Friday, 20 January 2012

అనంత రైతు ప్రత్యామ్నాయం ఏంటి...?

‘సబ్సిడీలు ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని అడగంలేదు. ఉచిత పథకాలు కూడా అవసరం లేదు. మాకు కావాల్సింది సాగునీరు మాత్రమే ’ - కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామ రైతుల నివేదన
 ‘జిల్లా వాతావరణానికి అనువైన వంగడాలు రూపొందించాలి. సాగునీటి లభ్యత పెంచి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా చూడాలి ’- కంబదూరు మండలం ములకనూరు గ్రామ రైతుల వినతి
‘‘ప్రత్యామ్నాయ పంటలు పండించమని సలహాలు ఇస్తున్నారేగాని పండిన తర్వాత ఆ పంట ఉత్పత్తులు ఎక్కడ విక్రయించుకోవాలో ఎవరూ చెప్పడం లేదు. ధర లేకపోతే పంటలు పండించి ప్రయోజనం ఏమిటి’ 
- గాండ్లపెంట మండలం కమతంపల్లి గ్రామ రైతుల ఆవేదన. 
ఇవి అనంతపురం రైతులు పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి మొర పెట్టుకొన్న సమస్యలు.. జిల్లాలోని వ్యవసాయరంగ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్న కేంద్ర అత్యున్నత సాంకేతిక కమిటీ రెండో రోజు గురువారం పది మండలాల్లో పర్యటించింది. కంబదూరు మండలం ములకనూరు గ్రామంలోని పంట పొలాలను ఏకే సింగ్ పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తించినట్లు చెప్పారు.  పూర్తి వర్షాధారంతో వ్యవసాయం చేస్తున్న రైతులకు సామూహిక(సమష్టి) సాగు విధానం మేలు చేకూర్చుతుందని కేంద్ర బృందం చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధన కౌన్సిల్ డిప్యూటీ డెరైక్టర్ ఏకే సింగ్ అభిప్రాయపడ్డారు. నిపుణుల సలహాలు ఇలా ఉన్నప్పటికీ అనంత రైతులకు అవసరం అయినవి ఎన్నో చేయాల్సి ఉంది. 
చీడపీడల నుంచి పంటలను సంరక్షించుకోవడానికి తక్షణ సలహాలు, సూచనలు ఇచ్చే నిపుణులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి... పండించిన పంటను స్థానికంగానే గిట్టుబాటు ధరకు విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది...  ప్రధానంగా నీటిలభ్యత తక్కువుగా ఉన్నందున స్పింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలి... నాణ్యమైన విత్తనాల కొరతను ఎదుర్కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు..వారికి మేలురకం విత్తనాలు అందచేయాలి... రైతులు కూడా  ఉద్యాన పంటలతోపాటు పశుపోషణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది..... పంటల సాగుకు నీటి లభ్యతలేని ప్రాంతాల్లో పాడిని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది 

రైతులు కూడా కేంద్ర పర్యటక బృందానకి కొన్ని ఫిర్యాదులు చేశారు..స్థానికంగా వ్యవసాయాధికారులు తమకు అందుబాటులో ఉండరన్నారు.. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. భూమిలోని తేమతోపాటు వాతావరణంలోని తేమను గ్రహించే వంగడాలతోపాటు సాగునీరు అందచేయాలని కోరారు. కర్ణాటకలో లీటరు పాలకు నాలుగు రూపాయలు అదనంగా ఇస్తున్నారని, ఆ ధరను ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉందని రైతులు విన్నవించారు.  పలువురు రైతులు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే ఆ పంటలు ఎక్కడ విక్రయించుకోవాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. డ్రిప్, స్పింక్లర్లకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా సబ్సిడీ విధానం అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా కేంద్ర కమిటీ కూడా స్థానిక అదికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖల 
తీరుపై సరిగా లేదని  కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతులకు సలహాలు,సూచనలు అందజేయాల్సిన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖ అధికారుల పనితీరు సక్రమంగా లేదని కమిటీ అభిప్రాయపడింది. మూడు బృందాల సభ్యులకు ఆయా శాఖల అధికారుల వైఖరిపై పలు ఫిర్యాదు అందాయి. క్షేత్ర స్థాయిలో కూడా కమిటీ సభ్యులకు ఎదురైన అనుభవాలతో ఆయా శాఖల అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో విఫలమవుతున్నారని గుర్తించినట్లు కమిటీలోని ఒక శాస్త్రవేత్త తెలిపారు. కాగా డాగర్ నేతృత్వంలోని బృందం గురువారం సాయంత్రం పుట్టపర్తిలో బాబా సమాధిని సందర్శించింది.

పశుగ్రాసం పెంపకంలోకడప జిల్లాకు రెండోస్థానం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశుగ్రాసం పెంపకంలో కడప జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిందని పశు సంవర్ధక శాఖ జేడీ విజయ్‌కుమార్ అన్నారు. స్థానికంగా పశువైద్యశాలను  ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కరువును దృష్టిలో ఉంచుకొని చెరువులలోని మిగులు నీటితో పశుగ్రాసం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 40 చెరువులను గుర్తించామన్నారు. కరువు తీవ్రత దృష్ట్యా పశుగ్రాసం నిల్వ చేసేందుకు దృష్టి సారిస్తున్నామన్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒకటి చొప్పున 50 పాతర గుంతలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో మొక్క జొన్న, జొన్న పైరును కటింగ్‌చేసి పాతర గుంతలలో వేసి వాటిపై బెల్లం పానకం చల్లితే మూడు నెలలపాటు నిల్వ చేసుకోవచ్చన్నారు. అలాగే జిల్లాకు 404 మినీ డెయిరీలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటివరకు 10మినీ డెయిరీలు ఏర్పాటు చేశామన్నారు. పాడి పశువుల పెంపకానికి జిల్లాకు రూ..85లక్షలు మంజూరయ్యాయని, ఇందులో రూ..65లక్షలతో పాడి పశువులను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించామని చెప్పారు. అలాగే జిల్లాకు 91 గొర్రెల పెంపకం యూనిట్లు మంజూరయ్యాయని, ఇందుకు రూ..12లక్షల సబ్సిడీ విడుదలైందన్నారు. దీని ద్వారా 50శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు గొర్రెలను ఇస్తున్నామన్నారు. అంతేకాక జిల్లాకు కోళ్ల పెంపకానికి రూ..40లక్షలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటివరకు 1800మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 6కోడి పిల్లల పెంపకం కేంద్రాలను కడప 2, పులివెందుల, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు ప్రాంతాలలో ఒక్కొక్కటి చొప్పున నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో లబ్ధిదారునికి ఉచితంగా 45కోళ్లను అందిస్తామన్నారు. అలాగే ఆర్‌కేయూవై పథకం కింద జిల్లాకు 220 గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ..28వేలు ఇస్తున్నామని, ఇందులో రూ..14వేలు సబ్సిడీ వర్తిస్తుందన్నారు. ఇప్పటివరకు 110 యూనిట్లను లబ్ధిదారులకు ఇచ్చామని వివరించారు. అనంతరం ఆయన పశువైద్యశాలలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏడీ ప్రసాదరావు పాల్గొన్నారు.

బాలకృష్ణ గెలుస్తాడు...జెసి


హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుండి పోటీ చేస్తే గెలుపొందటం ఖాయమని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లాలో మాత్రం బాలయ్య ప్రభావం ఉండదన్నారు. కాగా జిల్లాలో మరోసారి కాంగ్రెసు పార్టీలో వర్గ పోరు బహిర్గతమైంది. జిల్లా కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు పాటిల్ వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డిపై విరుచుకు పడగా, జెసి ప్రభాకర్ రెడ్డి పాటిల్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో జెసి దివాకర్ రెడ్డి తనను కావాలనే ఓడించారని పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. టిడిపి అభ్యర్థిని గెలిపించినందుకు ప్రతిఫలంగా జెసి అల్లుడికి ఆ పార్టీ అధిష్టానం రాయదుర్గం ఇంచార్జ్ పదవి కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. తనను ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించిన జెసిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పాటిల్ వ్యాఖ్యలపై జెసి సోదరుడు ప్రభాకర్ రెడ్డి స్పందించారు.ఎవరు ఏ పార్టీలోనైనా ఉండవచ్చునని ఎదురుదాడికి దిగారు. తమ బంధువు టిడిపి పార్టీలో ఉంటే తమకేం సంబంధమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఓటమికి స్థానిక మంత్రుల అసమర్థతే కారణమన్నారు. గెలిస్తే మీ గొప్పతనం ఓడిపోతే మా వైఫల్యమా అని ప్రశ్నించారు. రాయదుర్గం ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పాటిల్ ఓడిపోతారన్నారు. కాగా గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ ఓడిపోయిన విషయం తెలిసిందే

Thursday, 19 January 2012

వారసులొస్తున్నారు!



దివంగత తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అనంతపురంలోని తన నివాసంలో ఆయన రాప్తాడు, అనంతపురం శాసనసభా నియోజకవర్గాలకు చెందిన పరిటాల అభిమానులతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ నెల 24వ తేదీన జరిగే పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంపై ఆయన వారితో చర్చించారు. ఇక నుంచి పరిటాల రవి ట్రస్టు నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో తాను ముందు ఉంటానని చెప్పారు. రాజకీయం పెద్దలు చూసుకుంటారని, రాజకీయం గురించి మాట్లాడే వయస్సు తనకు లేదని శ్రీరామ్ అన్నప్పటికీ భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే ఆయన క్రియాశీలకంగా ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సూచన మీద, అభిమానుల కోరిక మీద శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం ఆధారపడి ఉంటుందని పార్టీ శాసనసభ్యురాలు, పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీత చెప్పారు. పరిటాల ట్రస్టు సేవా కార్యక్రమాలకు మాత్రం ప్రస్తుతానికి శ్రీరామ్ నేతృత్వం వహిస్తారని ఆమె చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడే సయమం కాదంటూనే ఆమె శ్రీరామ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే సూచనను అందించారు. 2014 ఎన్నికల నాటికి ఆయన రాజకీయాల్లోకి రావచ్చునని చెబుతున్నారు. అందుకు తగిన ప్రాతిపదిక ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ యువోత్సాహంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు రాష్ట్ర రాజకీయాల్లోకి హీరో బాలకృష్ణ, అనంతపురం జిల్లాలో స్వర్గీయ పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరాం, చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు వారసులు తెరపైకి రావడంతో తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనలో బాలయ్య ప్రకటించడం టిడిపిని ఉత్సాహంలో ముంచడమే కాకుండా, రాష్ట్రంలో ఒక్కసారిగా బాలయ్య చర్చనీయాంశమయ్యారు. ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారు, పార్టీలో ఏం బాధ్యతలు నిర్వహిస్తారనే అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన రాజకీయ ఆరంగేట్ర ప్రకటనతో టిడిపిలో 1983 నాటి ఉత్తేజం కనిపిస్తోందనే వారూ ఉన్నారు. దీంతో 2014 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే ధీమా టిడిపి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఆ పార్టీ అధినేత చంద్రబాబు పలుమార్లు యువత రాజకీయాల్లోకి రావాలని, మేం ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. పరిటాల తర్వాత అనంతపురం జిల్లాలో టిడిపి నిస్తేజంగా మారిందనే చెప్పవచ్చు. ఆ జిల్లాలో టిడిపికి పూర్వ వైభవం తీసుకు రావడానికి రాప్తాడు ఎమ్మెల్యే, పరిటాల సతీమణి సునీత ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆమె తన తనయుడు పరిటాల శ్రీరాంను పరిచయం చేసినట్లుగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో శ్రీరాంకు ఎన్నికల్లో పోటీ చేసే వయసు ఉండదు. అయితే యువతను టిడిపి వైపు లాగేందుకే అధిష్టానం సూచనల మేరకు శ్రీరాంను తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. పరిటాల తర్వాత దాదాపు నిరుత్సాహంతో ఉన్న పార్టీ క్యాడర్ సేవా కార్యక్రమాల పేరుతో శ్రీరాం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. శ్రీరాం రాకతో జిల్లా కార్యకర్తల్లో నూతనోత్సాహం రావడంతో పాటు యువత నుండి కూడా మద్దతు బాగానే లభిస్తోంది. వచ్చే ఎన్నికల్లో శ్రీరాం పోటీ చేయకున్నప్పటికీ జిల్లాలో ప్రచారం చేసే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.విజయవాడ టిడిపి నేత వల్లభనేని వంశీ కూడా శ్రీరాం రాక పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటీవల చంద్రబాబు తన స్వగ్రామంలో పర్యటించినప్పుడు నారా వారసులు నారా లోకేష్, నారా రోహిత్ ఫోటోలు ఫ్లెక్సీల్లో ప్రముఖంగా దర్శనమివ్వడం విశేషం. ఓ వైపు యువతను ఆకర్షించడానికి ఇలాంటి వారు రంగంలోకి దిగుతుండగానే, చంద్రబాబు రైతు పోరు బాట తదితర యాత్రల రుతో ప్రజల్లోకి వెళుతూ పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే బాలయ్య ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉండగా, పరిటాల శ్రీరాం వంటి యువకుల ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

ఫామ్‌లో ఉన్నది క్రికెట్ దేవుడొక్కడే...డేవిడ్ వార్నర్


టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్ బ్యాట్స్‌మెన్‌ల్లో ఫామ్‌లో ఉన్నది సచిన్ ఒక్కడేనని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. సిరీస్‌లో సచిన్ మినహా భారత బ్యాట్స్‌మెన్ విఫలమవుతున్నారని వార్నర్ చెప్పాడు. కాగా అడిలైడ్ టెస్టులో భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడవచ్చని భావిస్తున్నట్టు తెలిపాడు. వచ్చే ఏడాది యాషెస్ సిరీస్‌లోగా నెంబర్‌వన్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని చెప్పాడు.25 సంవత్సరాల వయసు కలిగిన డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ టీమిండియాలో చాలా మంది బ్యాట్స్ మెన్ ఉన్నప్పటికీ, నా మైండ్‌లో మాత్రం పరుగులు చేసే బ్యాట్స్‌మెన్‌గా కేవలం ఒక్క సచిన్ మాత్రమే కనిపిస్తున్నాడని అన్నాడు. టీమ్‌లో మిగిలిన బ్యాట్స్‌మెన్ ప్రపంచ శ్రేణి ఆటగాళ్లుగా సంబోధించాడు. ఈ టెస్టు సిరిస్ లో వారు చేసిన స్కోరుని గనుక చూసినట్లేతే కేవలం అతి తక్కువ. అడిలైడ్‌లో జరగబోయే నాల్గవ టెస్టులో ఆసిస్ ఆటగాళ్లు కొత్త చరిత్రను తిరగరాయనున్నారని అన్నాడు.ఈ సిరిస్‌లో సచిన్ టెండూల్కర్ ఆఫ్ సెంచరీ చేసినప్పటికీ, తన వందో సెంచరీని చేయడంలో విఫలమయ్యాడని అన్నాడు. ఇప్పటికే టీమిండియా 0-3తో పరాజయాన్ని మూటగట్టుకుందని తెలిపాడు. టీమిండియా ఒత్తిడితో ఉండడం వల్లనే విదేశీ గడ్డపై ఏడు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయిందని తెలిపాడు. నాల్గవ టెస్టులో కూడా టీమండియాని ఓడించి, వైట్ వాష్ చేసే దిశగా ఆసిస్ ఆలోచిస్తుందని అన్నాడు. పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ 37 పరుగుల విజయం సాధించిన తర్వాత ఆసిస్ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ మాట్లాడుతూ ప్రపంచంలో రెండవ స్దానంలో ఉన్న టీమిండియాని ఓడించిన సందర్బంలో ఎంజాయ్ చేయండని టీమ్ సభ్యులకు తెలిపిన విషయం తెలిసిందే.

అనంతపురం జిల్లాలో జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు



అనంతలో మొదటి సారి 33వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ సీనియర్ ఛాంపియన్ షిప్‌పోటీలు ప్రారంభం అయ్యాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్‌బాల్ క్రీడాకారులు అనంతకు మొదటి సారి వచ్చారు. ఈనెల 23వ తేదీ వరకు అనంతలో సంజీవరెడ్డి స్టేడియంలో, ఆర్డీటీ క్రీడా గ్రామంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలలో పాల్గొనడానికి 25 పురుష జట్లు, 22 మహిళా జట్లు వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జితేంద్రరెడ్డి అధ్యక్షతన ప్రారంబోత్సవ సభను ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ గేయానంద్, ఆల్ఇండియా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి.ఎన్.పిసి. జేసీ అనితారామచంద్రన్, మాంచోఫెర్రర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చుఫాస్టు నిర్వహించారు. సభ అధ్యక్షులు జితేంద్రరెడ్డి వినతిమేరకు ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి 33వ జాతీయస్థాయి సీనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, శాంతి కపోతాలను ఎగురవేశారు. ఆదరణకు కొదువలేదు కరువు జిల్లా అయిన అనంతలో ఆదరణకు కొదువలేదు. జాతీయస్థాయి చాంపియన్ షిప్ ఇక్కడ జరగడం ఆనందంగా ఉంది. సాఫ్ట్‌బాల్ అకాడమికి కృషి - మాంచోఫెర్రర్ వివిధ క్రీడలతోపాటు సాఫ్ట్‌బాల్‌ను కూడా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. సాఫ్ట్‌బాల్ అకాడమి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఫోటోలు హోరాహోరీగా మ్యాచ్‌లు.. అనంతలో మొదటి సారి 33వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ సీనియర్ ఛాంపియన్ షిప్‌పోటీలు పోటాపోటీగా జరుగుతున్నాయి. మొత్తం ఐదు మైదానాలలో ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. మొదటి రోజు మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.పురుషుల విభాగంలో... కర్ణాటక-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 4-1 స్కోరుతో గెలుపొందింది. కేరళ-ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన పోటీలో కేరళ జట్టు 14-0 పాయింట్లతో విజయం పొందింది. ఛత్తీస్‌ఘడ్-బీహార్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌ఘడ్ మ్యాచ్ 11-1 స్కోరుతో విజయం చేజిక్కించుకుంది. మహిళల విభాగంలో... జమ్మూకాశ్మీర్-మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జమ్మూకాశ్మీర్ 10-0 స్కోరుతో గెలుపొందింది. ఛత్తీస్‌ఘడ్-ఒడిసా మధ్య జరిగిన మ్యాచ్‌లో 8-8తో డ్రాగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్-హిమాచల్‌ప్రదేశ్ మధ్య పోటీలో హిమాచల్‌ప్రదేశ్ 6-0 స్కోరుతో గెలుపొందింది. మేఘాలయ-తమిళనాడు మధ్య మ్యా చ్‌లో మేఘాలయ జట్టు 10-0 స్కోరుతో విజయం దక్కించుకున్నారు








తిరుపతి రైల్వే స్టేషన్ అంతర్జాతీయ గుర్తింపు


తిరుపతి రైల్వే స్టేషన్‌ను మరో ఐదేళ్లలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్టు ఎంపి డాక్టర్ చింతామోహన్ తెలిపారు. 125 సంవత్సరాల క్రితం తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. అప్పట్లో 2 రైళ్లు వచ్చేవని, 5వేల మంది ప్రయాణికులు తిరుపతి వచ్చేవారన్నారు. అయితే నేడు 75 రైళ్లు తిరుపతికి ప్రతిరోజు వస్తుండగా, సరాసరి లక్ష మంది ప్రయాణిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ రైల్వే స్టేషన్‌గా విస్తరింపజేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకు సంబంధించి 300 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుత రైల్వే స్టేషన్‌ను అలాగే ఉంచి తిరుపతి వెస్టు రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే వెస్టు రైల్వే స్టేషన్‌లో రైల్వేకి సంబంధించి 50 ఎకరాల భూమి ఉందన్నారు. మరో 20 ఎకరాలు ఇచ్చేందుకు టిటిడి సిద్ధంగా ఉందన్నారు. మరో ఐదేళ్లలో అంతర్జాతీయ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోనున్నదన్నారు.