Showing posts with label మహానంది. Show all posts
Showing posts with label మహానంది. Show all posts

Friday, 14 October 2011

మహానంది అభివృద్ధి జరగాలంటే వాస్తు పరిశీలన

                                   
మహానంది క్షేత్రం అభివృద్ధి జరగాలంటే ఆలయంలోని ప్రధాన గుండమైన రుద్రగుండం పుష్కరిణి యొక్క పవిత్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ స్థపతి సౌందర్ రాజన్ పేర్కొన్నారు. గురువారం మహానందిలోని వాస్తు పరిశీలన, క్షేత్రం అభివృద్ధి కొరకు చేపట్టాల్సిన పనులను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన క్షేత్రంలోని పరిసర ప్రాంతాలు కలియదిరుగుతూ చేయాల్సిన పనులను, తీసుకోవాల్సిన చర్యలను ఆయన గుర్తించారు. అనంతరం ఆలయ ఇఓ సాగర్‌బాబు, ఎఇ శ్రీనివాసప్రసాద్‌లతో సమావేశమై ఈ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానంది క్షేత్రం అభివృద్ధి జరగాలంటే ముందుగా క్షేత్రంలోని రుద్రగుండం పుష్కరిణిలో గల పంచ లింగాల మండపం పునరుద్ధరించాల్సి ఉందని, పుష్కరిణి యొక్క పవిత్రతను మరింత పెంచాల్సి ఉందన్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులలో భక్తిని పెంచే విధంగా పుష్కరిణిలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై దేవాదాయ శాఖ కమిషనర్‌తో చర్చించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయం లోపల కొన్ని మార్పులు చేయాల్సి ఉందన్నారు. మహానంది దేవాలయానికి అవసరమయ్యే 62 అడుగుల ధ్వజస్తంభం కర్ర దొరకడం లేదని, ప్రస్తుతం గుజరాత్ అడవుల్లో టేకు కర్రను గుర్తించడం జరిగిందని త్వరలోనే మహానందికి చేర్చే ప్రయత్నంలో దాతలు, అధికారులు ఉన్నారన్నారు. క్షేత్రం అభివృద్ధి జరగాలంటే ఈశాన్యంలో గోశాల ఏర్పాటుచేయాలని, ఆగ్నేయంలో ప్రసాదాల తయారీకి వంటశాల, నైరుతిలో భక్తులు అభిషేకాలు చేసుకొనేందుకు గాను నటరాజ మండపం, అభిషేక మండపం ఏర్పాటుచేయాలని, వాయువ్యంలో భగవంతుని కల్యాణం కొరకు కల్యాణ మండపం ఏర్పాటుచేయడం వల్ల వాస్తురీత్యా అభివృద్ధి జరుగుతుందన్నారు. దేవాలయంలో నిర్వహించే కేశఖండనం గదిని ఆలయం నుంచి బయట ప్రాంతంలో ఏర్పాటుచేయాలన్నారు. అలాగే మహానంది ఆలయ ముందు భాగంలో రూ.80 లక్షలతో షెడ్డు నిర్మాణ పనులకు అంచనాలు వేసినట్లు ఆయన తెలిపారు. మొదటి ప్రాకార మండపానికి తూర్పువైపున దారి ఏర్పాటుచేసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అధికారులు, అర్చకులు ఉన్నతాధికారుల సహకారాలు ఉంటే మహానంది క్షేత్రం త్వరలోనే అభివృద్ధి పథంలో చూడవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు