Sunday, 25 December 2011

రాలయసీమ జిల్లాలో అదుపులోకి రాని మద్యం సిండికేట్లు

మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు చేసిన దాడులు ఏ మాత్రం ఫలితానివ్వ లేదు. మద్యం అధిక ధరల విక్రయం యదేచ్చగా కొనసాగుతుండటం గమనార్హం. మద్యం సిండికేట్ల కార్యాలయాల్లో సోదాల సందర్భంలో పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయని, ముడుపులు అందుకుంటున్న రాజకీయ తిమింగళాల వివరాలు తెలుసుకున్నామని అధికారులు చెప్పి సంబంధిత నివేదిక ప్రభుత్వానికి పంపారు. అయితే ఎసిబి దాడులు చేసిన తరువాత స్పందించాల్సిన ఎక్సైజు శాఖ అధికారులు మాత్రం ఎక్కడా మద్యం దుకాణాలపై దాడులు నిర్వహించి మద్యం అధిక ధరల విక్రయంపై చర్యలు తీసుకోకపోవడం విశేషం. కాగా తమకు దాడులు సాధరణమేనని కొందరు వ్యాపారులు పేర్కొంటుండటం చూస్తుంటే మద్యం ధరలు ఎక్కువ చెల్లించి మద్యపాన ప్రియులు జేబుకు చిల్లు పెట్టుకోవడం మినహా మరో గత్యంతరం లేదని అర్ధమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మద్యం ధరల అదుపునకు దాడులు చేస్తే మరునాడు మరి కొంత పెంచి విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయని కొందరు మద్యపాన ప్రియులు వెల్లడిస్తున్నారు. దాడులు చేయడం ప్రజల కోసం కాదని తమ పబ్బం గడుపుకోవడానికేనని అధికారుల తీరుపై మద్యపాన ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మద్యం ధరలను అదుపు చేసే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం దాడులు నిర్వహించి ఉంటే ఎసిబితో కాదని ఎక్సైజు, పోలీసు, రెవెన్యూ శాఖలతో దాడులు చేయించి ఉండేదని రాజకీయ విశే్లషకులు అంటున్నారు. మద్యం ధరల అదుపుకన్నా పాలకులకు ఎమ్మెల్యేలను అదుపు చేయడమే ప్రధాన కర్తవ్యమని వారు పేర్కొంటున్నారు. మద్యం సిండికేట్లలో ఉన్న ఎమ్మెల్యేలు తమ చేతిలోంచి జారి పోకుండా ఎసిబి నివేదికను అడ్డుపెట్టుకొని వారిని గుప్పెట్లో ఉంచుకోవడం ద్వారా పాలన సజావుగా సాగుతూ, జనం ఏమైపోయినా పరవాలేదు తమకిబ్బంది లేకుంటే చాలన్న విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నట్లు పరిస్థితి అర్ధమవుతోందని వారు పేర్కొంటున్నారు. మద్యం దుకాణాలను టెండర్ల ద్వారా ఖరారు చేసినపుడే మద్యం అధిక ధరలకు విక్రయించడం తథ్యమని కొంత మేర అర్ధమైందని అది ఇపుడు వ్యాపారులు ఆచరణలో పెట్టారని అంటున్నారు. జిల్లాలో మద్యం దుకాణ టెండర్లను తెరిచిన అధికారులే నోరెళ్లబెట్టి దుకాణాలను ఖరారు చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు. భారీగా సొమ్మును లెక్కబెట్టి ప్రభుత్వానికి లైసెన్సు ఫీజు రూపంలో చెల్లించిన వ్యాపారులు తమ పెట్టుబడి, లాభం అంతా రాబట్టుకోవాలంటే అధిక ధరలకు మద్యం విక్రయించడంతో పాటు మద్యపాన ప్రియుల ముందుకే మద్యం తీసుకెళ్లేందుకు గొలుసు దుకాణాలను ఏర్పాలు చేసుకున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. మద్యం వ్యాపారంలో జరుగుతున్న ప్రతి విషయం జిల్లాలో జగమెరిగిన సత్యమేనన్నారు. ఒకటిన్నర సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ తంతును లైసెన్సు కాల వ్యవధి ముగిసే సమయంలో ఎసిబి దాడులు ప్రయోజనమివ్వవని పాలకులకూ తెలుసునని అయితే తమ ప్రయోజనం నెరవేరితే చాలునన్నట్లు దాడులు చేయించారే కాని మద్యపాన ప్రియులపై అభిమానంతో కాదని అభిప్రాయపడుతున్నారు. ఎసిబి దాడులు జరిగిన తరువాత ఏ ఒక్క దుకాణంలోనూ ధరల్లో మార్పు రాకపోవడంపై ప్రభుత్వం ఏమీ సమాధానం చెప్పలేదని అందరికీ తెలిసిందేనన్నారు. జిల్లాలో మద్యం వ్యాపారంతో సంబంధం లేని నాయకుల పేర్లు వెతికినా కనిపించని పరిస్థితి ఉందని సర్వత్రా అంటున్నారు. ఇద్దరు, ముగ్గురు నాయకులు మినహా పార్టీలతో నిమిత్తం లేకుండా అన్ని రాజకీయ పార్టీల వారికి మద్యం దుకాణాలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంత మంది ఆగ్రహానికి గురి కావడం కన్నా సిండికేట్లతో సంబంధం ఉన్న వారిని గుప్పెట్లో పెట్టుకుంటే చాలన్న విధంగా పాలకుల శైలి ఉందని వెల్లడిస్తున్నారు. మరో ఆరు నెలల కాలంలో ముగిసే లైసెన్సు కాల వ్యవధిలోపే తమకు రావాల్సిన లాభాల శాతాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్న వ్యాపారులు మరి కొంత సొమ్ము చెల్లించైనా ధరల నియంత్రణ చర్యలను అడ్డుకుంటారే కాని నిర్ధేశించిన చిల్లర ధరకు విక్రయించే ప్రశే్న లేదని అత్యధిక శాతం జనం అభిప్రాయపడుతున్నారు. ఎసిబి నివేదికపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యాపారుల్లో ఉన్నా అందుకు వారు సిద్ధపడుతున్నారని ఎక్సైజు శాఖలో ఓ కీలక అధికారి వ్యాఖ్యానించారు. ధరలను అదుపు చేయడం మద్యపాన ప్రియులతో మినహా మరెవరితో కాదని ఆయన అన్నారు. మద్యానికి బానిసైన వారు ఇళ్లు తాకట్టు పెట్టయినా మద్యం సేవించేందుకు సిద్ధపడుతున్నారని అలాంటపుడు ఎవరు అడ్డుకుంటే మాత్రం ధరలు అదుపులోకి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. మద్యం ధరలు అదుపు చేయాలంటే ప్రభుత్వంలో నిజాయితీ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ధరలను ఎక్కువ చెల్లించి తాగడం కన్నా మానేయడం మేలని మద్యపాన ప్రియులు భావిస్తే తప్ప ధరల అదుపు సాధ్యం కాదని అదే సమయంలో దాడులు ఫలితాలను ఇవ్వవని ఆయన అన్నారు.

No comments:

Post a Comment