Showing posts with label సచిన్ తెండూల్కర్. Show all posts
Showing posts with label సచిన్ తెండూల్కర్. Show all posts

Tuesday, 27 December 2011

బ్రాడ్‌మన్‌ను అధిగమించిన... సచిన్ తెండూల్కర్ !

అంతర్జాతీయ క్రికెట్‌లో ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ వందో శతకాన్ని ఎప్పుడెప్పుడు సాధిస్తాడా అని ఎంతో ఆసక్తితో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులు అంతకంటే ముందు సెంచరీల విషయంలో సచిన్ ఆస్ట్రేలియా మేటి ఆటగాడు సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను ఎప్పుడో అధిగమించిన విషయాన్ని మాత్రం గమనించలేకపోయారు. ప్రస్తుతం 185వ టెస్టు ఆస్ట్రేలియాతో ఆడుతున్న సచిన్ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లలో 51 శతకాలు, వనే్డ మ్యాచ్‌లలో మరో 48 శతకాలు సాధించడంతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మరో 27 సెంచరీలను నమోదు చేయడంతో అతని సెంచరీల సంఖ్య 126కు చేరింది. దీంతో బ్రాడ్‌మన్ తన కెరీర్‌లో సాధించిన సెంచరీల కంటే సచిన్ తొమ్మిది సెంచరీలు ఎక్కువే సాధించినట్టయింది. బ్రాడ్‌మన్ శకంలో వనే్డ క్రికెట్ మ్యాచ్‌లు లేవు. కెరీర్‌లో మొత్తం 52 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఆడి 29 సెంచరీలు సాధించిన బ్రాడ్‌మన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మరో 88 శతకాలను నమోదు చేయడంతో ఆయన సాధించిన సెంచరీల సంఖ్య 117గా ఉంది. అటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ, ఇటు అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లలోనూ కలిపి వందో శతకాన్ని నమోదుచేసే నాటికి బ్రాడ్‌మన్ వయసు 39 ఏళ్లుకాగా, ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో వందో శతకం సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచిన సచిన్ 38వ పడిలో ఉన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇప్పటివరకూ మొత్తం 99 శతకాలు నమోదు చేసిన సచిన్ సమకాలీన క్రికెట్ ప్రపంచంలో మరెవ్వరికీ అందనంత ఎత్తున నిలిచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మొత్తం 69 శతకాలతో సచిన్‌కు చాలా దూరంలో నిలిచాడు. 

Saturday, 24 December 2011

సచిన్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లకు ఇదే చివరి ఆస్ట్రేలియా టూర్ ?

యావత్ క్రికెట్ ప్రపంచానికే తమ అనితర సాధ్యమైన ప్రతిభతో వనె్నతెచ్చిన భారత ‘సీనియర్‌త్రయం’ సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లకు బహుశా తమ కెరీర్‌లో ఇదే చివరి ఆస్ట్రేలియా టూర్ కావచ్చు. దాదాపు ముగ్గురూ రిటైర్మెంట్‌కు సమీపంలో ఉన్నారు. చాలా రికార్డులు సొంతం చేసుకున్నారు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత సచిన్‌ది. అత్యధిక పరుగుల్లోనూ అతనే నంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించాడు. అతని వెన్నంటే ద్రవిడ్ మొత్తం పరుగుల విషయంలో రెండో స్థానంలో నిలుస్తున్నాడు. భారీ భాగస్వామ్యాలు... కీలక విజయాలు.. కళాత్మక ఆట.. కడవరకూ పోరాడే తత్వం..వివాదాలకు దూరంగా ఉండడం.. అత్యున్నత క్రీడా ప్రమాణాలను పాటించడం వంటి అనేకానేక అంశాల్లో ఈ ముగ్గురికీ సారూప్యం ఉంది. గణాంకాల విషయం ఎలావున్నా, సామర్థ్యంలో ముగ్గురూ ముగ్గురే. జాతీయ జట్టుకు అత్యుత్తమ సేవలు అందించడంలో మొనగాళ్లే. ఆస్ట్రేలియాలో టీమిండియా నాలుగు టెస్టులు ఆడుతుంది.తిరిగి 2014 డిసెంబర్‌లో మరోసారి ఆసీస్ టూర్‌కు వెళుతుంది.అప్పటికి ఈ ముగ్గురూ టెస్టు క్రికెట్‌లో ఉంటారనేది అనుమానమే.ఒకవేళ ఎవరైనా రిటైర్‌కాకుండా కెరీర్‌ను కొనసాగించినా, ముగ్గురూ కలిసి ఆడడం అసాధ్యంగానే కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే, ఇదే ఆసీస్‌లో తమ చివరి టెస్టు సిరీస్ అన్నది స్వదేశం నుంచి బయలుదేరే సమయంలోనే ఈ ముగ్గురు సీనియర్లు ఒక నిర్ణయానికి వచ్చివుంటారు. అందుకే ఈ సిరీస్‌ను ముగ్గురూ ఆఖరి పోరాటంగా భావించి, గొప్ప ముగింపును ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 26 నుంచి మెల్బోర్న్‌లో ఆరంభం కానున్న తొలి టెస్టులో మిగతా ఇద్దరి విషయం ఎలావున్నా, అందరి దృష్టీ సచిన్‌పైనే కేంద్రీకృతమైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘సెంచరీల సెంచరీ’కి కేవలం ఒక సెంచరీ దూరంలో ఉన్న సచిన్ ఈ టెస్టులోనే దానిని సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్ బ్యాటింగ్ విభాగంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ, ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన సచిన్ మరో మైలురాయిని చేరుకోవడానికి తహతహలాడుతున్నాడు. వందో సెంచరీకి తొందర లేదని ప్రకటిస్తున్నప్పటికీ, సచిన్ ధ్యాస మొత్తం దీనిపైనే ఉంటుందనేది వాస్తవం. ఇంగ్లాండ్ టూర్‌లో అద్భుతంగా రాణించిన ద్రవిడ్,ఎన్నోసార్లు ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించిన లక్ష్మణ్ కూడా తమతమ వ్యక్తిగత మైలురాళ్లను అధిగమించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వీరి సామర్థ్యం యువ క్రికెటర్లకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. జట్టులోని జూనియర్ ఆటగాళ్లకు ఇదో చక్కని అవకాశం.సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌లతో కలిసి ఆడడం, వారి నుంచి కళాత్మక బ్యాటింగ్‌లోని సొగసును ఆస్వాదించడం యువకులకు ఓ వరం. ముగ్గురు అతిరథ మహారథులు చెలరేగితే, వారిని కట్టడి చేయడానికి ఆసీస్ బౌలర్లు ఎంత కష్టపడాలో?.