని, మరో వైపు సేవగా చెప్పుకోవడాన్ని ఉద్యోగ సంఘాలు ఖండిస్తున్నాయి. ఇదిలా వుండగా ఈ విషయంపై టిటిడి అధికారులను ప్రశ్నించినప్పుడు తాము గట్టిగా ఒత్తిడి చేస్తే, వారు టిక్కెట్ల విక్రయ సేవలు నిలిపివేస్తామంటూ హెచ్చరిస్తున్నారని వాపోయారు. అలా నిలిపి వేస్తే తిరిగి మరో బ్యాంక్ టిక్కెట్ల విక్రయానికి ఆసక్తి చూపుతుందా.. అనే అనుమానాలు కూడా టిటిడిలో వ్యక్తమవుతున్నాయి. అవసరమయితే ఇందుకు సంబంధించి టిటిడినే మరో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది