ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ఇంటిని కోర్టు అధికారులు శుక్రవారం ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఇల్లు బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 13లో ఉంది. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుండి ఆమె అందులోనే ఉంటున్నారు. ఎన్టీఆర్ వీలునామా ప్రకారం ఆ ఇల్లు చిన్న కూతురు ఉమా మహేశ్వరికి దక్కింది. ఉమా మహేశ్వరి ఈ ఇంటి పవర్ ఆఫ్ అటార్నీని తన సోదరుడు రామకృష్ణకు ఇచ్చారు.లక్ష్మీ పార్వతిచే ఇల్లు ఖాళీ చేయించాలంటూ రామకృష్ణ కోర్టును ఆశ్రయించారు. సిటీ సివిల్ కోర్టు ఇళ్లు ఖాళీ చేయాలంటూ లక్ష్మీ పార్వతిని ఆదేశించింది. అయితే ఇచ్చిన గడువులోగా ఆమె ఖాళీ చేయకపోవడంతో కోర్టు అధికారులు ఇంటిని ఖాళీ చేయించారు. ఇల్లు ఖాళీ చేయించేందుకు రామకృష్ణ వెళ్లారు. అయితే లక్ష్మీ పార్వతి లేని సమయంలో ఇల్లు ఖాళీ చేస్తుండటంతో ఆమె ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన గడువు అయిపోయినప్పటికీ ఆ ఇంట్లో ఎన్టీఆర్‌కు సంబంధించిన విలువైన వస్తులు ఉన్నాయని, ఖాళీ చేసేందుకు మరో నెల రోజులు గడువు కావాలని కోరినప్పటికీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తిరస్కరించారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.