Showing posts with label పుంగనూరు. Show all posts
Showing posts with label పుంగనూరు. Show all posts

Wednesday, 9 November 2011

వడ్డీ లేకుండా అప్పిచ్చువాడు.. ఆ మహానుభావుడు

శ్యామరాజు అంటే పుంగనూరు, చౌడేపల్లె మండలాల్లో తెలియని వారంటూ లేరు. తొమ్మిది పదుల వయసులో కూడా పాదరక్షలు ధరించకుండా, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, నిరాడంబరంగా కనిపించే ఆయనో కోటీశ్వరుడంటే నమ్మశక్యం కాదు! చిన్నతనం నుంచీ వ్యవసాయంతో కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టినా ప్రజల కోసం కోట్లాది రూపాయల ఆస్తులను విరాళాలుగా ఇచ్చిన దాతృత్వం ఆయనది.
చౌడేపల్లె మండలం పందిళ్లపల్లె పంచాయతీ బాలసముద్రం గ్రామంలో పెరుమాళ్లరాజు, కుప్పమ్మ అనే రైతు కుటుంబంలో 1912లో శ్యామరాజు ఐదవ సంతానంగా జన్మించారు. పెరుమాళ్లరాజు కుటుంబం తమిళనాడు నుంచి చౌడేపల్లె మండలానికి వచ్చి స్థిరపడింది. శ్యామరాజు ఆయన భార్య లక్ష్మమ్మకు ఇద్దరు సంతానం. చిన్నతనం నుంచీ వ్యవసాయం అంటే శ్యామరాజుకు ఎంతోఇష్టం. ఆయన తల్లిదండ్రులు సంపాదించిన 62 ఎకరాల్లో మామిడి, చింత తోటలను పెంచారు. అలాగే వేరుశెనగ, చెరుకు సాగు చేసేవారు. కాలక్రమంలో వ్యవసాయ కష్టంతో కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించారు. వ్యవసాయ పనుల కోసం రైతులకు ఏ రూపంలో సాయం కావాలన్నా చేస్తారనే పేరుతెచ్చుకున్నారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాదు; బ్యాంకుల్లో రైతుల రుణాలకు హామీదారుడిగా ఉంటారనే పేరూ ఉంది. రైతులు ఫలసాయం చేతికొచ్చాక సొమ్ము రూపేణాగానీ లేదా పంట రూపంలోగానీ ఆయనకు అప్పు చెల్లిస్తూంటారు. ఈ గుణమే ఆయన్ను రైతులకు ఆప్తుడిని చేసింది. నిరాడంబరి, నిగర్విగా పేరున్న శ్యామరాజు పందిళ్లపల్లె పంచాయతీకి 1960లో తొలిసారిగా ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి సర్పంచ్ పదవిలో కొనసాగుతున్నారు. 2000 సంవత్సరంలో ఎస్సీలకు రిజర్వు చేశారు. తిరిగి 2005లో సర్పంచ్‌గా ఆయన ఎన్నికయ్యారు. పంచాయతీని ఎంతగానో అభివృద్ధి చేశారు. పందిళ్లపల్లె పంచాయతీకి నాలుగుసార్లు జిల్లాలో ఉత్తమ పంచాయతీ అవార్డు లభించింది. బెంగళూరులో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్స్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంజినీరింగ్, మెడికల్ ఇతర కళాశాలల్లో తన కుమారులను భాగస్వామ్యులుగా చేసి, ప్రతి ఏటా నలుగురు ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. శ్యామరాజు ప్రస్తుతం పుంగనూరులోని ఎల్‌ఐసీ కాలనీలో నివాసముంటూ వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ఈయన భార్య లక్ష్మమ్మ మాత్రం బాలసముద్రం గ్రామంలో ఉంటూ వ్యవసాయ పనులు పర్యవేక్షిస్తుంటారు. ఈయన కుమారులు, కోడళ్లు, అందరూ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వీరు కూడా తీరిక వేళల్లో వ్యవసాయ పనులు చేస్తుంటారు.

ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు
వ్యవసాయంతో కష్టపడ్డాను. పైవాడూ దయ చూపాడు. అందుకే ఈ స్థితికొచ్చాను. మట్టిని నమ్ముకున్నోళ్లు పచ్చగా ఉంటేనే అందరూ బాగా ఉంటారనే నమ్మేవాళ్లలో నేనూ ఒకణ్ని. అందుకే రైతులకు చేతనైనంత సాయం చే స్తున్నా. ఇరవై ఏళ్ల క్రితం ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నా. పుంగనూరు పట్టణంలో కోర్టు భవనాల నిర్మాణం కోసం సుమారు 2 కోట్ల రూపాయల విలువ చేసే ఎకరా పొలం, ఆర్టీసీ బస్టాండు నిర్మాణానికి సుమారు 3 కోట్ల రూపాయల విలువ చేసే ఎకరా స్థలాన్ని విరాళంగా ఇచ్చాను. చౌడేపల్లె మండలంలో ఎన్నో కుటుంబాలకు సాయం చేశాను. కుడిచేత్తో సాయం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదని సామెత ఉంది. అవన్నీ ఎందుకు చెప్పడం? పైవాడు పిలిస్తే ఏమీ మూట కట్టుకుని పోలేం కద నాయనా!? ఇతరులకు సాయం చేస్తే ఆ పైవాడే చల్లగా చూస్తాడు. - శ్యామరాజు