Showing posts with label జిల్లా కలెక్టర్ చిత్తూరు. Show all posts
Showing posts with label జిల్లా కలెక్టర్ చిత్తూరు. Show all posts

Tuesday, 8 November 2011

నేడు ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు రాక


 ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 8.35 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.35 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం 10.45కు బయలుదేరి 11.15 గంటలకు పలమనేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ అధికార, అనధికారులతో సమావేశమవుతారు. 11.20 గంటలకు రోడ్డు మార్గంలోగంగవరం చేరుకుని పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు.
                                                                  
అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.35 గంటలకు డీసీసీ అధ్యక్షుడు సుధాకర్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. 1.55గంటలకు పలమనేరు నుంచి బయలుదేరి 2.10 గంటలకు కలికిరి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొం టారు. సాయంత్రం 5 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి పీలేరుకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొం టారు. మళ్లీ సాయంత్రం 6.40 గంటలకు కలికిరికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళుతారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు

Sunday, 23 October 2011

జిల్లాలోని 25 మండలాల్లో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు

జిల్లాలోని 25 మండలాల్లో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ చెప్పారు. శనివారం ఉదయం డిఆర్‌డిఎ సమావేశ మందిరంలో గ్రామ సమాఖ్య ప్రతినిధులు, ఎపిఎంలతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐకెపి ద్వారా మహిళా సంఘాలు ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నాయని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వల్ల పేద రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరడమేగాక స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా పరిపుష్టి అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఐకెపి సంఘాల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున విజయవంతంగా జరుగుతోందన్నారు. అనంతపురం జిల్లాలో కూడా ఇటీవల ఈ కార్యక్రమం ప్రారంభమైందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో కూడా రామచంద్రాపురం, వెదురుకుప్పం, వాల్మీకిపురం, గుర్రంకొండ, కలికిరి, కలకడ, పిటిఎం, బి.కొత్తకోట, మదనపల్లి, నిమ్మనపల్లి, మొలకలచెరువు, తంబళ్లపల్లి, పెద్దపంజాణి, రామసముద్రం, సోమల, కుప్పం, తూర్పుప్రాంతాల్లోని తొమ్మిది మండలాలో కలిపి 25 మండలాల్లోకెపి సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రతి సమాఖ్య ఐదుగురి సభ్యులతో సేకరణ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఈ కమిటీలకు రెండు రోజుల శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎలాంటి ధాన్యం కొనుగోలు చేయాలి, ధాన్యంలో తేమ కొలవడానికి యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూనిక పరికరాలు, గోనె సంచిలు అందజేస్తామని చెప్పారు. శిక్షణా కార్యక్రమంలో సమగ్రంగా అవగాహన కలిగిస్తామని చెప్పారు. వ్యవసాయ, రెవిన్యూ శాఖల ద్వారా రైతుల్లో కూడా అవగాహన కల్పించాలని తెలిపారు