Showing posts with label రాయలసీమ విమోచన సమితి. Show all posts
Showing posts with label రాయలసీమ విమోచన సమితి. Show all posts

Sunday, 20 November 2011

సమైక్యాంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం రాయలసీమ

సమైక్యాంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం రాయలసీమ ఒక్కటే అని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో తెలిపిందని రాయలసీమ యువసేన రాష్ట్ర నాయకులు శీలం శేషు అన్నారు.  వెలుగోడు తెలుగుగంగ అతిథి గృహంలో మండల అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మూడు ముక్కలుగా విడిపోతే లేనిపోని అనర్థాలు జరుగుతాయని కొంతమంది స్వార్థపరులు భయపెడుతున్నారన్నారు. వాస్తవానికి ప్రత్యేక రాయలసీమ ఏర్పడితే రాయలసీమ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం వుందన్నారు. అన్ని రకాల గనులు, పుణ్య క్షేత్రాలు, అడవులు వున్న రాయలసీమ ప్రాంతం 1956 నవంబర్ 1వ తేదీ నుండి కర్నూలు రాజధానిని కోల్పోయిందన్నారు. నాటి నుండి నేటి వరకు పాలకులు హైదరాబాద్‌ను విపరీతంగా అభివృద్ధి చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలన్న వారిని సంతోషపెట్టడం కొరకు వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు కానీ రాయలసీమ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఏ చిన్న పనికావాలన్నా హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితులు నేడు నెలకొన్నాయన్నారు. మన సమీప ప్రాంతంలోనే పరిపాలన సౌలభ్యం వుంటే ప్రజలకు చాలా సౌకర్యవంతంగా వుంటుందన్నారు. తెలుగు ప్రజలు మూడు రాష్ట్రాలుగా విడిపోవడం సబబుకాదని చాలామంది వాదిస్తున్నారు. హిందీ మాట్లాడే ప్రజలు ఆరు రాష్ట్రాలుగా విడిపోయారు వారేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. తెలుగువారు మూడు రాష్ట్రాలుగా విడిపోతే అభివృద్ధి పథం వైపు సాగిపోతారే తప్ప ఎలాంటి ఇబ్బందులు పడరన్నారు. మన ప్రాంతంలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలన్నా, ఒక పెద్ద పరిశ్రమ స్థాపించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సాగునీరు లేక ఇక్కడి పొలాలు బీడులైపోయినా పట్టించుకునే వారే లేరు. ప్రత్యేక రాష్ట్రం కొరకు కాకపోయినా మన రాయలసీమ అభివృద్ధి కొరకైనా మనం పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం వుందన్నారు. అనంతరం వెలుగోడు మండల అడహక్ కమిటీ అధ్యక్షుడుగా ఎస్.రఘురాముడు, గౌరవాధ్యక్షుడుగా ఖాశింసాహెబ్, ఉపాధ్యక్షుడుగా చండ్రా వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శిగా టి.రహంతుల్లా, సహ కార్యదర్శిగా షేక్ పాపాభై, కోశాధికారిగా భాస్కరగౌడ్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు