Friday, 21 October 2011

డెంగ్యూ , మలేరియా, క్యాన్సర్ రోగులకు (సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్ సెపరేషన్ యూనిట్)చికిత్స మిషన్

: పేద, మధ్యతరగతి కుటుంబాల రోగులకు వరం డెంగ్యూ వ్యాధి నిర్ధారణ చికిత్స మిషన్ (సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్ సెపరేషన్ యూనిట్)ను అన్నదాత ఎంపి ఎస్పీవై రెడ్డి విరాళంగా అందించడం ఎంతో అభినందించదగ్గ విషయమని కలెక్టర్ రాంశంకర్ నాయక్ పేర్కొన్నారు. గురువారం నంద్యాల వైద్య విధాన పరిషత్‌లో ఎంపి ఎస్పీవై రెడ్డి విరాళంగా అందజేసిన మిషన్‌ను కలెక్టర్ రాంశంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కర్నూలుతోపాటు నంద్యాలలో కూడా రూ.13లక్షలు విలువ చేసే మిషన్‌ను ఏర్పాటుచేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. దీనివల్ల రోగులు కర్నూలుకు రావాల్సిన అవసరం లేదని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్సలు చేయించుకోవచ్చన్నారు. ప్రస్తుతం జిల్లాలో డెంగ్యూ వ్యాధి భయభ్రాంతులకు గురిచేస్తున్నదని దీనివల్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాల వారు రోగం వస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అధిక వ్యయం చేసి చికిత్సలు చేయించుకోలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే రూ.10వేల నుంచి రూ.20వేల వరకూ వ్యయం అవుతుందని, అయితే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఈ మిషన్ ద్వారా రూ.5,500లకే చికిత్సలు చేస్తారని తెలిపారు. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఈ మిషన్ డెంగ్యూ వ్యాధితోపాటు మలేరియా, క్యాన్సర్ రోగులకు కూడా చికిత్సలు చేయవచ్చన్నారు. మిషన్ ద్వారా వ్యాధి వచ్చిన రోగికి గంటపాటు చికిత్స చేయవచ్చన్నారు. ఈ మిషన్ ద్వారా రోగికి వచ్చిన వైరస్‌ను తొలగించి కొత్త రక్తం ద్వారా స్వస్థత చేకూర్చవచ్చన్నారు. ఎంపి ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మిషన్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. తాను ఎప్పుడూ పేద రోగులకు అండగా ఉంటానని తెలిపారు. మిషన్‌ను ఆపరేట్ చేయడానికి ముగ్గురు టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చి ఏర్పాటుచేయడం జరిగిందన్నారు

టీటీడీ చైర్మన్ విష్ణు నివాసం సముదాయాన్ని రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు

 తిరుపతిలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన విష్ణు నివాసం సముదాయాన్ని త్వరితగతిన పూర్తిస్థాయిలో యాత్రికులకు అందుబాటులోకి తేవాలని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కోరారు. అత్యాధునిక హంగులతో రూపుది ద్దుకుంటున్న విష్ణు నివాసం గూర్చి ప్రతి సామాన్య భక్తునికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశిం చారు. ఈ సముదాయాన్ని గురువారం రాత్రి చైర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాలపై సరైన ప్రచారం లేనికారణంగానే యాత్రికులు ధరలు అధికంగా ఉన్నా ప్రైవేటు లాడ్జిల ను ఆశ్రయిస్తున్నారన్నారు. ఈ సముదాయం నిర్మాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేసేందుకు అవసరమైన రూ.34కోట్లను అదనంగా విడుదల చేశామన్నారు. ఇం జినీరింగ్ విభాగం అధికారులు వేగంగా నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు.ముఖ్యంగా టీటీడీ వసతి గృహాల్లో చోరీలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వాటి నివారణకు సిబ్బందిని వెంటనే నియమించుకోవాలని చెప్పారు. విష్ణునివాసంలో పటిష్ట భద్రత కోసం 64 సీసీ కెమెరాలనుఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. సముదాయానికి నాలుగు వైపులా ఏర్పాటు చేసిన గేట్‌లను ఎల్లవేళలా తెరచి ఉంచాలని కోరారు.

నిర్వహణకు నెలకు రూ.17.5 లక్షలు
విష్ణు నివాసం వసతి సముదాయం నిర్వహణ కోసం నెలకు ఏజెన్సీకి రూ.17.50 లక్షలు టీటీడీ ఖర్చు చేస్తుం దని చైర్మన్ తెలిపారు. రూ.2 కోట్ల వరకు భారం భరి స్తున్నా, యాత్రికులకు మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పించడమే తమ ధే ్యయమన్నారు. అన్ని అంతస్థుల్లోని గదులు, డార్మెటరీలను స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గదులు, సముదాయం పరిసరాల్లో పారిశుధ్య పనుల నిర్వహణపై నిత్యం యాత్రికుల నుంచి అభిప్రాయ సేకరణ చేసి తనకు ఆన్‌లైన్ ద్వారా నివేదించాలని కోరారు

రక్షణశాఖల ఆధ్వర్యంలో యుద్ధ ట్యాంకుల సామర్థ్య పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అధికారులు స్థలాన్ని పరిశీలించారు

 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత మండ లం కలికిరి సమీపంలో కేంద్ర హోం, రక్షణశాఖల ఆధ్వర్యంలో యుద్ధ ట్యాంకుల సామర్థ్య పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. గురువారం కలికిరి పంచాయతీ కె. కొత్తపల్లి సమీపంలో ఎద్దలకొండ పరిసరాలను డిఫెన్స్ అధికారులు గిరిధరన్, లోకనాథం పరిశీలించారు.

మదనపల్లె ఆర్డీవో వినయ్‌చంద్ ఆధ్వర్యంలో కె.రెడ్డివారిపల్లె పంచాయతీలోని సర్వే నెంబర్ 1066, కలికిరి పంచాయతీలోని 1051, 1043 సర్వే నెంబర్లలోని 500 ఎకరాల విస్తీర్ణం కల్గిన ప్రభుత్వ, ప్రయివేటు భూములను పరిశీలించారు. సామర్థ్య పరీక్షా కేంద్రానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయాన్ని రక్షణశాఖ బృందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశానికి అవసరమైన యుద్ధ ట్యాంకులను చెన్నై సమీపంలో తయారు చేస్తున్నారు. అనంతరం రాజస్తాన్‌లో వీటి సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సామర్థ్య పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు

వనిత కార్డులు తీసుకున్న గ్రామాలకు ప్రత్యేక సర్వీసులు

వనిత కార్డుల అమ్మకాల్లో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(నెల్లూరు) సూర్యచంద్రరావు తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక టు డిపో మేనేజర్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ నెల్లూరు, ఒంగోలు, తిరుపతి రీజియన్ల పరిధిలో ఇప్పటి వరకు లక్షా 34 వేల వనిత కార్డులు అమ్మినట్లు తెలిపారు. 17వేల వనిత కార్డులు తీసుకున్న గ్రామాలకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు.

నెల్లూరు, తిరుపతి, ఒంగోలు రీజియన్ల పరిధిలో త్వరలో 40 ఇంద్ర బస్సులు నడుపుతామన్నారు. శబరిమలైలోని పంబా వద్ద ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతి రీజియన్ పరిధిలో శబరిమలకు వంద సర్వీసులు నడపుతున్నట్లు తెలిపారు. బస్సుల్లో ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు బాలస్వాములు, ఒక వంటమనిషికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. శబరిమలకు బస్సులు బుక్ చేసిన వారికి ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపారు. మూడు బస్సులు బుక్ చే స్తే రూ.250, నాలుగు బస్సులు రూ.300, ఐదుపైన బస్సులు రూ.350 చొప్పున రోజుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో తిరుపతి రీజియన్ పరిధిలో కండక్టర్లు, డ్రైవర్ల నియమాకం చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతి సమీపంలోని మంగళం డిపోను త్వరలో ప్రారంభిస్తామన్నారు. బి.కొత్తకోట డిపోకు స్థలం ఇస్తే తిరిగి పునః ప్రారంభిస్తామన్నారు

బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడాన్ని నిషేధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ


బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని, దీనిని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు జాయింట్ కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాష్ తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో పొగాకు నిషేధిత కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ 2008 అక్టోబర్ నుంచి బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడాన్ని నిషేధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని, అయితే అమలుకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాస్థాయి కమిటీకి తాను చైర్మన్‌గా వ్యవహరిస్తానని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే రూ.200 నుంచి రూ.1000 వరకు జరిమాన, జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో పొగ తాగరాదంటూ బోర్డులు పెట్టాలని సూచించారు. పొగ తాగే వారికంటే వదిలిన పొగ పీల్చేవారికే అపాయం ఎక్కువగా ఉంటుందన్నారు. పొగాకు వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

Thursday, 20 October 2011

ప్రజల్లో హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై అవగాహన

 ప్రజల్లో హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్ధ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ స్వచ్చంద సంస్థ స్థానిక నాలుగుకాళ్ల మండపం వద్ద బుధవారం వీధినాటకాన్ని ప్రదర్శించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఇలాంటి వీధి నాటకాలు నిర్వహిస్తున్నట్లు కో- ఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈసందర్భంగా జిల్లా ఎయిడ్స్ నియంత్రణా సంస్ధ డిపిఎం లలిత మాట్లాడుతూ హెచ్‌ఐవి, ఎయిడ్స్‌కు దూరంగా వుండాలంటే ప్రతి ఒక్కరు విధిగా కండోమ్స్‌ను వాడాలన్నారు. కండోమ్స్‌లను వాడటం ద్వారా సుఖవ్యాధులు నివారించవచ్చునన్నారు. ఇలాంటి కార్యక్రమాలను జిల్లాలోని 14 పట్టణాలలో 19 మేజర్ గ్రామ పంచాయతీలలో నిర్వహించనున్నామన్నారు. వచ్చే ఏడాది జూన్ వరకూ ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు

రాయలసీమ పరిధిలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

                                     
రాయలసీమ పరిధిలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్లు దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం నాడు కదిరి, లేపాక్షి, హిందూపురం ప్రాంతాల్లో ఎస్‌ఇతోపాటు ఇఇ శ్రీనివాసరావు, డిఇ గంగయ్యలు వివిధ దేవాలయాలను పరిశీలించారు. ఇందులో భాగంగా స్థానిక గుడ్డం రంగనాథస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా తనను కలిసిన పాత్రికేయులతో ఎస్‌ఇ మాట్లాడారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ చరిత్రను దృష్టిలో వుంచుకొని మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దేవాలయ పరిధిలో రూ.40 లక్షలతో భక్తుల సౌకర్యార్థం సామూహిక సత్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ నెలాఖరు లోగా పనులు పూర్తి అవుతాయని తెలిపారు. అదే విధంగా రూ.1.50 కోట్లతో అధునాతన 40 గదుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇకపోతే కదిరి గాంధీచౌక్ సమీపంలో రూ.18 లక్షలతో దేవాలయానికి సంబంధించిన స్థలంలో 16 వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నట్లు ఎస్‌ఇ తెలిపారు. దీనికి తోడు కదిరి సమీపంలోని కొండల నరసింహస్వామి దేవాలయంలో ఎంతోకాలంగా వివాహాలు అధికంగా సాధారణ ప్రజలు నిర్వహిస్తున్నందున మరింత అభివృద్ధి చేసే విధంగా రూ.25 లక్షలతో కమ్యూనిటీ హాలును అధునికంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు