Monday, 28 November 2011

రఘువీరాకు లోకాయుక్త పిలుపు!

మేఘమథనంలో అవినీతికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై మంత్రి రఘువీరారెడ్డిని తన ఎదుట హాజరు కావాలని లోకాయుక్త ఆదేశించింది. డిసెంబర్ 23న దీనిపై విచారణ జరుగుతుందంటూ నోటీసులు జారీ చేసింది. మేఘ మథనంలో రఘువీరా అవినీతికి పాల్పడ్డారంటూ.. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన టీడీపీ నేత నారాయణ స్వామి అక్టోబర్ 27న లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. మేఘమథనం ద్వారా రూ.200కోట్ల వరకు దుర్వినియోగం చేశారని, అందులో రూ.70 కోట్ల దాకా మంత్రికి ముట్టిందని నారాయణస్వామి ఆరోపించారు. దీనిపై లోకాయుక్త స్పందించింది. డిసెంబర్ 23న హాజరుకావాలని రఘువీరారెడ్డికి లోకాయుక్త నోటీసు పంపిందని నారాయణ స్వామి, టీడీపీ అనంతపురం జిల్లా ప్రధానకార్యదర్శి వరదాపురం సూరి ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మంత్రి అవినీతికి సంబంధించిన ఆధారాలతో తాము లోకాయుక్త ముందు హాజరవుతామని వారు చెప్పారు. అక్కడ న్యాయం జరగని పక్షంలో హైకోర్టుకు, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో కేవలం రూ.15 కోట్లు మేఘ మథనానికి ఖర్చుచేశామని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి రఘువీరారెడ్డి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

No comments:

Post a Comment