Showing posts with label అనంతపురం వేరుశెనగ. Show all posts
Showing posts with label అనంతపురం వేరుశెనగ. Show all posts

Thursday, 13 October 2011

మూతబడుతున్న ఆయిల్ మిల్లులు దిక్కుతోచని స్థితిలో రైతన్న

కొనబోతే శొంఠి ధర .. అమ్మబోతే అల్లం ధర .. అన్న చందంగా తయారైంది జిల్లాలో వేరుశెనగ సాగు చేసిన అన్నదాత పరిస్థితి. పంట సాగుచేసేటప్పుడు అధిక ధరకు విత్తనం కొని పంట చేతికి వచ్చిన సమయంలో అమ్మడానికి వెళ్తే కొన్న ధర కన్నా తక్కువ ధరకు అమ్మాల్సి రావడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. అసలే అరకొర పంట .. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందే పరిస్థితి లేదు. ఆర్థిక శాస్త్రం సిద్ధాంతం ప్రకారం.. ఉత్పత్తి పడిపోతే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే అధిక ధర దక్కుతుంది. కానీ జిల్లాలో అన్నదాత పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. కొనేప్పుడు అధిక ధర పెట్టి కొనాలి .. అరకొరగా పంట చేతికి వచ్చి డిమాండ్ పెరిగినా తక్కువ ధరకే అమ్ముకోవాలి. ఇదీ జిల్లాలో వేరుశనగ రైతు దైన్యస్థితి. 2011 ఖరీఫ్‌లో వేరుశెనగ విత్తనం బహిరంగ మార్కెట్‌లో 40 కిలోల బస్తా ధర రూ.1700 లకు పైగా పలికింది. ఆనాటి ధర ప్రకారం అప్పట్లో క్వింటాళు వేరుశెనగ విత్తనకాయల ధర రూ.4250 వరకూ ఉండేది. ప్రభుత్వం సబ్సిడీతో పంపిణీ చేసిన వేరుశనగ విత్తనకాయలు క్వింటాలు ధర రూ. 3600. ఖరీఫ్‌లో ఆ ధర ప్రకారం కొన్న రైతు ప్రకృతి ప్రకోపానికి తలొగ్గి ఆరుగాలం కష్టపడిన తరువాత చేతికొచ్చిన పంటను అమ్మబోతే సబ్సిడీ ధర కంటే తక్కువ పలుకుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో 40 కిలోల బస్తా రూ. 1300 ధర పలుకుతోంది. క్వింటాళు వేరుశెనగ విత్తనకాయల ధర ప్రస్తుతం రూ. 3250. దీని ప్రకారం చూస్తే ప్రభుత్వమిచ్చిన సబ్సిడీ ధర కంటే రూ. 350 తక్కువ. అంతే తక్కువ ధరకే రైతులు వేరుశెనగను అమ్ముకోవాల్సిన పరిస్థితి. సబ్సిడీ కాయలు కాకుండా బహిరంగ మార్కెట్‌లో రూ. 4250తో కొనుగోలు చేసిన రైతు క్వింటాలు వేరుశనగపై రూ. 1000 వరకూ నష్టపోతున్నాడు. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వేరుశనగ వ్యాపారులు అంటున్నారు. రాబోయే రోజుల్లో దీని ధర రూ. 1000 నుంచి రూ. 1200లు అయినా ఆశ్చర్యం లేదని వారంటున్నారు. అరకొరగా పంట చేతికి వచ్చిన సమయంలో రోజు రోజుకూ వేరుశెనగ ధర పడిపోతుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆరుగాలం కష్టపడినా ప్రకృతి కరుణించకపోవడంతోపంట పూర్తిగా చేతికి అందలేదు. జిల్లాలో సెప్టెంబరు నెలలో నెలకొన్న వర్షాభావంతో ఆశించిన దిగుబడి రాకుండాపోయింది. చెట్టుకు ఒకటి రెండు కాయలు మాత్రమే కాశాయి. అరకొరగా దక్కిన పంటనే ఏదో ఒక విధంగా పొలం నుంచి తెచ్చుకుని అమ్ముకుందామని ప్రయత్నిస్తున్న రైతుకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. వేరుశెనగ వ్యాపారుల రంగ ప్రవేశంతో ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీకి అప్పులు చేయడంతో ప్రస్తుతం ధర ఎంత పలికినా అమ్ముకోవాల్సిందే. పంట చేతికి వచ్చిందంటే అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికమవుతుంది. దీంతో ఏదో అయిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి. అన్నదాత అవసరాన్ని గుర్తించిన దళారీలు, వ్యాపారులు వారిని నిలువునా ముంచేందుకు సిద్దమయ్యారు. నిన్న మొన్నటి వరకూ బస్తా రూ. 1700 పలికిన వేరుశెనగ ధర ఏకంగా రూ. 1300లకు పడిపోయింది. అరకొర పంటతో అల్లాడుతున్న అన్నదాతకు మార్కెట్‌లో ధర పడిపోవడం ఆశనిపాతమే. ఖరీఫ్‌లో ఎకరాకు రూ.పదివేల పెట్టుబడి పెట్టి సాగు చేశారు. ఎకరానికి 400 కిలోల దిగుబడి రావాల్సిన చోట వంద కిలోల లోపే వచ్చింది. అరకొరగా వచ్చిన పంటను అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లభించడం లేదు